భారీ స్కెచ్ | Police Department Special Eye On Cricket Bettings | Sakshi
Sakshi News home page

భారీ స్కెచ్

Apr 2 2018 9:28 AM | Updated on Apr 2 2018 9:28 AM

Police Department Special Eye On Cricket Bettings - Sakshi

ప్రొద్దుటూరు క్రైం :మరో ఐదు రోజుల్లో క్రికెట్‌ సందడి ప్రారంభం కానుంది. ఈ నెల 7 నుంచి 50 రోజుల పాటు ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఐపీఎల్‌ సీజన్‌ అంటే క్రికెట్‌ అభిమానులతోపాటు బుకీలకూ పండగే. ఇరు జట్ల  గెలుపోటములతోపాటు.. స్టేడియంలో పరుగులు తీసే ప్రతి బంతికి రూ. కోట్లలో పందాలు జరుగుతాయి. ఇందుకోసం బుకీలు తమ స్థావరాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఒకే చోట ఉండి పందాలు నిర్వహిస్తే పోలీసులకు పట్టుబడే అవకాశం ఉన్నందున రోజుకో ప్రాంతంలో ఉండేలా బుకీలు ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. ఇందుకోసం మూడు, నాలుగు రాష్ట్రాలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ప్రొద్దుటూరు, కడప, రాయచోటి, చెన్నూ రు, రాజంపేట, జమ్మలమడుగు, దువ్వూరు తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున క్రికెట్‌ పందాలు కూడా జరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ జాడ్యం పాకడంతో పోలీసులు గ్రా మాలపై కన్నేశారు. 

తెరపైకి కొత్త ముఖాలు
జెంటిల్‌మెన్‌ గేమ్‌గా పేరొందిన క్రికెట్‌లో బెట్టింగ్‌ నిర్వహిస్తున్న కొందరు పందెం రాయుళ్లు కూడా జెంటిల్‌మెన్‌లుగా చలామణి అవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బెట్టింగ్‌ నిర్వహించడం ఆషామాషీ వ్యవహారం కాదు. రెండేళ్ల నుంచి జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది. అప్పటి ఎస్పీ రామకృష్ణ తీసుకున్న చర్యల వల్ల జిల్లాలోని చాలా మంది బుకీలు తోక ముడిచారని చెప్పవచ్చు. తర్వాత వచ్చిన ఎస్పీ అట్టడ బాబూజీ కూడా అదే పం««థాను కొనసాగిస్తుండటంతో జిల్లాలో బెట్టింగ్‌ సుమారు 60 శాతం మేర తగ్గింది. కారణం తెలియదు కానీ ఇటీవల పోలీసుల దాడులు తగ్గడంతో బెట్టింగ్‌ మళ్లీ పురుడు పోసుకుంటున్నట్లు కనిపిస్తోంది. పోలీసుల భయంతో సీనియర్‌ బుకీలు కొందరు పందాలకు స్వస్తి చెప్పినా.. కొత్త బుకీలు మాత్రం చెలరేగి పోతున్నట్లు సమాచారం. ఇటీవల కొత్తగా కొందరు యువ బుకీలు కూడా తెరపైకి వచ్చారు. వీరిపై పోలీసులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.

ఒక్కో రోజు ఒక్కో రాష్ట్రంలో..
బుకీలు 50 రోజుల ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఒకే చోట స్థావరం ఏర్పరుచుకొని పందాలు నిర్వహిస్తే పోలీసుల నుంచి కష్టాలు తప్పవని భావించి.. ఒక్కో రోజు ఒక్కో రాష్ట్రంలో ఉండేలా రూట్‌ మ్యాప్‌ను తయారు చేసుకున్నట్లు  సమాచారం. గతంలో బెంగళూరు, హైదరాబాద్‌లో ఉంటూ బెట్టింగ్‌ నిర్వహించే వాళ్లు, అయితే ఇటీవల ఈ రెండు నగరాల్లో పోలీసులు దాడులు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ రెండు సిటీలు క్రికెట్‌ పందాలకు సురక్షితం కాదని బుకీలు గ్రహించారు. చెన్నై, గోవా, మహారాష్ట్రలోని ముంబై, ఒడిస్సా తదితర ప్రాంతాలను ఎంచుకున్నట్లు తెలిసింది. సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా పోలీసులు గుర్తు పట్టే అవకాశం ఉన్నందున రోజుకో ప్రాంతానికి వెళ్లడం శ్రేయస్కరమని బుకీలు భావిస్తున్నట్లు  తెలిసింది.

వేధిస్తున్న సిబ్బంది కొరత
గతేడాది ప్రొద్దుటూరు సబ్‌డివిజన్‌ పరిధిలో పోలీసులు 15 క్రికెట్‌ బెట్టింగ్‌ కేసులను నమోదు చేసి.. బుకీల నుంచి రూ.11 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఐపీఎల్‌ ప్రారంభం కానుండటంతో దాడులు నిర్వహించాలని ఉన్నతాధికారుల నుంచి స్థానిక పోలీసులకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. అన్ని స్టేషన్లలో సిబ్బంది కొరత పోలీసు శాఖను వేధిస్తోంది. సబ్‌డివిజన్‌లోని 72 మంది పోలీసులను ప్రొద్దుటూరులో నూతనంగా ఏర్పాటు చేసిన కమాండ్‌ అంట్‌ కంట్రోల్‌ సెంటర్‌కు మార్చారు. దీంతో  ప్రధాన స్టేషన్లలో సిబ్బంది అరకొరగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా దాడులు నిర్వహించాలని పోలీసు అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి పోలీసులు బుకీలను ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement