సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు.. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మూడో స్థానంలో వెనుకంజలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫలితాలపై దీపక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ..‘ఈ ఎన్నికల్లో డబ్బుల ప్రభావం ఎక్కువ ఉంది. డిపాజిట్ వస్తుందనే భావిస్తున్నాం. బీజేపీ ఓట్లకు డబ్బులు పంచదు. చివరి మూడు రౌండ్లు మాకు అనుకూలంగా ఉంటాయి. ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల నాయకులను కొన్నారు. చీరలు పంపిణీ చేశారు. బహుమతులు ఇచ్చారు. అధికార దుర్వినియోగం చేశారు. అని వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు.. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఇప్పటి వరకు దాదాపు 16వేల ఓట్లకు పైగా లీడ్‌లో కొనసాగుతోంది. బీఆర్‌ఎస్ రెండో స్థానంలో ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి విజయం దాదాపుగా ఖాయం కావడంతో హస్తం పార్టీ శ్రేణులు గాంధీ భవన్ వద్ద సంబురాలు చేసుకుంటున్నాయి.


