అయ్యో.. రైతన్నా

Two Numbers Farmer Suicide Attempt In Warangal - Sakshi

ఆరుగాలం కష్టం చేసి జీవించే రైతన్నకు అడుగడుగునా సమస్యలే ఎదురవుతున్నాయి. ఏ పనిచేయాలన్నా ప్రాణాల మీదకే వస్తున్నాయి.  కొందరు ప్రమాదవశాత్తు చనిపోతుండగా కొందరు చేసిన అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. శుక్రవారం అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడగా  దుక్కి దమ్ము చేసి   తిరిగి వస్తుండగా ట్రాక్టర్‌ బోల్తా పడి ఓ రైతు మృతిచెందాడు. అప్పుల బాధతో..

గణపురం: చేసిన అప్పులు తీర్చలేక ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన జయశంకర్‌ జిల్లా గణపురం మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గణపురం మండల కేంద్రానికి చెందిన పాశికంటి రాజయ్య(45) తనకున్న కొద్దిపాటి భూమితో పాటు నాలుగెకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో పెట్టుబడికి తెచ్చిన అప్పులు పెరిగాయి. పంట దిగుబడి రాక అప్పులు తీర్చలేక శుక్రవారం తన చేను వద్దకు వెళ్లాడు. ఎవరూ లేని సమయంలో క్రిమీ సంహారక మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. సమీప వ్యవసాయ భూముల్లో ఉన్న రైతులు గమనించి 108కు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం ములుగు సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హన్మకొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో రాజయ్య మార్గమధ్యలోనే మృతిచెందాడు. మృతుడికి భార్య సుగుణ, కుమార్తె , కుమారుడు ఉన్నారు.

పురుగు మందు తాగి ..
గార్ల(ఇల్లందు): ఆర్థిక ఇబ్బందులు తాళలేక పురుగు మందు సేవించి ఓ రైతు మృతిచెందిన సంఘటన శుక్రవారం మహబూబాబాద్‌ జిల్లా పూమ్యా తండాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గార్ల మండలం పూమ్య తండాకు చెందిన ఇస్లావత్‌ పంతు(46) కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఇంట్లో ఎవరూ లేని సమయంలో పత్తి చేను కోసం తెచ్చిన పురుగు మందు సేవించి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఇరుగు పొరుగు వారు చూసి హుటాహుటిన పంతును ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందా డు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం. కుమారుడు కల్యాణ్‌ ఫిర్యాదు మేరకు ఏఎస్సై యాకుబ్‌ అలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ట్రాక్టర్‌ బోల్తా పడి రైతు మృతి
కొత్తగూడ(ములుగు): ట్రాక్టర్‌ బోల్తాపడి రైతు మృతి చెందిన సంఘటన కొత్తగూడ మండలం కోనాపురంలో శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతిరెడ్డి కిషన్‌రెడ్డి తనకున్న జాన్‌డీయర్‌ ట్రాక్టర్‌కు రోటోవేటర్‌తో నారుమడి దమ్ముచేసి ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్‌ అదుపుతప్పి పక్కన ఉన్న గుంతలోకి ఒక టైర్‌ దిగడంతో ఒకవైపు బోల్తాపడింది. ఘటనలో కిషన్‌రెడ్డి తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య సరిత, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న పద్దర్మ మంత్రి చందూలాల్‌ తనయుడు ధరంసింగ్‌ ఘటనా స్థలం వద్దకు చేరుకుని పరామర్శించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్లు ఎస్సై తాహెర్‌బాబా తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top