క్యాషియర్‌పై దాడి చేసి దోపిడీ

Unknown Persons Attacked The Lorry Transport Cashier & Robbed Money At Vijayawada  - Sakshi

రూ.4 లక్షలు చోరీ

ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో ఘటన

సాక్షి, విజయవాడ: లారీ ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలోని క్యాషియర్‌పై కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో దాడి చేసి రూ.నాలుగు లక్షల నగదును దోచుకెళ్లిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పంజా సెంటర్‌లోని ఇస్లాంపేటలోని ఓ ప్రయివేటు ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో అలహాబాద్‌కు చెందిన ప్రదీప్‌ పాండే రెండేళ్లగా క్యాషియర్‌గా పని చేస్తున్నాడు.

ప్రతి రోజు ఉదయం 9 గంటలకు వచ్చి రాత్రి 10 గంటల వరకు విధులు నిర్వహిస్తుంటాడు. శనివారం కావడంతో వారంలో ఎక్కువ మొత్తం కలెక్షన్‌ రావడంతో ఆ డబ్బులు లెక్కించుకునే క్రమంలో  రాత్రి ఆలస్యం అయింది. రాత్రి 10 గంటల సమయంలో బయట వర్షం కురుస్తున్న తరుణంలో ముగ్గురు వ్యక్తులు కార్యాలయం లోపలకు వచ్చారు.

ముగ్గురు వ్యక్తులు ముఖానికి ముసుగులు ధరించి ఉండటం, చేతిలో కర్రలో ఉండటంతో పాండే గట్టిగా కేకలు వేశాడు. అప్పటికే లోపలకు వచ్చిన ఆ యువకులు పాండేపై దాడి చేసి క్యాష్‌ కౌంటర్‌లో ఉన్న నాలుగు లక్షల రూపాయలను ఎత్తుకెళ్లారు. బాధితుడిపై దాడి చేసే క్రమంలో కార్యాలయంలోని సామగ్రిని దుండగులు ధ్వంసం చేశారు. ముసుగు వ్యక్తుల దాడిలో తీవ్రగాయాలైన పాండే వెంటనే కొత్తపేట పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుల నుంచి వివరాలను నమోదు చేసుకున్నారు. ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో సీసీ కెమెరాలు ఉన్నా నిందితులు ధైర్యంగా లోపలకు ప్రవేశించి దాడి చేయడంపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్‌పోర్టు కార్యాలయం గురించి బాగా తెలిసిన వారే ఈ పని చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ పని చేసే 12 మంది సిబ్బంది వివరాలు, ఫోన్‌ నంబర్లు సేకరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top