‘రివెంజ్‌ కోసమే హజీపూర్‌ హత్యలు’

Rachakonda CP Mahesh Bhagwat Press Conference on Hajipur Serial Murder Case - Sakshi

శ్రీనివాస్‌ రెడ్డి సైకో కిల్లర్‌

ముగ్గురిని హత్యచేసినట్లు అంగీకరించాడు

లిఫ్ట్‌ పేరిట దారుణానికి ఒడిగట్టాడు

రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌

సాక్షి, భువనగిరి : రివెంజ్‌ కోసమే నిందితుడు మర్రి శ్రీనివాస్‌ రెడ్డి హజీపూర్‌లో వరుస హత్యలకు పాల్పడ్డాడని రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. లిఫ్ట్‌ మెకానిక్‌గా పనిచేసే శ్రీనివాస్‌ రెడ్డిపై 2015లో బొమ్మలరామారంలో ఓ అమ్మాయిని ఈవ్‌టీజింగ్‌ చేసినట్లు కేసు నమోదైందని, అప్పుడు పెద్దలు రాజీ చేశారన్నారు. ఆ సమయంలో గ్రామస్థులు అతన్ని కొట్టారని, ఇది మనసులో పెట్టుకున్న శ్రీనివాస్‌ రెడ్డి దానికి రివేంజ్‌గా ఈ వరుస హత్యలకు పాల్పడ్డాడని చెప్పారు. అతనిది పూర్తిగా సైకో బిహేవియరని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరుస హత్యల కేసు వివరాలను ఆయన మంగళవారం మీడియాకు వివరించారు. 

‘ఏప్రిల్‌ 25న బొమ్మలరామరం మండలం హజీపూర్‌ నుంచి శ్రావణి అనే అమ్మాయి అదృష్యమైనట్లు కేసు నమోదైంది. మరుసటి ఉదయం.. హజీపూర్‌లోని ఓ బావి దగ్గర శ్రావణి స్కూల్‌ బ్యాగు దొరికింది. డాగ్‌స్క్వాడ్‌ ద్వారా అదే ప్రాంతంలో శ్రావణి మృతదేహన్ని గుర్తించాం. ఆ గ్రామ సర్పంచ్‌, అమ్మాయి తండ్రి నన్ను కలవడం జరిగింది. అందరం ఆ గ్రామానికి వెళ్లాం. అదే గ్రామానికి చెందిన మర్రి శ్రీనివాస్‌ రెడ్డి బావిలో అమ్మాయి శవం ఉందని నిర్ధారించాం. అనంతరం భువనగిరి ఏరియా ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించగా.. అత్యాచారం జరిపి హత్య చేసినట్లు తేలింది. 

 
డబ్బులు విషయంలో వేశ్యను చంపి.. 

సిట్‌ ఏర్పాటు చేసి దర్యాప్తు మొదలు పెట్టాం. గతంలో మర్రిశ్రీనివాస్‌ రెడ్డిపై కర్నూలు టూటౌన్‌లో కేసు నమోదైనట్లు సమాచారం అందింది. 2017లో సెక్స్‌వర్కర్‌ అమ్మాయిని అత్యాచారం చేసి హత్యా చేసినట్లు అతనిపై కేసు నమోదైంది. కర్నూల్లో నలుగురు స్నేహితులతో కలిసి గదికి వ్యభిచారిని తీసుకొచ్చి డబ్బుల విషయంలో గొడవపడి అక్కడ ఆమెను దారుణంగా చంపి పరారయ్యాడు. అక్కడి పోలీసులు గ్రామానికివచ్చి మరి అతన్ని అరెస్ట్‌ చేయడం జరిగింది.  పైగా అతను ఏప్రిల్‌ 26నే మాయం అయ్యాడు. అక్కడ కొందరు గంజాయి తాగుతున్నారని వారిని కూడా విచారించాం. చివరిగా శ్రీనివాస్‌ రెడ్డిపై అనుమానం వచ్చింది. పోచంపల్లి సమీపంలోని రావిరాల గ్రామంలో అతని కజిన్‌ దగ్గర షెల్టర్‌ తీసుకున్నట్లు తెలిసింది. అక్కడికి వెళ్లి పట్టుకున్నాం. 

లిఫ్ట్‌ ఇచ్చి.. బావిలో తోసేసి..
ఏప్రిల్‌ 29 ఉదయం భువనగిరి రూరల్‌ ఎస్సైకి బావి నుంచి దర్వాసన వస్తుందని ఫిర్యాదు అందితే.. మళ్లీ పరిశీలించాం. ఆ బావిలో ఆధార్‌ కార్డుతో పాటు, కాలేజీ ఐడెంటీ కార్డు దొరికింది. అందరి సమక్షంలో మరో మృతదేహాన్ని వెలకితీయడం జరిగింది. ఆధార్‌కార్డు, కాలేజీ ఐడేంటీ ద్వారా బీకాం సెకండీయర్‌ విద్యార్థిని మనీషా అని గుర్తించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులను సంప్రదిస్తే.. శివరాత్రి నుంచి కనబడలేదని, గతంలో కూడా ఇలానే వెళ్లిందని చెప్పారు. మనీషా, శ్రావణి మృతదేహాలు.. శ్రీనివాస్‌ రెడ్డి బావిలోనే దొరికాయి. దీంతో అతన్ని మా రీతిలో విచారణ జరిపితే నేరం అంగీకరించాడు. ఏప్రిల్‌ 25న 11.30 సమయంలో స్కూల్‌ నుంచి వచ్చి టర్నింగ్‌ వద్ద దిగిన శ్రావణి కొద్దిసేపు పక్కనే ఉన్న చెట్టు కింద నిలబడింది. అటుగా వచ్చిన శ్రీనివాస్‌ రెడ్డి ఆమెకు లిఫ్ట్‌ ఇచ్చి బావి దగ్గరకు తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. బావిలోకి నెట్టేసి.. అనంతరం దిగి అత్యాచారం జరిపాడు. ఏం తెలియనట్టు 26న తన క్లాస్‌మెట్‌ పెళ్లికి వెళ్లాడు. పోలీసులు అందరు గ్రామంలోకి రాగానే పరారయ్యాడు. 

మనీషా, కల్పనలను అలానే..
మార్చి9న లిఫ్ట్‌ పేరిట బావి దగ్గరకు తీసుకెళ్లి మనీషాను అత్యాచారం చేసి పాతిపెట్టాడు. 2015లో మరో బాలిక కల్పన.. తప్పిపోయింది. అప్పట్లో మిస్సింగ్‌ కేసు కూడా నమోదైంది. ఆ కేసు గురించి ప్రశ్నించగా అది కూడా తానే చేసినట్లు శ్రీనివాస్‌ రెడ్డి ఒప్పుకున్నాడు. బాడీని సంచిలో ప్యాక్‌ చేసి సీతారాం రెడ్డి బావిలో పడేసినట్లు చెప్పాడు. ఆ మృతదేహం కోసం అక్కడ వెతకడం జరిగింది. మాకు కొన్ని ఎముకలు లభించాయి. వాటి పరీక్షలు నిర్వహించి నిర్ధారణ చేసుకోవాల్సి ఉంది. శ్రీనివాస్‌ రెడ్డి నాలుగు అత్యాచారా, హత్య కేసు కేసుల్లో సంబంధం ఉంది. కర్నూల్లో మరో​ ముగ్గురితో కలిసి చేయగా.. హజీపూర్‌లోనే మూడు హత్యలను మాత్రం ఒక్కడే చేసినట్లు తెలిపాడు. మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచి కస్టడీలో తీసుకుని విచారిస్తాం. ఎక్కడెక్కడా ఉన్నాడో అక్కడేమైనా దారుణాలకు ఒడిగట్టాడా? అనే కోణంలో విచారణ జరుపుతాం.’ అని మహేశ్‌ భగవత్‌ పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top