దొంగ బంగారం కలకలం

Stolen Gold Caused In Godavari Districts - Sakshi

నరసాపురం మార్కెట్‌లో అలజడి

కేసుపై పోలీసుల గోప్యత

పెద్ద వ్యక్తుల ఇళ్లలో చోరీ చేసినట్టు సమాచారం  

బులియన్‌ వర్తకుల ఆందోళన  

నరసాపురం: దొంగ బంగారం రికవరీకోసం మంగళవారం రాత్రి నరసాపురం గోల్డ్‌మార్కెట్‌ వద్దకు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు పెద్ద ఎత్తున రావడం సంచలనం సృష్టించింది. ఆ తాలూకా అలజడి వాతావరణం బులియన్‌ మార్కెట్‌లో వద్ద ఇంకా కొనసాగుతూనే ఉంది. చీకటి పడే సమయంలో వచ్చిన పోలీసులు ఓ బులియన్‌ వర్తకుడిని, ఇద్దరు ఆభరణాల తయారీదారులు, బంగారు ద్రావణం కరిగించే ఓ వ్యక్తిని, మరో ముగ్గురు గుమస్తాలను తీసుకెళ్లారు. అయితే పోలీసులు వారిని తీసుకెళ్లిన తరువాత ఇక్కడి నుంచి బులియన్‌ వర్తకులు షాపులు బంద్‌చేసి రాజోలు వెళ్లారు. బులియన్‌ సంఘం ప్రతినిధులు అక్కడి పోలీసులతో మాట్లాడిన తరువాత అదుపులోకి తీసుకున్న వారిని వదిలిపెట్టారు.

ఉభయగోదావరి జిల్లాల్లో పేరు
ఉభయగోదావరి జిల్లాల్లోనే నరసాపురం గోల్డ్‌ మార్కెట్‌కు పేరుంది. ఇదే క్రమంలో ఇక్కడ సాగుతున్న బంగారం వ్యాపారంపై ఆరోపణలూ ఉన్నాయి. ముఖ్యంగా కొందరు బంగారు వ్యాపారులపై ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా బంగారం రవాణా చేయడం, అలాగే దొంగిలించిన బంగారం కొనుగోళ్లు చేస్తారనే ప్రచారం ఉంది. గతంలో భారీగా రశీదులు లేని బంగారాన్ని కేజీల్లో పోలీసులు పట్టుకున్న ఘటనలూ జరిగాయి. అయితే గతంలో ఎన్నడూలేని అలజడి మాత్రం మంగళవారం ఘటనలో కనిపించడం విశేషం.

హోంమంత్రి సన్నిహితుడి బంగారమా?
బంగారం రికవరీ కోసం తూర్పుగోదావరిజిల్లా రాజోలు  నుంచి పోలీసులు పెద్ద కాన్వాయ్‌ తరహాలో వచ్చారు. ఆరుకార్లు, ఆరు జీపుల్లో డీఎస్పీ, నలుగురు సీఐలు, కొందరు ఎస్సైలు వచ్చారు. ఇదే చర్చనీయాంశమైంది. డీజీపీ స్థాయి నుంచి ఆదేశాలు రావడంతో ఇంత భారీగా పోలీసులు తరలివచ్చారని తెలుస్తోంది. అయితే పోలీసులు ఇంత సీరియస్‌గా కేసును తీసుకోవడం వెనుక రూ.10 కోట్లుపైనే విలువచేసే బంగారం వస్తువుల అపహరణ వ్యవహారం ఉన్నట్టు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు ముగ్గురు అంతర జిల్లాల నేరస్తులు రాజోలు పోలీసుల అదుపులో ఉన్నారు. వీరు దొంగతనం చేసిన సుమారు 3కిలోల బంగారు వస్తువులను నరసాపురంలో కొంతమంది కరిగించడం, ఇక్కడ వ్యాపారులు కొందరు వాటిని కొనుగోలు చేయడం చేశారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ ముఠా దోపిడీ చేసిన ఇంటి యజమానులు రాజకీయ ప్రాబల్యం ఉన్న వ్యక్తులుగా చెబుతున్నారు.

హోంమంత్రికి సిద్ధాంతిగా వ్యవహరించే ఓ వ్యక్తి ఇంట్లో , అలాగే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ ప్రజాప్రతినిధి ఇంట్లో చోరీలు చేసినట్టుగా చెబుతున్నారు. అయితే వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు. మరోవైపు పోలీసులు స్థానికంగా బంగారు షాపుల వారిని అదుపులోకి తీసుకెళ్లడంపై , బులియన్‌ వర్తకుల అసోసియేషన్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. స్థానిక పోలీసులతో విచారించి, నిజంగా తప్పు చేసిన వ్యక్తులను తీసుకెళితే ఎవరికీ అభ్యతరం లేదన్నారు. బంగారు వర్తకులు అందరూ దొంగలే అన్నట్టుగా చీకటివేళ పోలీసులు వచ్చి ఇలా పట్టుకెళ్లిపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అయితే పెద్ద వ్యవహారం, పెద్దల వ్యవహారం కావడంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని నిజాయితీగా వ్యాపారం సాగించే బంగారం వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top