ప్రేమ.. డ్రామా.. మధ్యలో ‘సాగర్‌’ 

Raniganj Woman Missing In Hyderabad MMTS Train - Sakshi

సాక్షి, రాంగోపాల్‌పేట్‌ : రాణి గంజ్‌కు చెందిన ఓ యువతి (26)  సోమవారం ఉదయం 10.30 గంటల సమయంలో చెల్లెలితో కలిసి ఎంఎంటీఎస్‌ రైలులో  వెళ్లింది. సంజీవయ్య పార్కు వద్ద చెల్లికి  లేఖ ఉన్న ఒక కవరు ఇచ్చి ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లిపోయింది. అక్క ఎక్కడికి వెళ్లిందో అర్థం కాక చెల్లెలు లేఖను చూసింది. అందులో.. ‘అమ్మా  నేను చనిపోతున్నా ’ అని రాసి ఉంది. దీంతో ఆందోళనకు గురైన చెల్లెలు అమ్మానాన్నలకు చెప్పింది. వారు పోలీసులకు సమాచారమిచ్చారు. ఇదిలా ఉండగా యువతి బ్యాగు నెక్లెస్‌రోడ్‌లో ఉన్న నాలా పక్కన అక్కడున్న వారికి కనిపించింది. దీంతో రాంగోపాల్‌పేట్‌ ఇన్‌స్పెక్టర్‌ బాబు, లేక్‌ ఇన్‌స్పెక్టర్‌ ధనలక్ష్మి పోలీసులు పెద్ద ఎత్తున సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.  

గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి హుసేన్‌ సాగర్‌ను అణువణువూ గాలించారు. సాగర్‌లో దూకిన అమ్మాయి ఆచూకీ ఏమైనా దొరుకుతుందేమోననే ఆశతో సాగర్‌ను జల్లెడ పట్టారు.  బయటనుంచి ప్రజలు కూడా గుమిగూడారు. యువతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతూ మా కూతురు బతికే ఉండాలి దేవుడా అని దండం పెడుతున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ గాలింపు కొనసాగింది. సాగర్‌తోపాటు పక్కనున్న నాలాలో కూడా వెతుకుతూనే ఉన్నారు. తరువాత అమ్మానాన్నలకు ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. దానిని విన్న తల్లిదండ్రులు నిశ్చేష్టులయ్యారు. అమ్మా..నేను బాగానే ఉన్నా.. అంటూ కూతురు ఎక్కడినుంచో ఫోన్‌చేసి చెప్పింది. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రియుడితో కలిసి వెళ్లిపోయేందుకు ఆమె ఇలా నాటకమాడినట్లు తెలుస్తోంది.  తండ్రి ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top