వ్యాపారం పేరుతో గోల్‌మాల్‌ 

Two Businessmens Arrested By Making Fraud In Karur Vysya Bank - Sakshi

కరూర్‌ వైశ్యా బ్యాంక్‌కు రూ.25 కోట్ల టోకరా 

ఇద్దరు వ్యాపారులపై కేసు నమోదు చేసిన సీసీఎస్‌ 

బ్యాంకు అధికారుల పాత్రపైనా సాగుతున్న దర్యాప్తు 

సాక్షి, హైదరాబాద్‌ : వ్యాపార విస్తరణ పేరుతో తమ వద్ద రుణం తీసుకుని పథకం ప్రకారం మోసం చేయడంతో పాటు గ్యారంటీగా పెట్టిన ఆస్తుల్ని ఉద్దేశపూర్వకంగా విక్రయించారంటూ కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ అధికారులు నగర నేర పరిశోధన విభాగంలో (సీసీఎస్‌) ఫిర్యాదు చేశారు. సదరు బ్యాంకును రూ.25 కోట్ల మేర ముంచారనే ఆరోపణలపై సికింద్రాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యాపారుల్ని అధికారులు ఇందులో నిందితులుగా చేర్చారు. ఈ గోల్‌మాల్‌ వ్యవహారంలో బ్యాంకు అధికారుల పాత్రను అనుమానిస్తూ ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సికింద్రాబాద్‌ ఎస్డీ రోడ్‌లో ఉన్న వర్చ్‌ మార్కెటింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థను జైన్‌ హితీష్‌ రమేష్‌ కుమార్, రమేష్‌ కుమార్‌ ఒట్రమాల్‌ జైన్‌ డైరెక్టర్లుగా నిర్వహిస్తున్నారు.

ఈ సంస్థ తమ వ్యాపార నిర్వహణ, విస్తరణ కోసం కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ సికింద్రాబాద్‌ శాఖ నుంచి 2014లో రూ.15 కోట్ల రుణం పొందారు. దీంతో పాటు మరో రూ.15 కోట్లకు బ్యాంక్‌ గ్యారంటీగా (ఐలాండ్‌ లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌) తీసుకున్నారు. వ్యాపారంలో ముడిసరుకుల ఖరీదు, ఇతర అంశాల్లో ఐఎస్‌సీని వినియోగించుకుంటారు. ఇలా మొత్తం రూ.30 కోట్లు పొందిన రుణాన్ని 2015లో రూ.40 కోట్లకు పెంచారు. అప్పటి నుంచి రెండేళ్ల పాటు (2017 వరకు) ఈ రుణాలను రెన్యువల్‌ చేస్తూ వెళ్లారు.

రుణాలు పొందే సమయంలో బ్యాంకు గ్యారంటీగా హైదరాబాద్, సంగారెడ్డి, గుంటూరు, కర్నూలు, మెదక్‌ జిల్లాల్లో ఉన్న ఏడు స్థిరాస్తుల్ని బ్యాంకునకు దఖలు చేశారు. 2017 తర్వాత ఈ రుణాలకు సంబంధించి చెల్లింపులు, ఇతర అంశాలు ఆగిపోవడంతో బ్యాంకు అధికారులు తదుపరి కార్యాచరణ ప్రారంభించారు. 2018 మార్చ్‌లో ఈ రుణాలకు సంబంధించిన ఖాతాలను నాన్‌ పెర్ఫార్మెన్స్‌ అకౌంట్స్‌ కిందికి చేర్చారు. రుణాల వసూలులో భాగంగా బ్యాంకు అధికారులు సర్ఫేసీ యాక్ట్‌ ప్రకారం తమ వద్ద తనఖా పెట్టిన ఆస్తుల్లో నాలుగింటిని విక్రయించారు. ఈ నేపథ్యంలోనే వ్యాపారులు తీసుకున్న రుణానికి, వాళ్లు తాకట్టు పెట్టిన ఆస్తులకు పొంతన లేదని తేలింది.

ఆస్తుల విలువ చాలా తక్కువగా, అప్పు ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు. గత ఏడాది డిసెంబర్‌ నాటికి ష్యూరిటీగా పెట్టిన ఆస్తుల విక్రయం పోను వ్యాపారులు బ్యాంకునకు రూ.24.13 లక్షలకు పైగా చెల్లించాల్సినట్లు తేల్చారు. దీంతో ఆ సంస్థకు చెందిన బ్యాంకు స్టేట్‌మెంట్లు, వ్యాపార లావాదేవీలను అధికారులు పరిశీలించారు. ఫలితంగా వ్యాపారం కోసం తీసుకున్న రుణం పక్కదారి పట్టిందని, ఉద్దేశపూర్వకంగా ఆ దుర్వినియోగానికి పాల్పడినట్లు తేల్చారు. ఈ ఆరోపణలతో వ్యాపారులపై సీసీఎస్‌లో కరూర్‌ వైశ్యా బ్యాంకు ఫిర్యాదు చేసింది. ప్రాథమిక విచారణ చేపట్టిన అధికారులు నేరం జరిగినట్లే తేల్చారు.

దీంతో నిందితులపై చీటింగ్‌ సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారం సికింద్రాబాద్‌ కరూర్‌ వైశ్యా బ్యాంకు పాత్రను పోలీసులు అనుమానిస్తున్నారు. గ్యారంటీ పెట్టిన ఆస్తుల విలువకు, అప్పులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎలా గుర్తించలేకపోయారు? నిందితుల తమ ఆస్తులకు చూపిన మార్కెట్‌ విలువను రుణం మంజూరు సమయంలో ఎలా ధ్రువీకరించుకున్నారు? అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి త్వరలో కొందరికి నోటీసులు జారీ చేయడానికి సీసీఎస్‌ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top