స్కూల్‌ విద్యార్థిని చిదిమేసిన లారీ

Student Died in A Accidenrt At Uppal - Sakshi

మృత్యువు రూపంలో దూసుకొచ్చింది

స్కూల్‌ ఆటోను వెనుక నుంచి ఢీ..ఒక విద్యార్థి మృతి

మరో ఆరుగురు విద్యార్థులకు గాయాలు

ఉప్పల్‌: రోజూలాగే ఆటోలో స్కూల్‌కు బయలుదేరిన ఆ విద్యార్థుల పాలిట లారీ మృత్యుశకటంలా దూసుకొచ్చింది. అతివేగంతో వచ్చి ఆటోను ఢీకొట్టి ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. మరికొందరిని క్షతగాత్రులుగా మార్చింది. ఉప్పల్‌ చౌరస్తా వద్ద మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ఏడో తరగతి విద్యార్థి అవంత్‌కుమార్‌(13) మృతి చెందగా, ఇతని సోదరుడు వేదాంత్‌కుమార్‌ (9వ తరగతి)కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులైన అన్నాచెల్లెలు అశ్రిత్‌ రెడ్డి (8వ), నందిని (6వ), రీతూ (10వ), కీర్తి, వైష్ణవి సమీప ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరంతా ఉప్పల్‌ న్యూ భరత్‌నగర్‌లో ఉంటున్నారు.

పది నిమిషాలే ప్రాణాలు తీసిందా...
ఫిర్జాదిగూడ ప్రాంతంలో నివసించే ఆటో డ్రైవర్‌ వనమా శ్రీనివాస్‌ ఆటో (ఏపీ11వై4940)లో హబ్సిగూడ భాష్యం స్కూల్‌కు న్యూ భరత్‌ నగర్‌ నుంచి 9మంది పిల్లలను ప్రతిరోజూ తీసుకెళతాడు. రోజూలాగే మంగళవారం కూడా స్కూల్‌కు తీసుకెళ్లేందుకు ఒక్కొక్కరినీ ఆటోలో ఎక్కించుకుంటున్నాడు. అవంత్‌కుమార్‌ ఇంటి వద్దకు రాగానే ఆటో స్టార్ట్‌ చేసిన సమయంలో పది నిమిషాలు మొరాయించింది. ఆ తర్వాత స్టార్ట్‌ అవ్వడంతో 8మందిని ఆటోలో ఎక్కించుకొని ఉదయం 7.30 గంటల ప్రాంతంలో న్యూ భరత్‌ నగర్‌ నుంచి బయలుదేరాడు. 7.50 నిమిషాలకు ఉప్పల్‌ లిటిల్‌ ఫ్లవర్‌ పాఠశాల వెనక రోడ్డు మీదుగా ఆటో సర్వే ఆఫ్‌ ఇండియా చౌరస్తాకు చేరుకుంది.

సిగ్నల్‌ క్లియర్‌గా ఉండటంతో రోడ్డు దాటి హబ్సిగూడ వైపు మళ్లుతున్న సమయంలో తార్నాక వైపు నుంచి అతి వేగంగా వచ్చిన ఇసుక లారీ (ఏపీ24టీఏ–5469) ఆటోను వెనుక నుంచి ఢీకొంది. దీంతో ఆటో పల్టీ కొట్టింది. లారీడ్రైవర్‌ మల్లేష్‌ వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యాడు. ఆటో పది నిమిషాల పాటు ట్రబుల్‌ ఇవ్వకపోతే ఈ ప్రమాదం జరిగుండేదే కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని క్షతగాత్రులను సమీప ప్రైవేట్‌ ఆసుపత్రులకు తరలించి స్కూల్‌ యజమాన్యానికి, తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు.

ఉప్పల్‌ ట్రాఫిక్‌ సీఐ కాశీ విశ్వనాథ్‌ మృతిచెందిన విద్యార్థిని పట్టుకుని అంబులెన్స్‌ ఎక్కించి గాంధీకి తరలించారు. అయితే ఉప్పల్‌ పోలీసు స్టేషన్‌కు భారీగా చేరుకున్న మృతుని బంధువులు తమకు న్యాయం జరిగేవరకు వెళ్లేదిలేదని కూర్చున్నారు. అయితే పోలీసులు నచ్చజెప్పి పంపారు. నిర్లక్ష్యంగా లారీ డ్రైవ్‌ చేసిన కొత్తగూడెం వాసి జి.మల్లేష్‌పై కేసు నమోదు చేశారు. ఆటోడ్రైవర్‌ శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

చదువుల్లో జీనియస్‌ అవంత్‌

సిద్దిపేట జిల్లా మర్మాముల గ్రామానికి చెందిన సుందరగిరి సంతోష్‌కుమార్‌ గౌడ్‌ చెంగిచర్ల డిపోలో ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. 15 ఏళ్ల క్రితం ఉప్పల్‌కు వచ్చి న్యూభరత్‌నగర్‌లో భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలు వేదాంత్‌ (14), అవంత్‌కుమార్‌(13)తో కలసి నివాసముంటున్నాడు. అవంత్‌ చదువుల్లో జీనియస్‌ అని, అందుకే ఎన్నో కష్టాలకోడ్చి చదివిస్తున్నానని సంతోష్‌ అన్నారు. కొడుకులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నానని, ఇంతలోనే దేవుడు ఇలా చేశాడని ఆయన కన్నీటిపర్యంతమయ్యారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top