ఏటీఎంనే ఏమార్చారు! 

South Zone Task Force arrested the five people in Robbery case - Sakshi

హైదరాబాద్‌లో రెచ్చిపోయిన ఉత్తరాది ముఠా 

సాంకేతిక సమస్య సృష్టించి ఆడుకుంటున్న గ్యాంగ్‌ 

డబ్బు విత్‌డ్రా చేసినా రానట్లు మార్చేస్తున్న వైనం 

బ్యాంకు నుంచి తిరిగి డబ్బు పొందుతున్న దొంగలు 

ఐదుగురిని అరెస్టు చేసిన సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌

సాక్షి, హైదరాబాద్‌: చిన్న టెక్నిక్‌తో ఏటీఎంలనే ఏమార్చారు. సాంకేతిక సమస్య సృష్టిస్తూ డబ్బులు దోచుకున్నారు. విత్‌డ్రా చేసుకున్నా.. డబ్బులురానట్లు చూపేలా ఏటీఎంలో మార్పులు చేశారు. ఈ వ్యవహారం మొత్తం 4 సెకన్లతో పూర్తి చేశారు. పైగా బ్యాంకులకు ఫిర్యాదు చేసి మళ్లీ ఆ మొత్తాన్ని తిరిగి పొందారు. ఇదీ హరియాణా–రాజస్తాన్‌ సరిహద్దుల్లోని మేవాట్‌ రీజియన్‌కు చెందిన ముఠా నిర్వాకం.. 

ఈ టెక్నిక్‌తో భారీ మొత్తంలో డబ్బు దోచేయాలని స్కెచ్‌ వేసి హైదరాబాద్‌ వచ్చిన ఈ గ్యాంగ్‌.. సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌కు చిక్కింది. వీరి నుంచి పలు బ్యాంకులకు చెందిన 31 డెబిట్‌ కార్డులు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ ఎస్‌.చైతన్యకుమార్‌తో కలసి సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు తెలిపారు. మేవాట్‌ రీజియన్‌కు చెందిన అఖ్లక్‌ అహ్మద్‌ (ఐటీఐ ఫిట్టర్‌ విద్యార్థి), ముంథీజ్‌ (ఐటీఐ రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండిషన్‌ విద్యార్థి), తౌఫీఖ్‌ (పళ్ల వ్యాపారి), తస్లీమ్‌ (ఐటీఐ ఎలక్ట్రీషియన్‌ విద్యార్థి), షాకీర్‌ మహ్మద్‌ (రైతు) ఓ ముఠాగా ఏర్పాడ్డారు. వీరు ఏటీఎం మెషీన్‌ను ఏమార్చే విధానం గుర్తించారు. పరిచయస్తులు, స్నేహితుల ఏటీఎం కార్డులు తీసుకున్నారు. నాలుగు రోజుల కింద హైదరాబాద్‌ చేరుకున్న ఈ ఐదుగురు రెండు బృందాలుగా ఏర్పడ్డారు.  

అత్యంత తెలివిగా.. 
సెక్యూరిటీ గార్డుల్లేని, పాత ఏటీఎం మెషీన్లను గుర్తించేవారు. తమ వద్ద ఉన్న ఏటీఎం కార్డుతో లావాదేవీ మొత్తం పూర్తి చేసేవారు. డబ్బులు వచ్చాక లావాదేవీ పూర్తయ్యేందుకు నాలుగైదు సెకన్ల సమయం ఉంటుంది. ఆ తర్వాతే లావాదేవీ పూర్తయినట్లు స్క్రీన్‌పై కనిపించడంతో పాటు మొబైల్‌ నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. ఈ సమయాన్నే ఈ ముఠా తమకు అనుకూలంగా మార్చుకుంది. ఓ వ్యక్తి ఏటీఎం మెషీన్‌కు ఉన్న కెమెరాకు చేయి అడ్డుపెట్టేవాడు. మరో వ్యక్తి ఆ మెషీన్‌లో సాంకేతిక సమస్య సృష్టించేవాడు. దీంతో ఏటీఎం నుంచి డబ్బు బయటకొచ్చినా అందులో మాత్రం లావాదేవీ ఫెయిల్‌ అయినట్లు నమోదయ్యేది. ఇదే విషయాన్ని పేర్కొంటూ స్లిప్‌ ప్రింట్‌ వచ్చేది. దీన్ని వాట్సాప్‌ ద్వారా అసలు కార్డు వినియోగదారుడికి పంపేవాళ్లు. ఈ విషయం బ్యాంకుకు ఫిర్యాదు చేసి తిరిగి ఖాతాలో పడేలా చర్యలు తీసుకోవాలని కోరేవారు. దీంతో బ్యాంకు నుంచి ఆ మొత్తం వారి ఖాతాల్లోకి వెళ్లిపోవడంతో తిరిగి ఇవ్వాల్సినపనీ ఉండేది కాదు.  

పక్కా ప్రణాళికతో.. 
ఈ గ్యాంగ్‌ బ్యాంకు హోం బ్రాంచ్‌కు చెందిన ఏటీఎం కేంద్రాలకు వీరు వెళ్లేవారు కాదు. మరో బ్యాంకు ఏటీఎం నుంచి నగదు తీసుకుంటూ ఈ టెక్నిక్‌ వాడేవారు. హైదరాబాద్‌ను టార్గెట్‌గా చేసుకున్న ఈ గ్యాంగ్‌ 31 కార్డులతో రంగంలోకి దిగింది. ఈ కార్డులు ఇచ్చిన హరియాణా, రాజస్తాన్‌కు చెందిన వారంతా చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వారే. దీంతో వారికి జీతాలు వచ్చినప్పుడే ఖాతాల్లో డబ్బు ఉంటుంది. ఆ సమయంలోనే ఈ టెక్నిక్‌తో డ్రా చేసుకునే వారు. రాజధానిలోని 7 ప్రాంతాల్లో రూ.లక్ష వరకు విత్‌డ్రా చేశారు. ఈ అనుభవంతో వచ్చే నెలలో భారీ మొత్తం కాజే యాలని స్కెచ్‌ వేశారు. ఈలోపు వీరి కదలికలపై సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు ఎన్‌.శ్రీశైలం, కేఎన్‌ ప్రసాద్‌వర్మ, మహ్మద్‌ తఖీయుద్దీన్, వి.నరేంద్ర తమ బృందాలతో దాడి చేసి ఐదుగురినీ పట్టుకున్నారు. కాగా, ఏటీఎం మెషీన్‌కు సృష్టించిన సాంకేతిక సమస్యను పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. కొన్ని ఏటీఎం మెషీన్లకు ఉన్న ఈ లోపంపై బ్యాంకులకు లేఖ రాసి, లోపాన్ని సరిచేయనున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top