
వివరాలు వెళ్లడిస్తున్న డీసీపీ శ్రీనివాస్
అమీర్‌పేట: ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ దంపతులపై కత్తులతో దాడికి పాల్పడిన ఘటనలో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఇంతియాజ్‌తో పెళ్లి జరగడం ఇష్టంలేని ఫాతిమా సోదరులు స్నేహితులతో కలిసి పథకం ప్రకారమే వారిపై దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.ఆదివారం ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో డీసీపీ ఏ.ఆర్.శ్రీనివాస్ పంజగుట్ట ఏసీపీ తిరుపతన్న వివరాలు వెళ్లడించారు.సంగారెడ్డి జిల్లా, సదాశివపేటకు చెందిన షేక్ రహమతుల్లా కుమారుడు షేక్ ఇంతియాజ్ బోరబండలో ఉంటూ నాంపల్లిలోని ఓ బేకరీలో పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలో ఉంటున్న తమ దూరపు బంధువు సయ్యద్ మోసిన్ అలీ కుటుంబంతో ఇంతియాజ్ చనువుగా ఉండే వాడు. ఈ క్రమంలో సయ్యద్ అలీ కుమార్తె సయ్యద్ జైన్ ఫాతిమాతో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరు ఈ నెల 5న ఎవరికీ తెలియకుండా సదాశివపేటలోని ఓ దర్గాలో వివాహం చేసుకున్నారు. ఇదే రోజు ఫాతిమా తండ్రి ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో తన కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫాతిమా సదాశివపేటలో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లిన ప్రత్యేక బృందం ఆమెను ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చింది. 6వ తేదీ రాత్రి ఫాతిమాను కుటుంబసభ్యులకు అప్పగించారు.
ఇంతియాజ్ హత్యకు పథకం
సయ్యద్ అలీ కుటుంబంతో చనువుగా ఉండే ఇంతియాజ్ ఫాతిమాను చెల్లి అని పిలుస్తుండటంతో వారు అతడిని పూర్తిగా నమ్మారు. అయితే అతనే ఫాతిమాను తీసుకువెళ్లి పెళ్లి చేసుకోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. ప్రధానంగా ఫాతిమా సోదరుడు ఫారూక్ అలీ ఎలాగైన ఇంతియాజ్‌ను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో సమీప బంధువు తో ఇంతియాజ్‌కు ఫోన్ చేయించి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఒప్పంద పత్రాలు రాసుకుని ఫాతిమాను తీసుకెళ్లాలని నమ్మించాడు. దీంతో ఇంతియాజ్ తల్లిదండ్రులతో కలిసి 7న నేరుగా ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు రాగా పోలీసులు ఇరు కుటుంబాలకు కౌన్సింగ్ ఇచ్చి పంపారు. ఫాతిమాతో కలిసి ఇంతియాజ్ కారులో సంగారెడ్డికి వెళుతుండగా ఫారూక్ అలీ, అతడి ముగ్గురు సోదరులు, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి రెండు ఆటోల్లో కారును వెంబడించారు. ఎస్‌ఆర్‌నగర్ ఐసీఐసీఐ బ్యాంకు సమీపంలో కారును అడ్డగించి ఇంతియాజ్‌పై కత్తులతో దాడికి పాల్పడారు. తీవ్రంగా గాయపడిన ఇంతియాజ్ మృతి చెందాడని భావించి అక్కడి నుంచి పారిపోయారు.ఈ దాడిలో ఇద్దరు మహిళలు సహా 8 మంది పాల్గొన్నట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు ఫారూక్ అలీతో పాటు కుటుంబ సభ్యులు మోసిన్ అలీ, మొహమ్మద్ అలీ, అహ్మద్ అలీ, జకీరా బేగం, జెబా ఫాతిమాలను అరెస్టు చేశారు. రెండు ఆటోలు, 5 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఫారూక్ స్నేహితులైన రబ్బాని, షేకీల్‌లు పరారీలో ఉన్నట్లు తెలిపారు.రబ్బాని సనత్‌నగర్‌లో జరిగిన ఓ దొంగతనం కేసులో జైలుకు వెళ్లి ఇటీవలే బయటికి వచ్చినట్లు డీసీపీ వివరించారు. పట్టపగలు బహిరంగ ప్రదేశంలో కత్తులతో దాడులకు పాల్పడటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని అవసరమైతే నిందితుల్లో కొందరిపై పీడియాక్ట్ నమోదు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో డిటెక్టివ్ ఇన్స్‌పెక్టర్ అజేయ్‌కుమార్,ఎస్సై సాయినాథ్ పాల్గొన్నారు.