
అహ్మదాబాద్: 2018 నాటి బిట్‌కాయిన్ దోపిడీ, బిల్డర్‌కిడ్నాప్ కేసులో అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే నళిన్ కొటాడియా, మాజీ ఐపీఎస్ అధికారి జగదీశ్ పటేల్ సహా 14 మందికి జీవిత ఖైదు విధించింది. శైలేష్ భట్ అనే బిల్డర్‌ను అపహరించిన ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో పలువురు గుజరాత్ పోలీసు అధికారులు సైతం ఉండటం గమనార్హం.
వివరాలు ఇలా ఉన్నాయి.. శైలేష్ భట్, అతడి సన్నిహితులు కలిసి సూరత్‌కు చెందిన ధావల్ మవానీ అనే వ్యక్తి నుంచి రూ.150 కోట్ల విలువైన బిట్ కాయిన్లను దొంగతనం చేసినట్లు నళిన్ కొటాడియా, అతడి బ్యాచ్‌కు సమాచారం అందింది. దీంతో, వారు భట్‌ను దోచుకునేందుకు పథకం వేశారు. ఈ కుట్రలో వారు పలువురు పోలీసు ఉన్నతాధికారులను సైతం కలుపుకున్నారు. ఇందుకు పథకం రచించిన సీబీఐ ఇన్‌స్పెక్టర్ సునీల్ నాయర్ రూ.5 కోట్లు ముట్టాయి.
ఇతర పోలీసులతో కలిసి భట్ దగ్గరున్న అప్పట్లో రూ.12 కోట్ల విలువున్న బిట్‌కాయిన్లను దౌర్జన్యంగా లాక్కున్నారు. వీరు భట్ నుంచి 200 బిట్‌కాయిన్లను బలవంతంగా లాక్కోవడంతోపాటు, రూ.32 కోట్లు డిమాండ్ చేశారు. అనంతరం భట్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐడీ క్రైం బ్రాంచి రంగంలోకి దిగి సమగ్ర దర్యాప్తు చేపట్టింది. నిందితులుగా తేలడంతో అమ్రేహ్ ఎస్‌పీ జగదీశ్ పటేల్‌తోపాటు అనంత్ పటేల్ తదితర ఇతర పోలీసు అధికారులను అరెస్ట్ చేసింది. సాక్ష్యాలు, ఆధారాల ఆధారంగా విచారణలో 15 మంది నిందితులకుగాను ఏసీబీ స్పెషల్ కోర్టు 14 మందిని దోషులుగా తేల్చింది. జతిన్ పటేల్‌పై ఉన్న అన్ని ఆరోపణలను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.