నెత్తురోడిన రహదారులు

Road Accidents In Nalgonda District - Sakshi

సాక్షి, నల్గొండ : ఉమ్మడి జిల్లాలోని రహదారులు మరోమారు నెత్తురోడాయి. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం చెందారు. నల్లగొండ, గరిడేపల్లి, మునగాల, వేములపల్లి మండలాల పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనల వివరాలు.. గరిడేపల్లి మండలం  రామచంద్రపురం గ్రామానికి చెందిన పోలె రాంబాబు (32) చిన్నపంగ చిన్నస్వామి(55) బైక్‌పై మండల కేంద్రానికి బయలుదేరారు. ఈ క్రమంలో దురాజ్‌పల్లి నుంచి గరిడేపల్లి వైపు వస్తున్న బొలేరో గడ్డిపల్లి శివరులో ఎదురుగా వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న పోలె రాంబాబు, చిన్నపంగ చిన్నస్వామికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. బ్యాంక్‌ పని నిమిత్తం వెళ్లిన మామా అల్లుడు కాసేపటికే రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం మేరకు ఘటన స్థలాన్ని ఎస్‌ఐ వై.సైదులు పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను హుజూర్‌నగర్‌ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. 

కారు ఢీకొని వ్యక్తి..
మునగాల(కోదాడ):  మండలంలోని తాడువాయి గ్రామానికి చెందిన వీరమళ్ల ఉపేందర్‌(30) తన ద్విచక్ర వాహనంపై పొలం వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వెళుతుండగా విజయవాడ నుంచి సూర్యాపేట వైపు వెళ్లే స్కార్పియో వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉపేందర్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుడికి భార్య, ఐదేళ్ల లోపు వయస్సు గల ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహానికి కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి తెలిపారు. మృతుడి భార్య తిరుమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ ఎస్‌ఐ దాసరి మహిపాల్‌రెడ్డి  తెలిపారు. ఉపేందర్‌ మృతదేహంపై పడి భార్య తిరుమల రోదిస్తున్న తీరును చూసి పలువురు కంటతడి పెట్టుకున్నారు.  

కారు, బైక్‌ ఢీ.. ఒకరు..
వేములపల్లి (మిర్యాలగూడ) : మండలంలోని బుగ్గబావిగూడెం గ్రామానికి చెందిన పుట్ట శ్రీను(34) బైక్‌పై శెట్టిపాలెం శివారులోని ఆదిత్యా రైస్‌ మిల్లు వైపు నుంచి ఇంటికి వెళ్లేందుకు అన్నపురెడ్డిగూడెం స్టేజి వద్ద రోడ్డును దాటుతున్నాడు. ఈ క్రమంలో  మిర్యాలగూడ నుంచి నల్లగొండ వైపునకు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెం దాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోని పంచనామా నిర్వహిం చారు.  మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోçస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుధీర్‌కుమార్‌ తెలిపారు. 

మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలి
మృతుడు పుట్ట శ్రీను కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డీసీసీ అధ్యక్షుడు కెతావత్‌ శంకర్‌నాయక్‌ కోరారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన శ్రీను మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంటికి పెద్ద దిక్కు అయిన శ్రీను మృతితో కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉందన్నారు.  పరామర్శించిన వారిలో మండల పార్టీ అధ్యక్షుడు మాలి కాంతారెడ్డి, నాయకులు రావు ఎల్లారెడ్డి, రొండి శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు. 

కారు బోల్తా.. ఇద్దరు..
నల్లగొండ క్రైం :  జిల్లా కేంద్రంలోని పానగల్‌కు చెందిన బొప్పని నరేశ్‌ (32), పల్లపు అనిల్‌రాజు(37) స్నేహితులు. పని ఉందని సోమవారం రాత్రి పదిగంటలకు ఇంటినుంచి కారులో బయటికి వెళ్లారు. మంగళవారం ఉదయం తిరిగి వస్తుండగా పట్టణ శివారులో లెప్రసీ కాలనీ వద్ద కారు అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో బొప్పని నరేశ్‌ అక్కడికక్కడే మృతిచెందగా అనిల్‌రాజు తీవ్రంగా గాయపడ్డాడు. స్థాని కులు అతడిని ప్ర భుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. అనిల్‌రాజు స్థానిక హుందాయ్‌ షోరూంలో పనిచేస్తుండగా, నరేశ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.సమాచారం మేరకు ఘటన స్థలాన్ని టూటౌన్‌ ఎస్‌ఐ నర్సింహులు పరిశీలించారు. నరేశ్‌ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top