కొలువు పేరుతో లక్షలు కొట్టేశాడు!

Police Arrested Fraud Person Taking Rs 26 lakhs For Providing Jobs - Sakshi

సాక్షి, సిటీబ్యూరో : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రూ.26 లక్షలు కాజేసిన మోసగాడిని పోలీసులు పట్టుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ పి.రాధాకిషన్‌రావు శనివారం ఆ వివరాలను వెల్లడించారు. డీసీపీ కథనం ప్రకారం.. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన దోమకొండ వెంకటేష్‌ అనే వ్యక్తి నగరానికి వలసవచ్చి చిక్కడపల్లిలో స్థిరపడ్డాడు. డిగ్రీ విద్యను మధ్యలోనే ఆపేసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిగా అవతారమెత్తాడు. ఈ నేపథ్యంలోనే కొందరు వ్యాపారులతో అతడికి  పరిచయాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ వ్యాపారం సాగకపోవడంతో ఉద్యోగాల పేరుతో మోసాలు చేయాలని పథకం రచించాడు. తనకు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతో పరిచయాలు ఉన్నాయంటూ ప్రచారం చేసుకునేవాడు. వీటి ఆధారంగా వివిధ కేంద్ర, రాష్ట్ర విభాగాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికేవాడు.

ఈ క్రమంలోనే చిక్కడపల్లి వాసి రాజిరెడ్డి తన కుమారుడితో పాటు పరియస్తులకు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ విషయం ఆయన ద్వారానే తెలుసుకున్న వెంకటేష్‌.. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. రాజిరెడ్డి కుమారుడికి రెవెన్యూ విభాగంలో డిప్యూటీ తహసీల్దార్, మిగిలిన వారికి నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌లో (ఎన్‌ఐసీ) టెక్నికల్‌ అసిస్టెంట్, నాబార్డ్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు ఇప్పిస్తానని ఎర వేశాడు. ఒక్కో పోస్టుకు రూ.10 లక్షల చొప్పున ఖర్చవుతుందంటూ రాజిరెడ్డి నుంచి వివిధ దఫాల్లో రూ.26.5 లక్షలు కాజేశాడు. ఆయనకు నమ్మకం కలగడానికి బయోడేటా, విద్యార్హత పత్రాలు, ఫొటోలు, చిరునామా ధ్రువీకరణలు కూడా తీసుకున్నాడు.

బాధితుడు ఎప్పుడు ప్రశ్నించినా ఆయా విభాగాల్లో అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు సిద్ధంగా ఉన్నాయని, చేరాల్సిన పంథాలోనే వచ్చి చేరతాయని చెప్పేవాడు. ఎంతకీ నిమాయకాలు జరగకపోవడంతో రాజిరెడ్డి తన డబ్బు తిరిగి ఇవ్వాలంటూ వెంకటేష్‌పై ఒత్తిడి తెచ్చాడు. దీంతో ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసుకున్న వెంకటేష్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. బాధితుడు చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావు నేతృత్వంలో రంగంలోకి దిగిన బృందం శనివారం నిందితుడిని పట్టుకుంది.

విచారణ నేపథ్యంలోనే నిందితుడు నిరుద్యోగుల్ని ఆకర్షించడానికి అనేక ప్రాంతాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నట్లు తేలింది. సిద్దిపేటలో ఎం.శ్రీరాములు, నిజామాబాద్‌లో మోహన్, సిరిసిల్లలో నరేష్, నిజామాబాద్‌లో నవీన్, గిరి ఏజెంట్ల పాత్ర పోషించినట్లు వెల్లడైంది. వెంకటేష్‌ను చిక్కడపల్లి పోలీసులకు అప్పగించిన అధికారులు అయిదుగురి వ్యవహారాలు ఆరా తీస్తున్నారు. వీరు సైతం ఎవరైనా నిరుద్యోగుల్ని మోసం చేయడంలో పాత్రధారులుగా ఉన్నారా? అనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. వెంకటేష్‌ నుంచి కారు, ఇతర పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top