పెళ్లింట విషాదం

tragedy at the wedding home - Sakshi - Sakshi

కరీంనగర్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం 

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. మృతులందరిదీ ఒకే కుటుంబం..  

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/అల్గునూర్‌: వారం రోజుల్లో పెళ్లి జరగాల్సిన ఆ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. అతివేగం, నిద్రమత్తు నాలుగు ప్రాణాలను బలితీసుకుంది. కరీంనగర్‌ జిల్లా అల్గునూర్‌ శివారులో ఆగి ఉన్న లారీని టీఎస్‌ 02 ఈఎస్‌ 4400 నంబర్‌ గల కారు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం ఇంధన నిల్వల కేంద్రం సమీపంలోని రాజీవ్‌ స్వగృహలో నివాసముంటున్న కాంబ్లె సరితా బాయి–రవీందర్‌రావు దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. రవీందర్‌రావు వెల్డింగ్‌ వర్క్‌షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల పెద్ద కుమారుడు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ రితేష్‌ పెళ్లి నిశ్చయించారు. ఈ నెల 29న ముహూర్తం పెట్టుకున్నారు.

బంధువులను ఆహ్వానించేందుకు నాలుగు రోజుల క్రితం సరిత–రవీందర్‌సొంత కారులో మహారాష్ట్రలోని లాతూర్‌ వెళ్లారు. అక్కడే ఉంటున్న సరిత సోదరి మీరాబాయి, ఆమె భర్త రఘునాథ్‌ను తీసుకుని సోమవారం హైదరాబాద్‌ వచ్చారు. కొడుకు రితేష్‌ను కలసి రాత్రి 8:30 గంటలకు రామగుండం బయల్దేరారు. మంగళవారం తెల్లవారు జామున 2.40 గంటలకు తిమ్మాపూర్‌ మండలం అల్గునూరు శివారు భారత్‌ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో నిలిపి ఉన్న లారీని వీరి కారు అమితవేగంతో వచ్చి ఢీకొట్టింది. బంకు సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీలించగా ముగ్గురు రక్తపు మడుగులో విగత జీవులుగా పడి ఉన్నారు. ఆగి ఉన్న లారీని కారు బలంగా ఢీకొట్టడంతో కారు ఇంజన్‌తోపాటు ముందుసీటు వరకు లారీ కిందకు దూసుకుపోయింది. దీంతో ముందుసీట్లో కూర్చున్న సరిత, డ్రైవింగ్‌ సీట్‌లో కూర్చున్న రవీందర్‌ మృతదేహాలు క్యాబిన్‌లో ఇరుక్కుపోయాయి.

వెనుక సీట్లో కూర్చున్న మీరాబాయి కూడా అందులోనే నలిగిపోయింది. పోలీసులు సుమారు గంటపాటు మృతదేహాలను వెలికి తీసేందుకు శ్రమించారు. ఫలితం లేకపోవడంతో గ్యాస్‌ కట్టర్‌ తెప్పించి కారు క్యాబిన్, డోర్లు కట్‌చేసి మృతదేహాలను వెలికి తీశారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని బెలూన్లు తెరుచుకున్నా కారు వేగం అధికంగా ఉండడం, లారీని బలంగా ఢీకొట్టడంతో ప్రాణాలను కాపాడలేకపోయాయి. రఘునాథ్‌ కొన ఊపిరితో ఉండగా.. వెంటనే వారు ఎల్‌ఎండీ పోలీసులకు, 108కు సమాచారం అందించారు. రఘునాథ్‌ను కారు నుంచి బలవంతంగా బయటకు తీసి 108లో కరీంనగర్‌కు తరలించారు. మార్గమధ్యలో రఘునాథ్‌ మృతిచెందాడు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top