టార్గెట్‌ ఠాణా?

Target Police Station In ISIS Hit List - Sakshi

ఐసిస్‌ హిట్‌ లిస్ట్‌లోరాజధానిలోని పోలీస్‌స్టేషన్‌

గుజరాత్‌లో చిక్కినఇద్దరి విచారణలో వెలుగులోకి

నగరంలో చిక్కిన వారితోనూ వీరికి లింకులు

విషయం గోప్యంగా ఉంచుతున్న అధికార వర్గాలు

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐసిస్‌) రాజధానిలోని పోలీసుస్టేషన్‌ను టార్గెట్‌ చేస్తోందా..? ఔననే అంటున్నాయి నిఘా వర్గాలు. 2016లో సిటీలో చిక్కిన దీని అనుబంధ సంస్థ జుందుల్‌ ఖిలాఫత్‌ ఫీ బిలాద్‌ అల్‌ హింద్‌ (జేకేబీహెచ్‌) ఉగ్రవాదులు ఠాణాలను టార్గెట్‌ చేసినట్లు అప్పట్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) గుర్తించింది. దీనికి కొనసాగింపుగా గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్వా్కడ్‌ (ఏటీఎస్‌) టీమ్‌ పట్టుకున్న ఐసిస్‌ ఉగ్రవాదులు ఒబేద్‌ మీర్జా, ఖాసిం స్టింబర్‌వాలా విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. దీనిపై ఏటీఎస్‌ అధికారులు నోరు మెదపట్లేదు. రాష్ట్ర పోలీసు వర్గాలు సైతం ధ్రువీకరించకుండా గోప్యంగా ఉంచుతున్నాయి. 

జేకేబీహెచ్‌ విఫలం కావడంతో...
నగరానికి సంబంధించి షఫీ ఆర్మర్‌ 2016లో రెండు మాడ్యుల్స్‌ను తయారు చేసి దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు కుట్ర చేశారు. ఈ రెండు ముఠాలను ఎన్‌ఐఏ అధికారులు పట్టుకున్నారు. ఆ ఏడాది జూన్‌లో చిక్కిన జుందుల్‌ ఖిలాఫత్‌ ఫీ బిలాద్‌ అల్‌ హింద్‌ (జేకేబీహెచ్‌) మాడ్యుల్‌లో మొత్తం 11 మంది సభ్యులు ఉన్నారు. ఇబ్రహీం నేతృత్వంలో పని చేసిన ఈ గ్యాంగ్‌లో రిజ్వాన్‌ ఒకడు. అప్పట్లో హైదరాబాద్‌లో ఉన్న ప్రముఖ ప్రాంతాలను టార్గెట్‌ చేయాలని సూచించిన షఫీ ఆర్మర్‌ వాటిలో పోలీసుస్టేషన్లు సైతం ఉండాలని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలోనే  10 ఠాణాల వద్ద రెక్కీ నిర్వహించిన రిజ్వాన్‌ ‘మాల్‌ తయ్యార్‌ హై’ (సరుకు సిద్ధంగా ఉంది) అంటూ షఫీ ఆర్మర్‌కు ఆన్‌లైన్‌ సందేశం కూడా పంపాడు. ఈ పథకం అమలు కావడానికి కొన్ని రోజుల ముందే మాడ్యుల్‌ మొత్తాన్ని ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేయడంతో షఫీ ఆర్మర్‌ టార్గెట్‌ పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలోనే అతను గుజరాత్‌కు చెందిన ఒబేద్, ఖాసింల హిట్‌ లిస్ట్‌లో రాజధానిలోని ఠాణాను చేర్చినట్లు తెలుస్తోంది. సూరత్‌కు చెందిన ఖాసిం అంకలేశ్వర్‌లోని ఓ ఆస్పత్రిలో ల్యాబొరేటరీ సూపర్‌వైజర్‌గా పని చేస్తుండగా... ఒబేద్‌ వృత్తిరీత్యా లాయర్‌ కాగా ఇతడికి అంకలేశ్వర్‌లోని వేసు ప్రాంతంలో దావత్‌ అనే రెస్టారెంట్‌ సైతం ఉంది.

ఆయుధాలతో పాటు విషప్రయోగం...
ఒబేద్, ఖాసింలకు టార్గెట్లు అప్పగించిన షఫీ ఆర్మర్‌ రోటీన్‌కు భిన్నమైన విధానంలో హిట్‌ చేయాల్సిందిగా సూచించాడు. రాజస్థాన్‌లోని అజ్మీర్‌ నుంచి సంగ్రహించిన ఆయుధాలతో పాటు విషప్రయోగంతోనూ బీభత్సం సృష్టించాలని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో వీరు ‘బీ–18’ అనే విషపదార్థం వినియోగంపై అధ్యయనం చేశారు. దీనిని ప్రయోగించడం ద్వారా టార్గెట్‌ గుండె ఆగి చనిపోతాడని, కొన్ని గంటలకే శరీరం నుంచి దీని ఆనవాళ్లు తొలగిపోవడంతో పోస్టుమార్టం పరీక్షల్లోనూ మరణానికి కారణం తెలియదని దీనిని ఎంచుకున్నట్లు ఏటీఎస్‌ గుర్తించింది. గత వారం అంకెలేశ్వర్‌ న్యాయస్థానంలో వీరిద్దరి పైనా అభియోగపత్రాలు దాఖలు చేసింది. వీరు హైదరాబాద్‌లోని ఠాణాను టార్గెట్‌ చేసినట్లు పేర్కొంటున్న ఏటీఎస్‌ అధికారులు అది ఏ పోలీసుస్టేషన్‌ అనేది స్పష్టం చేయట్లేదు. దీనిపై రాష్ట్ర పోలీసు వర్గాలు మాత్రం తమకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని తెలిపాయి. 2016లో చిక్కిన జేకేబీహెచ్‌ మాడ్యుల్‌లో వీరు పరోక్షంగా పాత్రధారులై ఉండవచ్చని, అప్పటి ‘టార్గెట్‌ ఠాణా’నే కొనసాగిందని అంచనా వేస్తున్నారు. పక్కా సమాచారం ఉంటే గుజరాత్‌ పోలీసుల ద్వారా విషయం తెలుసుకునే నిఘా వర్గాలు హెచ్చరిస్తారని చెబుతున్నారు.  

‘ఆ నలుగురి’కీ స్ఫూర్తి వీరే...
గుజరాత్‌ ఏటీఎస్‌ అధికారులు గతేడాది అక్టోబర్‌ 25న అక్కడి అంకెలేశ్వర్‌ ప్రాంతంలో ఒబేద్, ఖాసింలను పట్టుకున్నారు. సిరియా కేంద్రంగా కార్యకలాపాలు నడుపుతూ సోషల్‌మీడియా ద్వారా రిక్రూట్‌మెంట్స్‌ చేపడుతున్న షఫీ ఆర్మర్‌ ఆదేశాల మేరకు పని చేస్తున్న వీరికి సిటీకి చెందిన నలుగురు యువకులతోనూ లింకులు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. నగరంలోని దక్షిణ మండలానికి చెందిన అబ్దుల్లా బాసిత్, సయ్యద్‌ ఒమర్‌ ఫారూఖ్‌ హుస్సేని, మాజ్‌ హసన్‌ ఫారూఖ్‌లు కాశ్మీర్‌ మీదుగా సిరియా వెళ్లాలనే ప్రయత్నాల్లో 2016లో నాగ్‌పూర్‌ విమానాశ్రయంలో పట్టుబడ్డారు. దీనికి రెండేళ్ల ముందు 2014లో బాసిత్‌తో పాటు మాజ్‌ హసన్, అబ్రార్, నోమన్‌ కోల్‌కతా మీదుగా బంగ్లాదేశ్‌ చేరుకుని అట్నుంచి సిరియా వెళ్లడానికి ప్రయత్నించగా, వీరిని కోల్‌కతాలో గుర్తించిన నిఘా వర్గాలు వెనక్కు తీసుకువచ్చాయి. ఈ నలుగురినీ సరిహద్దులు దాటేందుకు ప్రోద్భలం ఇచ్చింది ఒబేద్, ఖాసిం అని తేలింది. ఆన్‌లైన్‌ ద్వారా షఫీ ఆర్మర్‌ ఇచ్చిన ఆదేశాల మేరకు వీరిద్దరూ సిటీకి చెందిన నలుగురినీ రిక్రూట్‌ చేసి సరిహద్దులు దాటించేందుకు యత్నించారు. 2014లో వీరిని పట్టుకున్న పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో గుజరాత్‌ ద్వయం వాంటెడ్‌గా మారలేదు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top