గాంధీ ఆస్పత్రి నుంచి రిమాండ్‌ ఖైదీ పరారీ

Remand Prisoner Escape From Gandhi Hospital - Sakshi

రంపంతో బాత్‌రూం గ్రిల్స్‌ ఊచల తొలగింపు  

రెండో అంతస్తు నుంచి ప్లాస్టిక్‌ పైప్‌ సాయంతో కిందికి దిగిన వైనం  

గాంధీఆస్పత్రి : సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి ప్రిజన్స్‌వార్డులో చికిత్స పొందుతున్న రిమాండ్‌ ఖైదీ పరారైన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా, మైలార్‌దేవ్‌పల్లి లక్ష్మీగూడకు చెందిన పసుపు విక్కీ వేధింపుల కేసులో అరెస్టై 2018 డిసెంబర్‌ 28 నుంచి నుంచి చర్లపల్లి జైలులో రిమాండ్‌ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. గత నెల 22న అతను జైలులోనే బ్లేడ్‌ ముక్కలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రక్తవిరోచనాలు కావడంతో జైలు అధికారులు అతడిని అదే రోజు చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రిలోని ప్రిజన్స్‌వార్డుకు తరలించి వైద్యచికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 10వ తేదీ రాత్రి బాత్‌రూంకు వెళ్లిన విక్కీ ఎంతకూ బయటికి రాకపోవడంతో సెంట్రీ డ్యూటీ నిర్వహిస్తున్న నవీన్‌కుమార్‌కు అనుమానంతో బాత్‌రూంలోకి వెళ్లి చూడగా  గ్రిల్‌ ఉచలు కట్‌ చేసి ఉన్నాయి. నీళ్లు పట్టుకునే పైప్‌ సాయంతో రెండో అంతస్తు నుంచి కిందికి దిగి పరారైనట్లు గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. ప్రిజన్‌వార్డ్‌ గార్డ్‌ ఇన్‌చార్జ్‌ లాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

ఆస్పత్రి వెనుకగేటు నుంచి పరారీ...
ప్లాస్టిక్‌ పైప్‌ సాయంతో కిందికి దిగిన విక్కీ ఆస్పత్రి వెనుకవైపు ఉన్న గేటును దూకి పద్మారావునగర్‌ వైపు వెళ్లినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ అస్పష్టంగా ఉండడంతో నిందితుడి కదలికలు గుర్తించడం కష్టసాధ్మైంది.

బయటపడ్డ డొల్లతనం...  
గాంధీ ఆస్పత్రి ప్రిజన్‌వార్డు నుంచి ఖైదీ పరారు కావడంతో అధికారులు కంగుతిన్నారు. జైళ్లశాఖకు చెందిన పోలీసులే వార్డు బధ్రతను పర్యవేక్షిస్తారు. ఆస్పత్రి ప్రధాన భవనంలోనే ఉన్నప్పటికీ వైద్యులు, సిబ్బందిని మాత్రమే తనిఖీలు నిర్వహించి లోపలకు పంపిస్తారు. లోపల ఉన్న విక్కీ రంపం ఎలా సంపాదించాడనేది ప్రశ్శార్ధకంగా మారింది. ప్రిజన్‌వార్డులో రిమాండ్‌ ఖైదీలు మైఖేల్, గోలియాదవ్, విక్కీ మాత్రమే చికిత్సలు పొందుతున్నారు. కిటికీ గ్రిల్స్‌ ఉచలు కట్‌ చేసి విక్కీ పరారు కావడంతో ప్రిజన్‌వార్డు డొల్లతనంతోపాటు అక్కడ విధులు నిర్వహిస్తున్నపోలీసులు పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top