
చంఢీఘడ్ : తనను ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి లైంగిక వేధింపులకు గురిచేశాడంటూ ఓ మహిళా ఐఏఎస్ అధికారి ఫేస్ బుక్‌లో పోస్ట్ చేయడం హరియాణాలో కలకలం సృష్టిస్తోంది. ప్రభుత్వ ఫైళ్లల్లో వ్యతిరేకంగా రాయడం వల్లే తనను వేధిస్తున్నాడని ఆమె పేర్కొంది. ఆ అధికారి తనపై అనుచిత వాఖ్యలు చేశాడని, అసభ్యకరంగా ప్రవర్తించాడని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.
‘ నన్ను ఈ నెల 6న సాయంత్రం 5 గంటలకు కలవమని ఆ అధికారి చెప్పారు. నేను ఆయన ఆఫీస్‌కు వెళ్లాను. ఆ సమయంలో ఆయన ఆఫీస్‌లోని ఎవరిని అనుమతించలేదు. నేను అతని ముందు కుర్చిలో కూర్చున్నాను. ఆయన అక్కడ వద్దని చెప్పి తన పక్కన ఉన్న కుర్చిలో కూర్చోమన్నారు. ఆ సమయంలో నాపై దురుసుగా ప్రవర్తించారు. నేను వెంటనే కూర్చిని పక్కకు నెట్టాను’ అని ఆమె ఫేస్‌బుక్‌లో తెలిపారు.
గతంలో కూడా అధికారిక ఫైళ్లల్లో తమకు వ్యతిరేకంగా రాయొద్దని బెదిరించారని పేర్కొన్నారు. ఆ సమయంలో తనను కొత్త పెళ్లి కూతురితో పోలుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశాడని వాపోయారు. అంతే కాకుండా మరో మహిళ అధికారిణి కూడా తనను బెదిరించిందని తెలిపిపారు.
తనకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెక్యూరిటీని తొలగించారని, ఈ విషయంపై రాష్ట్రపతి భవన్ అధికారులకు మెయిల్ చేశానని పేర్కొంది. అధికారిక ఫైళ్లలో వ్యతిరేకంగా రాయొద్దంటూ తరచూ బెదిరిస్తున్నారని వాపోయారు.
కాగా ఈ విషయాన్ని ఆ సీనియర్ అధికారి ఖండించారు. ఆమె చెప్పేది అసత్యాలు, నిరాధారమైనవని వ్యాఖ్యానించారు. ‘ ఆమెపై ఎలాంటి అనుచిత వాఖ్యలు చేయలేదు. ఆమెను ఆఫీస్‌కు పిలిచించింది వాస్తవమే. ఆ సమయంలో నా ఆఫీస్‌లోకి చాలా మంది వచ్చి వెళ్లారు. కొద్ది నిమిషాలు మాత్రమే ఆమె ఒంటరిగా ఉంది. ఆమెకు కావాల్సిన సదుపాయాలు అన్ని ఏర్పాటు చేశాం. అన్ని శాఖల అధికారులు ఒప్పుకున్న ఫైళ్లను ఆమె వ్యతిరేకించింది. అలా ప్రతి ఫైల్‌పై వ్యతిరేక కామెంట్లు రయొద్దంటూ సలహా ఇచ్చాను. ఆమె యంగ్ ఆఫీసర్ అని మాత్రమె నేను సలహాలు ఇచ్చాను. కానీ నాపై నిరాధరమైన అసత్యాలను ప్రచారం చేస్తోంది’ అని ఆ అధికారి పేర్కొన్నారు.
కాగా సీనియర్ అధికారి వ్యాఖ్యలపై మహిళా ఐఏఎస్ స్పందిస్తూ..‘ నేను ఫేస్ బుక్‌లో చెప్పిన ప్రతి మాట వాస్తవం. కొద్దిరోజుల్లో సీసీటీవీ పుటేజీ నుంచి అసలు నిజాలు బయటపడతాయి’ అని పేర్కొన్నారు