దీప్తి.. కార్పొరేషన్‌నూ వదల్లేదు

Woman Cheated As Name With Jobs In Guntur - Sakshi

సాక్షి, గుంటూరు : నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకొని ఘరానా మోసాలకు పాల్పడిన మామిళ్ళపల్లి దీప్తి చేతివాటం ప్రదర్శించడంలో తనదైన ముద్ర వేసుకుంది. సీఎంవోలో పీఏగా పని చేస్తున్నానంటూ ఉద్యోగాలు ఇప్పిస్తానని, సివిల్‌ వివాదాలు పరిష్కరిస్తానని చెప్పి అమాయకుల నుంచి రూ.70 లక్షలకు పైగా దోచుకొని బాధితుల ఫిర్యాదుతో పరారైన విషయం తెలిసిందే. ఆమె మోసాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. గుంటూరు కార్పొరేషన్‌లో ఆనందలహరి కార్యక్రమం నిర్వహించేందుకు టీడీపీ హయాంలో  మంత్రి సాయంతో కాంట్రాక్ట్‌ను కొట్టేసింది.  

ఆనందలహరి నిర్వహణ కోసం..
2017లో అప్పటికే దీప్తికి మాజీ మంత్రితో సన్నిహిత సంబంధం ఏర్పడింది. దానిని అడ్డుగా పెట్టుకొని గుంటూరు కార్పొరేషన్‌ అధికారులకు తరచూ ఫోన్‌ చేయించి వారిని దారికి తెచ్చుకుంది. ఈ క్రమంలో గుంటూరులో ప్రతి ఆదివారం ఆనందలహరి పేరుతో కార్యక్రమం నిర్వహించేందుకు కార్పొరేషన్‌ దరఖాస్తులు ఆహ్వానించింది. దీంతో దీప్తి తన స్వచ్ఛంద సంస్థకు అర్హత లేకపోయినప్పటికీ దరఖాస్తు చేసుకుంది. అదే సమయంలో మరో సంస్థ నిర్వాహకులు కూడా దరఖాస్తు చేశారు. వెంటనే కాంట్రాక్ట్‌ తనకే ఇవ్వాలంటూ దరఖాస్తు మంజూరు చేసే అధికారిని సైతం మభ్యపెట్టి సదరు మాజీ మంత్రితో కార్పొరేషన్‌ రికమండ్‌ చేయించి కాంట్రాక్ట్‌ దక్కించుకుంది. ప్రతి వారం కార్యక్రమం నిర్వహణకు కార్పొరేషన్‌ రూ.60 వేల చొప్పున చెల్లుస్తుంది. నిబంధనల ప్రకారం కార్యక్రమం కొనసాగించకుండా రూ.20 వేలలోపు ఖర్చుతో మమ అనిపించింది. దీంతో నగరంలో కార్యక్రమం నిర్వహణపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అప్పటికే ఏడాదిపాటు కార్యక్రమం కొనసాగింది. ఈ క్రమంలో కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రీకేష్‌ లఠ్కర్‌ ఇదంతా దోపిడీ అని తేల్చి బిల్లులు నిలుపుదల చేశారు. 

మళ్లీ బిల్లుల చెల్లింపుల కోసం...
అప్పట్లో పర్యవేక్షణాధికారిగా పని చేసి అనంతరం బదిలీపై వెళ్లిన అధికారి మళ్లీ బదిలీపై ఇక్కడకే వచ్చారు. దీంతో దీప్తి, ఆమె స్నేహితులు సదరు అధికారి వద్దకు వెళ్లి బిల్లులు మంజూరు చేయాలని కోరారు. అందుకు కమిషన్‌ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం బిల్లు పెండింగ్‌లో ఉంది. 

మంగళగిరి మాయ‘లేడీ’ ఉలికిపాటు
మంగళగిరిలో మరో కలాడీ లేడీ బాగోతం అంటూ సాక్షి దినపత్రికలో ఆదివారం ప్రచురితమైన కథనం టీడీపీ నాయకులను ఉలిక్కిపాటుకు గురి చేసింది. విజలెన్స్‌ అధికారులు సైతం బాధితుల వివరాలను సేకరించే పనిలో పడ్డారు. తెనాలిలోని ప్రైవేటు ఇన్సూరెన్స్‌ కంపెనీలో సేల్స్‌ మేనేజర్‌గా పని చేసిన కిలాడీ లేడీ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీ నాయకులతో సన్నిహిత సంబంధాలు కొనసాగించింది. మాజీ హోంమంత్రి చినరాజప్పతో తనకు పరిచయాలు ఉన్నాయని పలువురిని నమ్మించింది. సేల్స్‌ మేనేజర్‌గా పని చేసిన సమయంలో తనతో పని చేసిన సహ ఉద్వోగులకు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్వోగాలు ఇప్పిస్తానని చెప్పి లక్షల రూపాయలు వసూలు చేసింది. 

తాజాగా సాక్షి దినపత్రికలో కథనం రావడంతో కిలాడీ లేడీ ఉదయం నుంచి బాధితులకు ఫోన్‌ చేసి తాను విదేశాలలో ఉన్నానని, వారంలో వచ్చి డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని నమ్మబలుకుతోంది. దీనిపై ఎవరికీ ఫిర్యాదు చేయవద్దంటూ బతిమాలుతున్నట్లు సమాచారం. కొందరు బాధితులు వెంటనే తాము ఇచ్చిన డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేయాలని, లేదంటే సోమవారం స్పందనలో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించినట్లు తెలిసింది.

చదవండి: నకిలీ ఐడీ కార్డుతో దీప్తీ బురిడీ..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top