గౌరవ్వ హత్యకు కారణాలేమిటో..!

Who killed gowravva - Sakshi

అదృశ్యమైన మూడు నెలల తర్వాత అస్థిపంజరం లభ్యం

ఆభరణాల కోసమే హత్య చేశారా..?

గురువన్నపేటలో భయం భయం

సాక్షి, సిద్దిపేట : ఏడు పదుల వయస్సులో కుటుంబ సభ్యులపై ఆధారపడకుండా తన పని తాను చేసుకుంటూ అందరి నోళ్లలో నాలుకలా ఉండే సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం గురువన్నపేట గ్రామంలోని పండుటాకు బండారి గౌరవ్వ హత్య సంఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అదృశ్యమైన అవ్వ మూడు నెలల తర్వాత అస్థిపంజరంగా కన్పించడంతో.. అసలు ఆమెను హత్య చేసిందెవరు..? డబ్బులు, ఆభరణాల కోసమేనా హత్య చేశారా? లేదా ఇంకేమైనా మర్మం దాగుందా..

అదే గ్రామానికి చెందిన వారే ఈ పాపానికి ఒడిగట్టారా అనేది చర్చగా మారింది. గౌరవ్వ హత్య వార్త తెలియడంతో ఆ గ్రామంలోని వారు పొద్దుకూకితే చాలు బయటకు రావడానికి సాహసించడం లేదు. మరో వైపు హత్య మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. 

అదృశ్యమై.. అస్థిపంజరమై.. 

గురువన్నపేట గ్రామానికి చెందిన బండారి గౌరవ్వ(75) ఈ ఏడాది జనవరి 22న అదృశ్యమై ఏప్రిల్‌ 23న అస్థిపంజరంగా దొరికింది. గౌరవ్వ అదృశ్యమైన రోజే కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఏప్రిల్‌ 23న రాత్రి గౌరవ్వ పుర్రె, చీరను కుక్కలు బయటకు తీయడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. వృద్ధురాలి మృతదేహాన్ని పోలీసులు బటయకు తీయగా ఒక వైపు శరీర భాగాలు మాత్రమే ఉన్నట్లు, కాలుకు కడియం, చేతులకు కడెం, వెండి గాజులు ఆమె చేతికి ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

గౌరవ్వను ఇంట్లో హత్య చేసి అదే గ్రామంలోని కాముని చెరువు పక్కన తాళ్ళవాగులో చిన్నగా రెండు ఫీట్ల లోతుగా గుంతలు తీసి పాతపెట్టారు. గౌరవ్వ ఇంట్లో మెడ నుంచి తెగిపోయిన నల్లపూసలు కింద పడిన ఆనవాళ్లున్నాయి. అదే గదిలో ఉన్న చాపలో మృతదేహాన్ని వాగుకు చేర్చినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అంటే గౌరవ్వను ఇంటి వద్దనే హత్య చేసి గుట్టుచప్పుడు కాకుండా చెరువులోకి తీసుకెళ్లి పూడ్చేశారనేది స్పష్టంగా అర్థమవుతోంది. 

ఒంటి నిండా ఆభరణాలు?

గౌరవ్వ మెడలో నాలుగు తులాల బంగారు గుండ్లు, ఏనెలు, గెంటీలు ఉండగా సుమారు కిలో వెండి ఆభరణాలు ధరించి ఉంది. అదేవిధంగా ఆమె ఇంట్లో రూ. 30వేల నగదు ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బంగారు, వెండి ఆభరణాలకు తోడు నగదు అపహరించడం కోసం ఆమెను హత్య చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. అయితే ఆభరణాలకోసమే హత్య చేస్తే ఆమె కా లుకు కడియాలు, చేతికి ఉన్న గాజులను ఎం దుకు తీసుకెళ్లలేదనేది ప్రశ్నార్థకంగా మారింది. శవాన్ని ఇంటి నుంచి తీసుకెళ్లిన దొంగలు మిగిలిన ఆభరణాలు ఎందుకు తీసుకోలేదనే కోణంలో కూడా ఆలోచించాల్సి ఉంటుంది. 

అదను చూసి హత్య.. 

గౌరవ్వను అదను చూసి హత్య చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. జనవరిలో కొమురవెల్లి జాతరకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. అక్కడి నుంచి కొండపోచమ్మ దేవాలయానికి వచ్చి వెళ్తుంటారు. గౌరవ్వ ఇంటి పరిసర ప్రాంతంలో గౌడ, కుమ్మరి, గొల్ల కులస్తులు ఉంటారు. ఈ మూడు కులాల వారికి జాతర సందర్భంగా కల్లు, కుండలు అమ్మడంతోపాటు గొల్ల కులస్తులు డోలు కొట్టేందుకు వెళ్తారు. ఇంటిలో పసిపిల్లలు, వృద్ధులు మాత్రమే ఉంటారు.

ఈ సమయం అనుకూలమైనదిగా భావించి గౌరవ్మను ఇంటిలోనే హత్య చేసి గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని బయటకు తీసుకెళ్లి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. అయితే గౌరవ్వ వద్ద బంగారం, వెండి ఆభరణాలతోపాటు రూ.30వేల నగదు ఉందనే విషయం స్థానికులు, గౌరవ్వతో మంచి సంబం ధాలు ఉన్న వారికి మాత్రమే తెలిసే అవకాశం ఉంది. గౌరవ్వను హత్యకు తెలిసిన వారే పాల్ప డి ఉంటారని కూడా ప్రచారం జరుగుతోంది.

ఆ మెను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షిం చాలని కుటుంబీకులు పోలీసులను కోరుతున్నారు. గ్రామంలో ఇదే మొదటి సంఘటన కావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.    వేలాది మంది భక్తులు వస్తూ ఉండే కొండపోచమ్మ దేవాల యం సమీపంలో వెలుగు చూసిన హత్య సంఘటన ఛేదించడం జిల్లా పోలీసులకు కూడా ఛాలెంజ్‌గా మారింది. జిల్లాకు కొత్త పోలీస్‌ బా స్‌ వచ్చిన తర్వాత తొలి కేసు ఇదే కావడంతో ఆ యన ఈ విషయంపై సీరియస్‌గా ఉన్నట్లు తెలి సింది. ఈ నేపథ్యంలో గౌరవ్వ హత్య సంఘటన పోలీసులు ఎప్పుడు ఛేదిస్తారో వేచి చూడాలి. హత్య కేసులో నిందితులెవరనేది ఉత్కంఠగా మారింది.

విచారణ చేపడుతున్నాం..  

గౌరవ్వ హత్యపై విచారణ చేపడుతున్నాం. ప్రస్తుతం కొంత మందిని విచారించాం.  గౌరవ్వ మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులు ఫార్మాలిటీస్‌ పూర్తి చేస్తున్నారు. త్వరలో పూర్తి సమాచారం సేకరిస్తాం. ఇప్పటికే అనేక కోణాల్లో కేసును విచారిస్తున్నాం.            – సత్తీష్, ఎస్‌ఐ, కొమురవెల్లి 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top