స్మగ్లింగ్‌ ముఠా అరెస్టు

Smugglers  Arrested In Prakasam - Sakshi

పెద్దారవీడు (ప్రకాశం): వాహనాల తనిఖీల్లో భాగంగా భారీగా గుట్కా బస్తాలు, నగదు, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు మార్కాపురం డీఎస్పీ ఎన్‌వీ రామాంజనేయులు తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి మార్కాపురం సబ్‌డివిజన్‌ పరిధిలో దేవారాజుగట్టు, రాయవరం, హనుమాన్‌జంక్షన్‌ కుంట, కోమటికుంటల పరిసరాల్లో వాహనాల తనిఖీలు చేపట్టారు. దేవరాజుగట్టు సెంటరు వద్ద మండలంలోని హనుమాన్‌ జంక్షన్‌ కుంట నుంచి వేగంగా వస్తున్న మూడు వాహనాలను అపేందుకు ప్రయత్నించారు. అయితే డ్రైవర్లు ఆపకుండా వెళ్తుండటంతో సీఐ భీమానాయక్‌ రంగంలోకి దిగారు. వెంటనే పోలీసులను అప్రమత్తం చేసి వాహనాల వెంటబడి పట్టుకున్నారు. వాటిని తనిఖీ చేయగా నిషేధించిన పొగాకు, గుట్కా, ఖైనీ, గంజాయి నిల్వలు గుర్తించారు. వాటితో పాటు 11 మందిని అదుపులో తీసుకున్నారు.

వీటిని చుట్టు పక్కల ప్రాంతాలైన గుంటూరు జిల్లా రెంటచింతల, నరసరావుపేట, గుంటూరు పట్టణం, మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కంభం, నెల్లూరు జిల్లా ప్రాంతాల్లో సబ్‌ డీలర్లకు భారీగా సరఫరా చేస్తున్నారు. నిందితులైన నల్లారి రామాంజనేయులు, బాదా శివానందరెడ్డి, మిడియాల సత్యనారాయణ, పెరకలపాటి ధనుంజయ, పెబ్బి వెంకటరాముడు, ఎలూర నరేంద్ర, వెన్నపూస నాగర్జునరెడ్డిలు అనంతపురం జిల్లా చెందిన వారు. ప్రధాన ముద్దాయి నల్లారి రామాంజనేయులు కర్ణాటక రాష్ట్రం బళ్లారి కేంద్రంగా నాలుగు టీంలుగా ఏర్పడి పలు ప్రాంతాల్లో ఉన్న సబ్‌ డీలర్లకు సరఫరా చేసేందుకు మనుషులను నియమించుకొని వాటిని సరఫరా చేస్తున్నాడు. సరుకు వేసిన అనంతరం డబ్బులు కూడా వారే వసూలు చేసుకొని యజమానికి ఇవ్వడం చేస్తున్నారు.

125 బస్తాల గుట్కా, ఖైనీల విలువ రూ. 30 లక్షలుగా గుర్తించారు. అలాగే రూ. 23,71,610 స్వాధీనం చేసుకున్నారు. కేజీ గంజాయిని చిన్న ప్యాకెట్లుగా చేసి షాపుల యజమానులకు శాంపిల్స్‌ చూపించేందుకు తరలిస్తున్నారు. ఇందులో భాగంగా మార్కాపురం పట్టణం చెందిన తడికమళ్ల శేషగిరి, గుంటూరు జిల్లా రెంటచింతల చెందిన నామం కిశోర్, షేక్‌ సైదులు, గిద్దలూరుకు చెందిన భవనాశి వెంకటసుబ్బయ్యలకు నిషేధిత ఉత్పత్తులను నల్లారి రామాంజనేయులు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

సరుకు ఉన్న వాహనం ముందు మరొక వాహనంలో ముగ్గురు ఉండి పైలెట్‌గా పోతూ వెనుక వచ్చే వాహనాల డ్రైవర్లకు ఎప్పటికప్పుడు  ఫోన్‌ ద్వారా సమాచారం అందిస్తూ రాకపోకలు సాగిస్తున్నారు. 11 మందిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. సీఐ, ఎస్‌ఐలు, పోలీసులకు జిల్లా ఎస్పీ ద్వారా రివార్డులు ఇప్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో పెద్దారవీడు, మార్కాపురం టౌన్, రూరల్‌ ఎర్రగొండపాలెం, పెద్దదోర్నాల ఎస్సైలు పి. ముక్కంటి, జి. రామకోటయ్య, మల్లికార్జున, దేవకుమార్, రామకోటయ్య, పోలీసు సిబ్బంది ఉన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top