రాజకీయ కక్షతోనే టీఆర్‌ఎస్‌ నాయకుడి హత్య?

TRS Leader Brutally Murdered At Penuballi - Sakshi

కాపు కాసి, కర్రలతో దాడి చేసి హతమార్చిన వైనం

సాక్షి, పెనుబల్లి: పెనుబల్లి మండలం బ్రహ్మళకుంటలో మంగళవారం రాత్రి జరిగిన టీఆర్‌ఎస్‌ నాయకుడు ఏటుకూరి నరసింహారావు దారుణ హత్య రాజకీయ కక్షతోనే అని పోలీసులు, స్థానికులు భావిస్తున్నారు. కొట్టి, హతమార్చే ప్రాంతంలో తప్పించుకోవడానికి వీలులేని బ్రిడ్జి వద్దనున్న చెరకు తోట పరిసరాలను దుండగులు ఎంచుకోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. మండల పరిధిలోని బ్రహ్మళకుంటలో మంగళవారం రాత్రి చోటు చేసుకున్న టీఆర్‌ఎస్‌ నాయకుడు ఏటుకూరి నరసింహారావు దారుణహత్య రాజకీయ కక్షతోనే జరిగి ఉంటుందని పోలీసులు, స్థానికులు భావిస్తున్నారు. మంగళవారం రాత్రి తాళ్ళపెంట నుంచి బ్రహ్మళకుంటకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న నరసింహారావును మార్గంమధ్యలో బ్రిడ్జి సమీపంలో చెరకు తోట వద్ద రోడ్డుపై కాపు కాసి కర్రలతో తలపై, నుదురు, మొహంపై తీవ్రంగా గాయపరిచి హతమార్చారు.  

పక్కా ప్రణాళికతో..  
మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై ఏటుకూరి నరసింహారావు (50) వెళ్తున్న విషయాన్ని తాళ్లపెంటలో ఉన్న రైతులు ఫోన్‌ ద్వారా దుండగులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. నరసింహారావును కొట్టి, హతమార్చేందుకు... తప్పించుకోవడానికి ఎటువంటి వీలులేని బ్రిడ్జి వద్ద నున్న చెరకుతోట ప్రాంతాన్ని దుండగులు ఎంచుకున్నారు. మాటు వేసి, కర్రలతో కొట్టి హతమార్చారు. రాజకీయ హత్యగానే ఆయన కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీలోని రెండు వర్గాలలో ఓ వర్గానికి నరసింహారావు మద్దతు ఇవ్వడంతో ఆ వర్గం విజయం సాధించింది. దీంతో ఆగ్రహానికి లోనైన ప్రత్యర్థి వర్గం హత్యకు పాల్పడి ఉంటుందని నరసింహారావు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్రహ్మళకుంటకు చెందిన ఓ ప్రజా ప్రతినిధి కుమారుడు స్థానికంగా అందుబాటులో లేకుండా పోవడంతో ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  

మృతదేహం పెనుబల్లి ఏరియా ఆస్పత్రికి తరలింపు 

 నరసింహారావు మృతదేహం, సంఘటనా స్థలం వద్ద పడిఉన్న నరసింహారావు ద్విచక్రవాహనం

మంగళవారం రాత్రి హత్యకు గురైన నరసింహారావు మృతదేహాన్ని బుధవారం ఉదయం వరకు సంఘటనా స్థలంలోనే ఉంచి పోలీస్‌ పహారా  ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం ఖమ్మం నుంచి వచ్చిన క్లూస్‌ టీం , డాగ్స్‌ స్క్వాడ్‌ సిబ్బంది ఆధారాలు సేకరించాక మృతదేహాన్ని పెనుబల్లి ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అక్కడ పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోస్టుమార్టం సందర్భంగా నిందితులను వెంటనే అరెస్టు చేయాలంటూ పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌ నాయకులు పోలీసులను డిమాండ్‌ చేశారు. డీసీసీబీ మాజీ చైర్మన్‌ మువ్వా విజయ్‌బాబు, ఎంపీపీ సలహాదారు లక్కినేని వినీల్, జెడ్పీటీసీ చెక్కిలాల మోహన్‌రావులతో పాటు మండల నాయకులు నిందితులను వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను డిమాండ్‌ చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పోలీసు రక్షణలో బ్రహ్మళకుంట తరలించి, శాంతి భద్రతలకు ఇబ్బంది లేకుండా దహన సంస్కారాలు నిర్వహించేలా పర్యవేక్షించారు.  

విచారణ.. 
కల్లూరు ఏసీపీ ఎన్‌ వెంకటేష్‌ , సత్తుపల్లి రూరల్‌ సీఐ టి. రవికుమార్, ఎస్సై తోట నాగరాజుల ఆధ్వర్యంలో పోలీసులు బృందాలుగా విడిపోయి విచారణ ప్రారంభించారు. సంఘటనా స్థలం వద్ద వివరాలు సేకరించారు. హత్యకు ఉపయోగించిన కర్రలను  పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.  

పోలీసుల అదుపులో అనుమానితులు 
ఏటుకూరి నరసింహారావు హత్యతో సంబంధం ఉన్న అనుమానంతో ఆరుగురు వ్యక్తులను వీఎంబంజర్‌ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. తాళ్ళపెంటకు చెందిన ఓ మహిళను, ఓ వ్యక్తిని , బ్రహ్మళకుంటకు చెందిన నలుగురు వ్యక్తులను విచారిస్తున్నట్లు సమాచారం. 
ఈ మేరకు కేసు నమోదు చేసి, హత్యకు గల కారణాలు గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకుంటామని ఎస్సై తోట నాగరాజు తెలిపారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top