‘ఉపాధి’ ఉసురు తీసింది

Three Women Died While Working In Upadhi Hamee Scheme At Jagtial  - Sakshi

మట్టిపెళ్లలు కూలి ముగ్గురు మహిళలు దుర్మరణం

పనులు చేస్తుండగా ప్రమాదం

మరో ఇద్దరికి తీవ్రగాయాలు

జగిత్యాల జిల్లా కుస్తాపూర్‌లో ఘటన 

మల్లాపూర్‌ (కోరుట్ల): మూడు గంటల పని పూర్తయింది. మరో గంట గడిస్తే చాలు.. ఇంటికి చేరేవారు. 35 మంది కూలీలు ఎవరి పనిలో వాళ్లున్నారు.. అంతలోనే పై నుంచి మట్టి పెళ్లలు కూలిన శబ్దం.. చుట్టూ దుమ్ము. ఐదు నిమిషాలు ఏం జరుగుతోందో అర్థం కాలేదు.. తేరుకుని చూసేసరికి మట్టి పెళ్లల కింద ఆరుగురు మహిళలు. వీరిలో ముగ్గురు ప్రాణాలు విడవగా.. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం కుస్తాపూర్‌ గ్రామశివారులో చోటు చేసుకుందీ ఘటన. 

సొరంగంలా తవ్వడం వల్లే..: కుస్తాపూర్‌ శివారులోని జానకీకుంట వద్ద మట్టిరోడ్డు పనులను చేపట్టేందుకు 3 గ్రూపులకు చెందిన 36 మంది ఉపాధి కూలీలు వెళ్లారు. మూడు రోజులుగా సమీపంలోని దిబ్బ నుంచి మట్టిని తీసి రోడ్డుకు వేస్తున్నారు. మంగళవారం ఉదయం ఉదయం 7 గంటల నుంచి మట్టిని ట్రాక్టర్లలో తరలిస్తూ రోడ్డు పనులు చేపట్టారు. సుమారు 8 ట్రాక్టర్ల మట్టిని తరలించారు. మరో రెండు ట్రాక్టర్ల మట్టిని తరలిస్తే.. పని పూర్తి అవుతుంది. కూలీలు దిబ్బ కింది భాగంలో మరింత లోతుగా మట్టిని తవ్వడం ప్రారంభించారు. అది కాస్త సొరంగంలా మారడంతో మట్టిగడ్డలు ఉన్నట్టుండి కూలిపోయాయి.

దీంతో దిబ్బ కింది భాగంలో పని చేస్తున్న 35 మంది కూలీలు ఒక్కసారిగా చెల్లాచెదురయ్యారు. దూరంగా పరుగులు తీశారు. కూలిపడ్డ మట్టిగడ్డల వద్దకు చేరుకుని వాటిలో ఇరుకున్న ఆరుగురిని బయటకు తీశారు. వీరిలో కుస్తాపూర్‌కు చెందిన సరికెల ముత్తమ్మ (50) అక్కడికక్కడే మృతి చెందింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సరికెల రాజు (55), జెల్ల పోశాని (55)లకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.

ప్రమాదంలో గాయపడ్డ జెల్ల సుజాత (38), గుండ రాజు (40)లకు కాళ్లు విరిగిపోయాయి. మరో మహిళ గంగు(42)కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు కూలీల మృతిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జగిత్యాల జిల్లా కలెక్టర్‌ శరత్‌.. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కుస్తాపూర్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ దండు పెద్ద రాజం, టెక్నికల్‌ అసిస్టెంట్‌ ప్రణయలను సస్పెండ్‌ చేశారు. 

తక్షణ సాయంగా రూ.20 వేలు 
కూలీల మృతి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జేసీ రాజేశం, సబ్‌ కలెక్టర్‌ గౌతమ్‌ పోట్రు.. మెట్‌పల్లి ఆసుపత్రికి వెళ్లి మృతదేహాలను పరిశీలించి బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.20 వేలను అందించనున్నట్లు తెలిపారు. బాధితుల్లో అర్హులైన వారికి డబుల్‌ బెడ్రూం ఇల్లు, ఎకరం వ్యవసాయ భూమి, పిల్లలకు గురుకుల పాఠశాలల్లో ఉచిత విద్య, అపద్బంధ పథకం క్రింద పరిహారం అందించేందుకు కృషి చేస్తామని విద్యాసాగర్‌రావు హమీ ఇచ్చారు. 

రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా:జూపల్లి 
సాక్షి, హైదరాబాద్‌: మృతి చెందిన ఉపాధి కూలీల కుటుంబాలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కూలీల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కూలీల మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

గంట గడిస్తే.. ఇంటికి పోయెటోళ్లం: గడ్డం పోశాని 

మూడు రోజుల నుంచి మట్టి దిబ్బను తవ్వి ట్రాక్టర్లలో పంపుతున్నం. తవ్వుడు.. మోసుడు.. ఎవరి పనిలో వాళ్లం ఉన్నం.. మరో గంట పని చేస్తే చాలు. ఇంటికి పోయెటోళ్లం. ఇగో అప్పుడే.. మట్టి దిబ్బ కింది భాగంలో సొరంగం లెక్క తయారై మట్టిపెల్లలు మా మీదకి వచ్చి పడ్డయ్‌. అందరం ఉరికినం.. మన్ను కింద పడ్డవాళ్లు సరిగా కానరాలె. ఏం చేయాలో ఎవరికి తోయలే.. ఏడుసుకుంటనే మట్టి పెల్లలు పక్కకు జరిపి కొంత మందిని తీసినం. ఊరోళ్లకు.. ఉపాధి సార్లకు చెప్పినం. అందరు వచ్చిండ్రు.. మట్టి కింద ఇరుక్కున్న వారిని దవాఖానాకు పంపించిండ్రు. ముగ్గురి ప్రాణాలు పోతయని అనుకోలె. 
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top