ఆ ఆత్మహత్యలకు.. ‘ఆర్‌ఎక్స్‌100’స్ఫూర్తి!

Two Students Commit Suicide By Inspiring Telugu Movie - Sakshi

సాక్షి, జగిత్యాల: ఇద్దరు పదో తరగతి విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జిల్లా కేంద్రంలో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. మొదట అనుమానస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.  పూర్తి దర్యాప్తు అనంతరం డీఎస్పీ వెంకట రమణ నిజానిజాలు వెల్లడించారు. డీఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇద్దరి విద్యార్థుల లవ్‌ ఫెయిల్‌ కావడంతో గత కొద్దిరోజులుగా డిప్రెషన్‌లోకి వెళ్లారు. ఈ క్రమంలో టాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన ఆర్‌ఎక్స్‌ 100 సినిమాను చూసి వారు ఓ నిర్ణయానికి వచ్చారు. ఆ సినిమాతో ప్రభావితులైన విద్యార్థులు మద్యం సేవించి, పెట్రోల్‌ పోసుకొని ఆత్మాహుతి చేసుకున్నారని డీఎస్పీ తెలిపారు. సినిమాలు కేవలం వినోదం కోసమేనని, వాటి ప్రభావానికి లోనే ప్రాణాలు పోగోట్టుకోవద్దని సూచించారు. ఎన్ని పనులున్నా పిల్లలపై తల్లిదండ్రుల దృష్టి ఉండాలని.. వారి ప్రవర్తనను నిశితంగా ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. వారిలో ఏమైన మార్పులు కనిపిస్తే కౌన్సిలింగ్‌ ఇస్తే ఇలాంటి ఘటనలు జరగవని పేర్కొన్నారు.   

అసలేం జరిగిందంటే..
వాళ్లిద్దరూ పదో తరగతి విద్యార్థులు.. ఒకే స్కూల్‌లో చదువుతున్నారు... ఒకరికి తెలియకుండా ఒకరు వారి స్కూల్లోనే చదివే ఓ అమ్మాయిని ప్రేమించారు. కానీ.. విషయాన్ని ఆ అమ్మాయికి చెప్పలేకపోయారు. చెబితే ఎక్కడ కాదంటుందోనని పెదవి దాటనీయలేదు. తమ ప్రేమ వ్యవహారాన్ని పెద్దలు ఎక్కడ తప్పుబడతారోనని.. ఎక్కడ కాదంటారోనని... ఎవరికివారే మానసిక ఆవేదనకు గుర య్యారు. ఇటీవలే తాము ప్రేమించింది ఒకే అమ్మా యిని అని తెలుసుకున్నారు. అమ్మాయి లేకుండా ఉండలేమని భావించారు. చదివే వయసులో ప్రేమేంటని స్కూల్‌ యాజమాన్యం ప్రశ్నిస్తుందనుకున్నారో.. లేక పెద్దలు కొడతారని భయపడ్డారో... తెలియదు కానీ, ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణాలిద్దామని నిర్ణయించుకున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో మధ్యాహ్నం నుంచి కలసి తిరిగిన ఇద్దరూ రాత్రి 7 గంటలకు ఓ నిర్మానుష్య ప్రాంతంలో మద్యం సేవించారు. మైకం వచ్చిన తర్వాత మద్యంతోపాటు వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నారు. వీరిలో ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో విద్యార్థిని కరీంనగర్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించేలోపే అతనూ చనిపోయాడు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top