రోడ్డుపై గుంత.. వైద్యురాలి మృతి

Thane Doctor Slips On A Pothole Crushed To Death By Truck - Sakshi

థానే : ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యం ఓ వైద్యురాలి పాలిట శాపంగా మారింది. రోడ్డుపై ఉన్న గుంతలను అలాగే వదిలేయడం ఆమె మరణానికి కారణమైంది. వివరాల్లోకి వెళితే.. కుడుస్‌ గ్రామానికి చెందిన 23 ఏళ్ల నేహా షేక్‌ అనే వైద్యురాలికి.. వచ్చే నెలలో పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి షాపింగ్‌కు కోసం ఆమె తన సోదరుడితో కలిసి స్కూటిపై భీవండికి షాపింగ్‌కు వెళ్లారు. వారు ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో నేహా వెనకాల కూర్చోగా, ఆమె సోదరుడు స్కూటి డ్రైవ్‌ చేస్తున్నాడు. రోడ్డుపై ఉన్న గుంత కారణంగా వారి బైక్ స్కిడ్‌ అయింది. దీంతో వెనకాల ఉన్న నేహా కిందపడిపోయారు. అదే సమయంలో పక్కన వస్తున్న ట్రక్‌ నేహాపై నుంచి వెళ్లడంతో.. ఆమె అక్కడే ప్రాణాలు విడిచారు. 

దీంతో ట్రక్‌ డ్రైవర్‌ అక్కడి నుంచి పారిపోయాడు. ఘటన స్థలానికి చేరకున్న పోలీసులు ట్రక్‌ డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న శ్రమజీవి యువ సంఘటన్‌ ఎన్‌జీవో సభ్యులు అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. రోడ్లపై గుంతలు పలువురి ప్రాణాలను బలిగొంటున్నాయని ఎన్‌జీవో సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ట్రక్‌ డ్రైవర్‌పై కేసు నమోదు చేశారని.. కానీ అసలు కేసు నమోదు చేయాల్సింది పీడబ్ల్యూడీ అధికారులపైన అని అన్నారు. అలాగే ఆ రోడ్డు నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టు సంస్థపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మరో కొద్ది రోజుల్లో కూతురి పెళ్లి చేసి మురిసిపోదామనుకున్న నేహా కుటుంబంలో.. ఆమె మరణం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top