బావిలో దూకి కౌలు రైతు ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

బావిలో దూకి కౌలు రైతు ఆత్మహత్య

Published Fri, Sep 6 2019 8:22 AM

Tenant Farmer Commits Suicide In Prakasam - Sakshi

సాక్షి, అద్దంకి (ప్రకాశం): వ్యవసాయంలో ఎదురైన నష్టాలో అప్పుల పాలైన కౌలు రైతు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని ధేనువుకొండలో గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. 
ధేనువుకొండ గ్రామానికి చెందిన వింజం చింపిరయ్య(45)కు పాతికేళ్ల కిందట మోదేపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరమ్మతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు. ఏడేళ్ల కిందట ధేనువుకొండ గ్రామం గుండ్లకమ్మ డ్యామ్‌ నిర్మాణంలో ముంపు గ్రామంగా ప్రకటించటంతో  ప్రభుత్వ అందజేసిన నష్ట పరిహారం రూ.2 లక్షలతో అత్తగారి ఊరు మోదేపల్లి చేరుకుని అక్కడ ఇల్లు కొనుక్కొన్నాడు. అక్కడే రెండెకరాల అత్తగారి పొలంతోపాటు మరో మూడెకరాలను కౌలుకు తీసుకుని ఐదేళ్లుగా మిరప, పత్తి పంటలు సాగు చేస్తూ వచ్చాడు.

ఏటా నష్టాలే ఎదురుకావడంతో పెట్టుబడికి తెచ్చిన అప్పులు వడ్డీతో సమా రూ.10 లక్షల వరకు తేలాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం పశువులను తొలుకుని పొలాల్లోకి వెళ్లిన చింపిరయ్య సాయంత్రం ఇంటికి చేరలేదు. తరచూ పశువులను పొలంలో వదిలి స్వగ్రామం వెళ్లటం అలవాటుగా వున్న చింపిరయ్య అక్కడివెళ్లి వుంటాడని భార్య, కుటుంబసభ్యులు భావించారు. గురువారం మధ్యాహ్నం ధేనువుకొండ గ్రామ సమీపంలోని బావిలో పశువుల కాపరులకు శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
Advertisement