కోడెల తనయుడి అక్రమాలకు అడ్డేలేదు 

Police Case Filed On Kodela Siva Rama Krishna - Sakshi

ఇష్టానుసారంగా అవినీతికి పాల్పడుతున్నారు..

ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారు

రూరల్‌ ఎస్పీకి తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి పులిమి వెంకటరామిరెడ్డి ఫిర్యాదు  

గుంటూరు: స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తనయుడు శివరామకృష్ణ అక్రమాలకు అడ్డూ, అదుపూ లేకుండా పోయిందని టీడీపీకి చెందిన తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి పులిమి వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం పేరుతో అక్రమ కేసులు బనాయించి తమను వేధిస్తున్నారని గుంటూరు రూరల్‌ ఎస్పీ వెంకటప్పలనాయుడికి సోమవారం ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రత్యేక అధికారితో విచారణ జరిపించాలని కోరారు. అనంతరం వెంకటరామిరెడ్డి పాలపాడు గ్రామస్తులతో కలసి మీడియాతో మాట్లాడారు.

పోలీస్, రెవెన్యూ అధికారులను కోడెల శివరామకృష్ణ తన చెప్పుచేతల్లో పెట్టుకొని.. ఇష్టానుసారంగా అవినీతికి పాల్పడుతున్నారని చెప్పారు. దీనిపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు ఎంపీ రాయపాటి సాంబశివరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులకు ఫిర్యాదు చేయగా.. వారు స్పందించలేదన్నారు. పార్టీ ప్రతిష్టను కాపాడుకునేందుకు ఈ నెల 15న తన నివాసంలో ఆమరణ దీక్షకు దిగగా.. వెయ్యి మంది టీడీపీ కార్యకర్తలు సంఘీభావం తెలిపారని చెప్పారు. దీన్ని సహించలేని శివరామకృష్ణ పోలీసులతో దీక్షను భగ్నం చేయించారని ధ్వజమెత్తారు.

అదే సమయంలో శివరామకృష్ణ వర్గానికి చెందిన వ్యక్తులు పోలీస్‌ వాహనాన్ని ధ్వంసం చేశారని ఆరోపించారు. కానీ ఈ ఘటననూ తమకు అంటగడుతూ 29 మందిపై అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. అదేమని ప్రశ్నిస్తే రౌడీషీట్‌ తెరుస్తామంటూ పోలీసులు బెదిరిస్తున్నారని వాపోయారు. చివరకు విద్యార్థులపైనా  కేసు నమోదు చేయడం దారుణమన్నారు. దీనిపై ప్రత్యేక అధికారితో దర్యాప్తు చేయించాలని ఎస్పీని కోరామన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top