మఠాధిపతి మృతికి ముంబై లింకు?

Swamy Ji Death Mystery Links In Mumbai - Sakshi

లక్ష్మీవర తీర్థస్వామి కేసు రోజుకోమలుపు

మఠంలో సీసీ కెమెరాలు మాయం

మహారాష్ట్ర వెళ్లిన ప్రత్యేక బృందం

యశవంతపుర: శిరూరు మఠాధిపతి లక్ష్మీవర తీర్థస్వామి అనుమానాస్పద మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మఠంలో అమర్చిన సీసీ కెమెరా డీవీఆర్‌ అదృశ్య కావడంతో పథకం ప్రకారమే ఆయనపై విష ప్రయోగం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వామి మరణానికి కొద్ది రోజుల ముందు మఠానికి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి సీసీ కెమెరాలు ఎత్తుకెళ్లినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటిని ఎత్తుకెళ్లిన వ్యక్తి ఎవరనేది పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇదిలాఉంటే రమ్యాశెట్టికి స్వామీజీ ఒక ఫ్లాట్‌ కూడా కొనుగోలు చేసి ఇచ్చినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. దీనికి తోడు రెండు రోజుల క్రితం స్వామిజీ ఆప్తుడిగా భావిస్తున్న జగదీశ్‌ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అతడి విచారణలో పోలీసులు కీలక సమాచారం లభించినట్లు బయటపడింది. మఠంలో సీసీ కెమెరాలు కూడా మాయం కావడంతో పోలీసులకు బలమైన ఆధారాలు లభించలేదు. కెమెరాల అదృశ్యం వెనుక ముంబై మాఫియా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గత సోమవారం మూల మఠంలో వనమహోత్సవం సందర్భంగా వంట మనుషులను కూడా పోలీసులు పిలిపించుకుని విచారణ చేస్తున్నారు. విచారణలో రోజుకోమలుపు తిరుగుతుండటంతో ఏడు బృందాలు విచారణలో నిమగ్నమయ్యాయి. 

ముంబై వెళ్లిన పోలీసు బృందం
లక్ష్మీవర తీర్థ స్వామిజీ మరణం వెనుక భూ మాఫియా ఉండవచ్చనే అనుమానంతో ప్రత్యేక పోలీసు బృందం ముంబై వెళ్లింది. మఠం పేరుతో దాదాపు రూ. 500 కోట్ల విలువైన మూడు వందల ఎకరాల భూమి ఉంది. దీంతో పాటు భూ కబ్జాతో పాటు రూ. కోట్ల విలువైన ఆభరణాలను కూడా దోచుకోవచ్చనే ఉద్దేశ్యంతో ముంబై మాఫియా ఈ ఘాతుకానికి పాల్పడి ఉండచ్చని అనుమానం కలుగుతోంది. ఇక కొన్ని సందేశాలు వాట్సాప్‌ గ్రూప్‌ల్లో వైరల్‌గా మారడంతో ఆ దిశగా కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.

రమ్యాశెట్టికి భూ మాఫియాకుఏమిటీ సంబంధం?
పోలీసులు అదుపులో ఉన్న రమ్యాశెట్టికి ముంబైకి చెందిన భూ మాఫియాకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే అనుమానం పోలీసులకు కలుగుతోంది. మోసపోయిన ఇద్దరు పారిశ్రామికవేత్తలు స్వామి వద్ద అప్పుగా డబ్బులు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.  ఈ వ్యవహారంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అదే విధంగా స్వామీజీ ఉపయోగిస్తున్న మూడు మొబైల్‌ నెంబర్లకు చెందిన ఫోన్‌కాల్‌ డాటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. స్వామిజీ పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాతనే కేసు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే సందేశాలను ఎవరూ నమ్మవద్దని ఉడిపి జిల్లా ఎస్‌పీ లక్ష్మన నింబరిగి భక్తులకు విజ్ఞప్తి చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top