పెరుగుతున్న మలేషియా బాధితులు

Victims Hikes In Malaysia cheating case - Sakshi

వేంపల్లె : మలేషియాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు రాబట్టి.. వారికి టూరిస్టు వీసా ఇచ్చి మోసం చేసిన కేసులో మామాఅల్లుళ్లు ఫకృద్దీన్, సలీం బాధితులు రోజురోజుకు పెరుగుతున్నారు. వేంపల్లె, చిలంకూరు, కడపకు చెందిన ఏడుగురు యువకులకు వారు ఈ విధంగా చెప్పి మోసం చేశారు. ఈ కారణంగా బాధితులు విదేశాల్లో అష్టకష్టాలు ఎదుర్కొని స్వదేశానికి తిరిగి వచ్చారు. వారితోపాటు మరికొందరు మంగళవారం వేంపల్లె గరుగువీధిలో నివసిస్తున్న ఫకృద్దీన్, సలీం ఇంటి వద్దకు వెళ్లారు.

తమకు జరిగిన మోసంపై పలువురు నిలదీశారు. దీనికి వారు సానుకూలంగా స్పందించకపోగా.. ఏం చేసుకుంటారో చేసుకోవాలని నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. మామ, అల్లుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిపై చీటింగ్‌ కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న మరి కొంత మంది బాధితులు వేంపల్లె పోలీస్‌స్టేషన్‌కు వస్తున్నారు. బాధితులు ఇంకెంత మంది ఉన్నారోనని పోలీసులు ఆరా తీస్తున్నారు. జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మరి కొంత మంది మలేషియాలోని జైలులోనే ఉన్నట్లు తెలియవచ్చింది. ఫిర్యాదుదారులతో నిందితులు బేరసారాలు సాగిస్తున్నారు. ఈ విషయమై ఎస్‌ఐ చలపతిని వివరణ కోరగా.. ఇప్పటి వరకు 15 మంది బాధితులు తమను సంప్రదించారని తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top