తప్పుడు రిపోర్టుతో నాలుకకు ఎసరు!

private doctors neglect takes young man throat - Sakshi

ప్రైవేటు వైద్యుడి నిర్లక్ష్యంతో మూగబోయిన గొంతు 

మహబూబాబాద్‌ అర్బన్‌: వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా ఓ యువకుడి గొంతు మూగబోయింది. కేన్సర్‌ ఉన్నా.. లేదని తప్పుడు రిపోర్టు ఇవ్వడం.. చివరకు నాలుక తొలగించాల్సి వచ్చింది. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో సోమవారం వెలుగుచూసింది. కేసముద్రం మండలం మహమూద్‌పట్నంకు చెందిన శ్రీనివాస్‌ నాలుకకు పుండ్లు కాగా.. జిల్లా కేంద్రంలోని శ్రీరామకృష్ణ నర్సింగ్‌ హోమ్‌లోని ఈఎన్‌టీ వైద్యుడు భార్గవ్‌ వద్దకు వెళ్లాడు. పరీక్షించిన వైద్యుడు.. శ్రీనివాస్‌ నాలుక చిన్న ముక్కను కోసి ల్యాబ్‌కు పంపాడు. మూడు రోజుల తర్వాత కేన్సర్‌ లేదని రిపోర్టు వచ్చింది. దీంతో మూడు నెలలు మందులు వాడాలని రాసిచ్చాడు.

అయితే.. మందులు వాడినా నాలుక పైన పుండ్లు తగ్గకపోవడంతో శ్రీనివాస్‌ ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడి ఈఎన్‌టీ వైద్యుడు పరీక్షించగా కేన్సర్‌ అని తేలింది. వైద్యుడి సలహా మేరకు శ్రీనివాస్‌ హైదరాబాద్‌లోని బసవతారకం ఆస్పత్రికి వెళ్లగా కేన్సర్‌ నాలుక మొత్తానికి వ్యాపించిందని, నాలుక పూర్తిగా తొలగించకుంటే శరీరమంతా వ్యాపించి ప్రాణాలకు ముప్పు ఉంటుందని అక్కడి వైద్యులు చెప్పారు. దీంతో గత్యంతరం లేక నాలుకను తీయించుకున్నాడు. కేన్సర్‌ వ్యాప్తికి కారకుడైన డాక్టర్‌ భార్గవ్‌పై చర్యలు తీసుకోవాలని, నష్టపరిహారం చెల్లించాలని బాధితుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన, ధర్నా నిర్వహించారు. టౌన్‌ ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌ ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పడంతో వారు ఆందోళన విరమించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top