పగలే దోపిడీకి యత్నం..!

Two Young Men Arrest in Robbery Case Nalgonda - Sakshi

బైక్‌పై వెంబడించి మహిళ మెడలో చైన్‌ లాగిన దుండగులు

బాధితుల కేకలతో అప్రమత్తమైన స్థానిక యువకులు

పారిపోతుండగా పట్టుకునిపోలీసులకు అప్పగింత

నిందితుల నుంచి బైక్, కత్తి స్వాధీనం

సంస్థాన్‌ నారాయణపురం (మునుగోడు) : పట్టపగలే ఇద్దరు యువకులు దారి దోపిడీకి యత్నించారు. బైక్‌ ను వెంబడించి మహిళ మెడలో బంగారు గొలుసును అపహరించేందుకు ప్రయత్నించారు. బాధితుల కేకలతో అప్రమత్తమైన స్థానిక యువకులు పారిపోతుండగా వారిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన సంస్థాన్‌నారాయణపురం మండల పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన బాలగోని మల్లేష్, అనిత దంపతులు ఉదయం పని నిమిత్తం చౌటుప్పల్‌ మండలం అంకిరెడ్డిగూడెం వెళ్లారు. అక్కడ పని ముగగిసిన అనంతరం తిరిగి బైక్‌పై కొత్తగూడెం గ్రామానికి వస్తున్నారు. వీరిని ఇద్దరు యువకులు చిమిర్యాల గ్రామం నుంచి బైక్‌పై వెంబడించారు.

మూలమలుపు వద్దకు రాగానే..
మల్లేష్, అనిత దంపతులు సంస్థాన్‌ నారాయణపురం శివారు దాటి కొత్తగూడెం గ్రామ పరిధిలోని మూలమలుపు వద్దకు వచ్చారు. ఈ క్రమంలో వారినే వెంబడిస్తున్న యువకుల్లో ఒకరు అనిత మెడలో ఉన్న పుస్తలతాడును లాగాడు. అది తెగి అనిత దుస్తుల్లో పడింది. వెంటనే మల్లేష్, అనిత కేకలు వేస్తూ దుండగుల బైక్‌ను వెంబడించారు. వీరి కేకలు విన్న కొత్తగూడెం గ్రామానికి చెందిన యువకులు మారగోని శేఖర్, కొడూరి శ్రీశైలంలు దుండగులు బైక్‌ను వెంబడించారు. పుట్టపాక గ్రామా చౌరస్తాలో మరో వాహనం ఎదురుగా రావడంతో దుండగులు అదుపుతప్పి కిందపడిపోయారు.  వెంటనే, శేఖర్, మల్లేష్‌లు వారిని పట్టుకున్నారు. దుండగుల బైక్‌ నుంచి కత్తి పడటంతో అక్కడే ఉన్న కొంత మంది గ్రామాస్తులు వారిని చితకబాదారు. అనంతరం సమాచారమిచ్చి పోలీసులకు అప్పగించారు. బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువకులు చౌటుప్పుల్‌ మండలం ఎస్‌.లింగోటం గ్రామానికి చెందిన శంకర్, వలిగొండ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన వెంకటనర్సింహగా అనుమానిస్తున్నారు. చిమిర్యాలలో  చైన్‌ స్నాచింగ్‌కు వీరే పాల్పడ్డారని అనుమానిస్తూన్నారు. బైక్‌ కూడా చోరీ చేసి ఉంటారన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top