ఆశలు.. బుగ్గిపాలు

Three People's Nalgonda Persons Died In America - Sakshi

అమెరికాలోని ఐయోవా రాష్ట్రం కొలిర్‌ విల్లేలో అగ్ని ప్రమాదం

గుర్రపుతండాకు చెందిన ముగ్గురు పిల్లల మృతి

చందంపేట (దేవరకొండ) : జిల్లాలోని గుర్రపుతాండాకు చెందిన కేతావత్‌ శ్రీనివాస్‌ నాయక్, సుజాత దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె సాత్విక(18) ఇం టర్‌ మొదటి సంవత్సరం, సుహాస్‌ నాయక్‌(16) 10వ తరగతి, జై సుచిత(14) 9వ తరగతిని అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలోని కొలిర్‌ విల్లేలో విద్యనభ్యసిస్తున్నారు. తండ్రి స్వగ్రామంలోనే పాస్టర్‌గా వ్యవహరిస్తూనే గుర్రపుతండాలో ఓట్రస్ట్‌ ఆధ్వర్యంలో అలేత్య బంజార పాఠశాలను నిర్వహిస్తూ సుమారు 450 మందికి విద్యనందిస్తున్నాడు. 20నెలల క్రితం వరకు శ్రీనివాస్‌నాయక్‌ సంతానం హైదరాబాద్‌లోనే ఓ పాఠశాలలో విద్యనభ్యసించారు. తదనంతరం ఉన్నత విద్య నిమిత్తం అమెరికాకు పంపించారు. అక్కడ ఓ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు.
 
క్రిస్మస్‌ సెలవులు ఇవ్వడంతో..
సాత్విక, సుహాస్‌నాయక్, జై సుచిత అభ్యసిస్తున్న విద్యాసంస్థలకు ఈ నెల 20 నుంచి క్రిస్మస్‌ సెలవులు ప్రకటించారు. అయితే, అమెరికాలోని ఐయోవా రాష్ట్రం లోనికొలిర్‌ విల్లేలో నివాసముంటున్న ఓపాస్టర్‌తో గుర్రపుతండా పాస్టర్‌ శ్రీనివాస్‌ నాయక్‌కు పరిచయముంది. కాగా, సదరు పాస్టర్‌ శ్రీనివాస్‌నాయక్‌ ముగ్గురు పిల్లలను తండ్రి అనుమతితో తన ఇంటికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే ఈనెల 24న చర్చిలో ప్రార్థనలు ముగించుకుని ఇంటికి వచ్చారు.

షార్ట్‌సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు
క్రిస్మస్‌ వేడుకల్లో భాగంగా అమెరికాలో ఉంటున్న పాస్టర్‌ ఇంటిని విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. అందరూ గాఢనిద్రలో ఉండగా షార్ట్‌సర్క్యూట్‌ జరిగి మంటలు వ్యాపించాయి. దీంతో ఇల్లు పూర్తిగా కాలి పోగా అందులో ఉన్న పాస్టర్‌ శ్రీనివాస్‌ నాయక్‌ ముగ్గురు పిల్లలతో పాటు స్నేహితుడు పాస్టర్‌ భార్య ఖేలి కూడా సజీవ     దహనమైంది.
 

తమ సంతానానికి బంగారు భవిష్యత్‌ ఇవ్వాలనేది.. ఆ దంపతులు కల. అందుకు ఎన్ని వ్యయప్రయాసాలకోర్చైనా వారిని ఉన్నత విద్య అందించాలని నిర్ణయించుకున్నారు. కష్టనష్టాలు ఎదురైనా పిల్లలను అమెరికా పంపించి చదివిస్తున్నారు. కుటుంబ పెద్ద ఓ వైపు పాస్టర్‌గా వ్యవహరిస్తూనే...మరో వైపు ఓ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో పాఠశాల నిర్వహిస్తూ ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాడు. విధి వైపరిత్యమో.. ప్రభువు ఆగ్రహమో తెలియదు కానీ.. అమెరికాలో క్రిస్మస్‌ వేడుకల్లో చోటు చేసుకున్న అపశ్రుతిలో ఆ దంపతుల ఆశలు సజీవ దహనమయ్యాయి. దీంతో నల్లగొండ జిల్లా నేరెడుగొమ్ము మండ
లం గుర్రపుతండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

గుర్రపుతండాలో విషాదఛాయలు 

అమెరికాలో ఉంటూ విద్యనభ్యసిస్తున్న నేరెడుగొమ్ము మండలం గుర్రపుతండా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అగ్నిప్రమాదంలో మృత్యువాతపడడంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పాస్టర్‌గా వ్యవహరిస్తున్న శ్రీనివాస్‌నాయక్‌కు బంధువులు అధికమే. అయితే స్వగ్రామంలో ఇటీవల జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో పాస్టర్‌గా శ్రీనివాస్‌నాయక్‌ స్వయంగా అన్ని తానై నిర్వహించారు. ఎప్పటికప్పుడు పిల్లల యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉండే శ్రీనివాస్‌నాయక్‌కు పిల్లలు అంటే చాలా ఇష్టం. అగ్నిప్రమాద ఘటనలో పిల్లలు మృత్యువాత పడిన విషయం తెలుసుకున్న బంధువులు, పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు గ్రామానికి చేరుకున్నారు. కాగా పిల్లల మరణవార్త విన్న తండ్రి శ్రీనివాస్‌నా యక్, తల్లి సుజాతలు హుటాహుటిన అమెరికా పయనమయ్యారు. 

ఎమ్మెల్యే పరామర్శ 
ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌కు మృతిచెందిన పిల్లల తండ్రి శ్రీనివాస్‌నాయక్‌ స్నేహితుడు. అగ్నిప్రమాద ఘటనలో గుర్రపుతండాకు చెందిన ముగ్గురు మృత్యువాతపడిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ స్వగ్రామానికి చేరుకున్నారు. మృతుల బంధువులను  ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. 

సీఎం కేసీఆర్, కేటీఆర్‌తో మాట్లాడిన ఎమ్మెల్యే 
అమెరికాలో జరిగిన అగ్నిప్రమాదంలో మండలంలోని గుర్రపుతండాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు మృత్యువాతపడిన విషయమై దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ సీఎం కేసీఆర్, కేటీఆర్‌లకు విషయాన్ని తెలియజేశారు. మృతదేహాలు స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అందుకు దౌత్యపరంగా ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని కోరినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top