ప్రియురాలిని దూరం చేశాడనే..

Software Engineer Murder Case Reveals in Hyderabad - Sakshi

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ హత్య కేసులో వీడిన మిస్టరీ

స్నేహితుడు హేమంత్‌ నిందితుడిగా గుర్తింపు

వివాహేతర సంబంధం వద్దన్నందుకు హత్య

కేపీహెచ్‌బీకాలనీ: ఐటీ సంస్థ యజమాని  మైలా సతీష్‌బాబు హత్య కేసులో మిస్టరీ వీడింది. ఈ కేసులో నిందితుడైన హేమంత్‌ను కేపీహెచ్‌బీ పోలీసులు మాదాపూర్‌ ఎస్‌ఓటీ సహకారంతో అరెస్టు చేశారు. గురువారం కూకట్‌పల్లి ఏసీపీ కార్యాలయంలో సమావేశంలో మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వరరావు, ఏసీపీ సురేందర్‌రావుతో కలిసి వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా, మార్టూర్‌కు చెందిన మైలా సతీష్‌బాబు (35) నగరానికి వలస వచ్చి అమీర్‌పేటలో క్యాపిటల్‌ ఇన్ఫో సొల్యుషన్స్‌ పేరుతో ఐటీ శిక్షణా కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. తన భార్య ప్రశాంతి, కుమార్తెతో కలిసి మూసాపేట ఆంజనేయనగర్‌లో ఉంటున్నాడు. కోరుకొండ సైనిక్‌స్కూల్‌లో చదువుతున్న సమయంలో భీమవరానికి చెందిన హేమంత్‌తో అతడికి స్నేహం ఉంది.  

బాల్య స్నేహితుడని చేరదీస్తే...
నగరంలోని పలు కంపెనీల్లో ఉద్యోగం చేసి మానేసిన హేమంత్‌ తన చిన్ననాటి స్నేహితుడు సతీష్‌బాబును కలిసి తనకు ఏదైనా ఉపాధి చూపాలని కోరాడు. దీంతో తన సంస్థలో ఉద్యోగం ఇచ్చాడు. 2017 డిసెంబర్‌లో కేపీహెచ్‌బీలోని ఏడో ఫేజ్‌లో ఐటీ స్లేట్‌ కన్సల్టెన్సీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో మరో సంస్థను ఏర్పాటుచేసి హేమంత్‌ను దానికి అడ్మినిస్ట్రేటర్‌గా నియమించడమేగాక అతడికి వాటా కూడా ఇచ్చాడు. ఇదే క్రమంలో సతీష్‌బాబు తన వద్ద శిక్షణ పొందిన ప్రియాంకకు సైతం అదే సంస్థలో ట్రైనర్‌గా ఉద్యోగం ఇచ్చాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు హేమంత్, ప్రియాంకల మధ్య స్నేహం పెరిగి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో హేమంత్‌ ఆఫీసు సమీపంలోనే ఇండిపెండెంట్‌ ఇంటిని అద్దెకు తీసుకుని ప్రియాంకతో కలిసి ఉంటున్నాడు. ఈ విషయం సతీష్‌కు తెలియడంతో పలుమార్లు వారిని మందలించాడు. అయినా హేమంత్‌ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో అతని వేతనంలో కోత పెట్టడంతో పాటు పనిచేసే సంస్థ నష్టాలకు హేమంత్‌ ప్రవర్తనే కారణమని నిందించాడు. ప్రియాంకను తిరిగి హాస్టల్‌కు వెళ్లేలా చేసినందుకు హేమంత్‌ సతీష్‌పై కోపం పెంచుకున్నాడు. దీంతో అతడి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించాడు. ఈ విషయాన్ని పూణె లో ఉంటున్న మరో స్నేహితుడికి చెప్పగా, అలాంటి చర్యలకు పాల్పడవద్దని, సతీష్‌ వద్ద పనిచేయడం ఇష్టం లేకపోతే ఇద్దరూ కలిసి దూరం వెళ్లిపోవాలని సూచించాడు. అయినా పట్టించుకోని హేమంత్‌ పథకం ప్రకారం మాట్లాడుకుందామని  గత నెల 28న సతీష్‌బాబుతో చెప్పాడు. అందుకు అంగీకరించిన సతీష్‌బాబు అదేరోజు రాత్రి ఆఫీసు నుంచి బయలుదేరుతూ ప్రియాంకను సైతం బైక్‌పై తీసుకెళ్ళి హాస్టల్‌ వద్ద దింపాడు. అనంతరం సమీపంలోని   వైన్స్‌ వద్ద నాలుగు బీర్లను కొనుగోలు చేసి హేమంత్‌ ఇంటికి వెళ్లాడు.

ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నం...
సతీష్‌బాబును అడ్డు తొలగించుకునేందుకు పథకం పన్నిన హేమంత్‌ ముందుగా కారును అద్దెకు బుక్‌ చేసుకున్నాడు.  సతీష్‌బాబు తన ఇంటికి రాగా ఇద్దరూ కలిసి మద్యం తాగారు. ఈ సందర్భంగా తన జీతాన్ని కావాలని తగ్గించావని, ప్రియాంకను దూరం చేశావంటూ హేమంత్‌ ఆగ్రహం వ్యక్తం చేయగా సతీష్‌బాబు సైతం అదే స్థాయిలో  సమాధానం ఇవ్వబోయాడు. దీంతో హేమంత్‌ ఇనుప సుత్తెతో సతీష్‌బాబు తలపై మోదడంతో అతను  కుప్పకూలిపోయాడు. అనం తరం నోరు, ముక్కు మూసి హత్య చేశాడు. అనంతరం పథకం ప్రకారం కారులో తరలించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని భావించాడు. అయితే మృతదేహాన్ని తరలించేందుకు సాధ్యపడకపోవడంతో అక్కడే వదిలేశాడు. 29న ఉదయం బయటికి వెళ్లి ఎలక్ట్రిక్‌ కట్టర్‌ను తీసుకువచ్చి మృతదేహాన్ని ముక్కలు చేసి తరలించాలని నిర్ణయించాడు. మెడ, మోకాలి భాగాలను కట్‌ చేశాడు. అప్పటికే పలుమార్లు  స్నేహితుల నుంచి ఫోన్లు రావడం, సతీష్‌బాబు కనిపించడంలేదంటూ ఆరాతీయడంతో హడావిడిగా ఇంటికి తాళంవేసి వారి వద్దకు వెళ్లిపోయాడు. సతీష్‌బాబు కోసం తాను కూడా వెతుకున్నట్లు నమ్మించాడు.

భార్య ఫిర్యాదుతో వెలుగులోకి..
సతీష్‌బాబు భార్య ప్రశాంతి 29న మధ్యాహ్నం తన భర్త కనిపించడంలేదంటూ కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా సతీష్‌బాబు  కాల్‌డేటా సేకరించడంతో తాను దొరికిపోతానని భావించిన హేమంత్‌ ఫోన్‌ స్విఛాప్‌ చేసుకొని అదృశ్యమయ్యాడు. పోలీసులు హేమంత్‌ కోసం ఆరాతీయగా అప్పటివరకూ తమతోనే ఉన్నట్లు స్నేహితులు తెలిపారు. ప్రియాంకకు మాత్రమే అతడి ఇళ్లు తెలిసి ఉండటంతో ఆమెతో సహా ఇంటికి వెళ్లి తాళం పగులగొట్టి చూడగా సతీష్‌బాబు మృతదేహం కనిపించింది. దీంతో హేమంతే నిందితుడని నిర్ధారించుకున్న పోలీసులు అతనికోసం గాలింపు చేపట్టారు. గురువారం అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా సతీష్‌బాబు హత్యకేసులో హేమంత్‌ ఒక్కడే ఇప్పటివరకూ నిందితుడిగా గుర్తించామని, ఇతర కాల్‌ డిటైయిల్స్, మెసేజ్‌లను పరిశీలించి ఇతర నిందితులెవరైనా ఉంటే వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top