పోలీసులపైకి ‘రివర్స్‌’

Shailesh saxena games in land grab case - Sakshi

ఇప్పటివరకు 60 తప్పుడు రిట్‌ పిటిషన్లు

భూముల కబ్జా కేసులో నిందితుడు శైలేష్‌ సక్సేనా బాగోతం..

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డితో పాటు న్యాయవాది శైలేష్‌ సక్సేనా పోలీసులపై తప్పుడు రిట్‌ పిటిషన్లు దాఖలు చేస్తూ వారికి తలనొప్పిగా మారారు. హైదరాబాద్‌ నగర నేర పరిశోధన విభాగం పోలీసులు, దర్యాప్తు అధికారి ఏసీపీ విజయ్‌కుమార్‌తో పాటు డీసీపీ అవినాష్‌ మహంతి తదితరులపై వరుసపెట్టి పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. తాజాగా హైకోర్టులో శైలేష్‌ దాఖలు చేసిన మూడింటితో కలిపి మొత్తం 60 రిట్‌ పిటిషన్లు దాఖలు చేశారు. ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం సీసీఎస్‌ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

దీపక్‌రెడ్డితో పాటు న్యాయవాదులు శైలేష్‌ సక్సేనా, సంజయ్‌ సక్సేనా తదితరులు భోజగుట్టతో పాటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో ఉన్న 4 ఖరీదైన స్థలాలపై కన్నేశారు. బోగస్‌ డాక్యుమెంట్లు, నకిలీ యజమానులను సృష్టించి కబ్జా చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ రూ.వందల కోట్ల విలువైన స్థలాలను కొట్టేసేందుకు భారీ కుట్రలే పన్నారు. ఒకే వ్యక్తిని వివిధ పేర్లతో పరిచయం చేస్తూ పలు స్థలాలపై జీపీఏలు, సేల్‌డీడ్లు తయారు చేయించారు. ఈ వ్యవహారంపై నమోదైన ఆరు కేసులను సీసీఎస్‌ అధికారులు దర్యాప్తు చేశారు. దీపక్‌రెడ్డితో పాటు శైలేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 

భారీ పథకమే..
అప్పట్లో బాధితులుగా ఉండి, పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిపై శైలేష్‌ ప్రైవేట్‌ కేసులు నమోదు చేశారు. వారంతా ఉద్దేశపూర్వకంగా తనపై ఫిర్యాదులు చేశారని, రాజకీయ కారణాలతోనే సీసీఎస్‌ అధికారులు జోక్యం చేసుకున్నారని ఆరోపించారు. సివిల్‌ వివాదాల్లో సీసీఎస్‌ పోలీసులు తలదూర్చి తమను అక్రమంగా అరెస్టు చేశారంటూ పేర్కొన్నారు. శైలేష్‌ సక్సేనా దాఖలు చేసే రిట్‌ పిటిషన్లలో అధికంగా అధికారుల పేర్లతోనే వేస్తున్నారు. దీంతో అధికారులే సొంతంగా లాయర్లను ఏర్పాటు చేసుకోవాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top