వేషం మార్చి... పరారీకి యత్నించి...

Woman Arrest In Swamy ji Murder Case Karnataka - Sakshi

మఠాధిపతి సన్నిహితురాలు        రమ్యాశెట్టి అరెస్ట్‌ ?

మఠం బావిలో మద్యం బాటిల్‌.. డీవీఆర్‌ లభ్యం !

కేసు పురోగతిపై చర్చించిన ఐజీ చక్రవర్తి

యశవంతపుర : ఉడిపి శిరూరు మఠాధిపతి లక్ష్మీవర తీర్థ స్వామి మృతికి సంబంధించి ఆయన సన్నిహితురాలిగా భావిస్తున్న రమ్యాశెట్టి సోమవారం పోలీసుల కళ్లుగప్పి పారిపోవడానికి యత్నించి చివరకు పట్టుపడ్డారు. వివరాలు... అనుమానితులను పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో సోమవారం ఉదయం రమ్యాశెట్టిని దర్యాప్తు బృందం విచారణ చేసింది.  మళ్లీ మధ్యాహ్నం హాజరు కావాలని  సూచించారు. అయితే ఆమె బుర్కా ధరించి తన ముగ్గురు స్నేహితురాళ్లతో తప్పించుకోవడానికి పథకం వేసింది. ఒక కారులో ముగ్గురు బయలుదేరారు. వీరిపై నిఘా పెట్టిన పోలీసులు మరోవాహనంలో వెంబడిం చారు. కారు బెళ్తంగడి తాలూకా అళదంగడి శ్రీ సత్యదేవద ఆలయం వద్ద రమ్యా కారు పంక్చర్‌ అయ్యింది. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా రమ్యగా గుర్తించి అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. రమ్య కుమారుడితో పాటు అతని స్నేహితులను కూడా సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా మఠానికి చెందిన మాజీ మేనేజర్‌ సునీల్‌ సంపిగెత్తాయను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

అమ్మకానికి శిరూరు టవర్స్‌
మణిపాల్‌లోని శిరూరు టవర్స్‌ను స్వామిజీ విక్రయానికి నిర్ణయించారు. టవర్స్‌ను అమ్మే విషయంపై జ్యోతిషుడు ప్రజ్వల్, రియల్‌ వ్యాపారి కిశోర్‌ల వద్ద చర్చించినట్లు సమాచారం. పది ఎకరాల్లో విస్తరించిన ఈ టవర్‌ను రూ.180 కోట్లకు విక్రయించాలని నిర్ణయించారు. అదే వ్యవహారమే ఆయన మృతికి కారణమై ఉంటుందని భావిస్తున్నారు.

బావిలో సీసీ కెమెరా డీవీఆర్‌ : మఠంలో సీసీ కెమెరాలు, డీవీఆర్‌లు మఠం బావిలో పడేసినట్లు అనుమానం రావడటంతో సోమవారం రాత్రి వరకు పోలీసులు మఠం బావిలో గాలించారు. అయితే అందులో మద్యం బాటిళ్లు లభించడంతో పాటు మరికొన్ని వస్తువులు లభించాయి. అదృశ్యమైన సీసీ కెమెరా డీవీఆర్‌ దొరికిందని ప్రచారం జరగడంతో  ఐజీ చక్రవర్తి, ఉడిపికి వచ్చారు. కేసు పురోగతిపై ప్రత్యేక బృందాలతో ఆరాతీశారు. అనంతరం మఠాన్ని సందర్శించి కొన్ని గదులను పరిశీలించారు. మూలమఠంలోని బృందావనం వద్దకు వెళ్లి ఎస్‌పీ లక్ష్మణ్‌ నింబర్గితో మాట్లాడారు.

ఎవరిని అరెస్ట్‌ చేయలేదు
యశవంతపుర : మఠాధిపతి లక్ష్మీవర తీర్థ స్వామి మృతి కేసులో ఎవరిని అరెస్ట్‌ చేయలేదని పశ్చిమ విభాగం ఐజీపీ అరుణ్‌ చక్రవర్తి తెలిపారు. మంగళవారం ఆయన ఉడిపి ఎస్‌పీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. స్వామి మృతి కేసును విచారణకు ఐదు బృందాలు రంగంలోకి దిగినట్లు చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న సందేహాలను నమ్మవద్దని భక్తులు సూచించారు. మంగళవారం పరారవుతున్న రమ్యాశెట్టిని అరెస్టు చేసిన విషయంపై ఐజీ సమాధానం దాటవేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top