రహీం జాడేదీ.?

Teacher Missing Case Still Pending in Hyderabad - Sakshi

ప్రత్యేక బృందాల గాలింపు  

కాల్‌డేటా పరిశీలన

బంజారాహిల్స్‌: అదృశ్యమైన ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షేక్‌ అబ్దుల్‌ రహీం ఆచూకీ రెండు వారాలు గడుస్తున్నా లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో అతను అదృశ్యం కావడం, సెల్‌ఫోన్‌ కూడా స్విచ్ఛాఫ్‌లో ఉండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఫిలింనగర్‌ రౌండ్‌టేబుల్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇన్‌ఛార్జ్‌ హెడ్‌మాస్టర్‌ షేక్‌ అబ్దుల్‌ రహీం ఈ నెల 1న అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యాడు. ఈ మేరకు అతడి భార్య ముబీన్‌ఫాతిమా  బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓవైసీ కాలనీలో ఉంటున్న రహీం నాలుగేళ్లుగా ఫిలింనగర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెడ్‌మాస్టర్‌గా పని చేస్తున్నారు.

ఈ నెల 1న స్కూల్‌కు వెళ్లిన అతడికి భార్య ఫాతిమా ఫోన్‌ చేసి మధ్యాహ్నం భోజనానికి వస్తున్నారా అని అడగ్గా పని పూర్తయ్యాక వస్తానని చెప్పాడు. సాయంత్రం మరోసారి ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్‌ చేసి ఉండటంతో బంధుమిత్రులను వాకాబు చేసింది. మలక్‌పేట్‌లో ఉంటున్న అతడి కుటుంబ సభ్యులను  ప్రశ్నించినా ఫలితం లేకుండా పోవడంతో ఈనెల 8న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. ఆయనకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టగా  ఎవరితోనూ శత్రుత్వం లేదని పోలీసులు తెలిపారు. చివరి ఫోన్‌కాల్‌ ఎవరికి చేశారన్న దానిపై కాల్‌డేటా సేకరిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 7901106909 నంబర్‌లో సంప్రదించాలని దర్యాప్తు అధికారి ఏఎస్‌ఐ ప్రేమ్‌కుమార్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top