ఆమెది హత్య ? ఆత్మహత్య ?

Suspicious Death Of Women In Chennur Adilabad - Sakshi

సాక్షి, చెన్నూరు : మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌ బీజోన్‌ ఏరియాకు చెందిన వివాహిత గంజి కళ్యాణి(25) మంగళవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. కళ్యాణి ఉరేసుకుని చనిపోయిందని ఆమె భర్త చెబుతుండగా.. భర్తే ఉరేసి చంపి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు.. ములుగు జిల్లా వెంకటాపూర్‌కు చెందిన గంజి నర్సింహారావు కూతురు కళ్యాణిని 2014 ఫిబ్రవరిలో ఖమ్మం జిల్లా చర్ల మండలం తేగడ గ్రామానికి చెందిన అర్జి సత్యబోస్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. వివాహ సమయంలో రూ.5 లక్షల నగదు, 10 తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. పెళ్లి అయిన కొద్దిరోజులకు సత్యబోస్‌కు వెల్ఫేర్‌ ఆఫీసర్‌గా సింగరేణిలో ఉద్యోగం రావడంతో వారు రామకృష్ణాపూర్‌కు వచ్చి ఇక్కడే కంపెనీ క్వార్టర్‌లో ఉంటున్నారు.

పెళ్లయి ఐదేళ్లు కావస్తున్నా సంతానం కలగలేదని సత్యబోస్‌తోపాటు అతని తల్లిదండ్రులు కళ్యాణిని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారు. అదనపు కట్నంగా మరో రూ.నాలుగు లక్షలు తేవాలని, లేకపోతే తమ అబ్బాయికి మరో పెళ్లి చేస్తామని సత్యబోస్‌ తల్లిదండ్రులు బెదిరించారు. ఈ క్రమంలో గతనెల సెప్టెంబర్‌ 15న కళ్యాణిని పుట్టింటికి పంపించారు. సత్యబోస్‌కు నచ్చజెప్పి కళ్యాణిని మళ్లీ కాపురానికి పంపించారు. మంగళవారం రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో సత్యబోస్‌ ఫోన్‌ చేసి కళ్యాణికి కడుపునొప్పి వచ్చిందని, ఆర్‌కేపీ ఏరియా ఆసుపత్రిలో చేర్పించామన్నారని, దీంతో బుధవారం వేకువజామున ఇక్కడికి వచ్చాక.. వైద్యం జరుగుతుందని అబద్దం చెప్పాడని, చివరికి కళ్యాణి చనిపోయి మార్చురీలో ఉందన్నాడని రోదిస్తూ తెలిపారు. తమ బిడ్డను అల్లుడు సత్యబోస్‌ ఉరిపెట్టి చంపి.. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఆసుపత్రిలో చేర్పించాడని కళ్యాణి తండ్రి నరసింహారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

పిల్లలు పుట్టలేదనే బెంగతోనే : మృతురాలి మామ అర్జిప్రసాద్‌
పెళ్‌లై ఐదేళ్లయినా పిల్లలు పుట్టడం లేదనే బెంగతోనే కళ్యాణి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి మామ అర్జి ప్రసాద్‌ పేర్కొన్నారు. ఏరియా ఆసుపత్రిలో మాట్లాడారు. పిల్లలు లేకపోవడంతో ఇటీవల ఆసుపత్రుల్లో చూపించుకుంటున్నారని, సంతానం కలగకపోవడంతో మానసికంగా కలత చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడిందని పేర్కొన్నారు. ఈ విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం అనంతరం అన్ని వివరాలు వెల్లడిస్తామని పట్టణ ఎస్సై రవిప్రసాద్‌ తెలిపారు. నిందితులపై 302, 304బీ కింద కేసు నమోదు చేశామన్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top