బస్సులో వచ్చి..బైకుపై వెళ్తాడు!

police arrested bike thief - Sakshi

పోలీసులకు చిక్కిన బైక్‌ దొంగ

నిందితుడు మాజీ ఉపసర్పంచ్‌

కంటోన్మెంట్‌ : అతను ఓ గ్రామ ఉపసర్పంచ్‌గా పనిచేశాడు... కరీంనగర్‌ జిల్లాలోని తన ఊరి నుంచి నగరానికి బస్సులో వస్తాడు.. తిరిగి వెళ్లే క్రమంలో సికింద్రాబాద్‌ జేబీఎస్‌ సమీపంలో పార్కు చేసి ఉన్న ద్విచక్ర వాహనాల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకుని దానిపై ఉడాయిస్తాడు...వారం పదిరోజులకోసారి క్రమం తప్పకుండా దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడితో పాటు అతడు చోరీ చేసిన వాహనాల చేసిస్‌ నెంబర్లు మార్చే వ్యక్తిని నార్త్‌జోన్‌ పోలీసులు అరెస్టు చేశారు. నార్త్‌జోన్‌ డీసీపీ సుమతి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్‌ మండలం పందిళ్ల గ్రామానికి చెందిన అలుమల్ల విజేందర్‌రెడ్డి  గ్రామ ఉపసర్పంచ్‌గా, వార్డు మెంబర్‌గా పనిచేశాడు. జేసీబీ కొనుగోలు చేసిన ఇతను ఆర్థికంగా నష్టపోయాడు.

ఇందులోనుంచి బయపడేందుకు బైక్‌ చోరీలను ఎంచుకున్నాడు. తరచూ నగరానికి వచ్చే ఇతను బైకులను చోరీ చేసేవాడు. ఎత్తుకెళ్లిన వాహనాలను కరీంనగర్‌ జిల్లా, కశ్మీర్‌గూడకు చెందిన మహ్మద్‌ యూనిస్‌  మోయినుద్దీన్‌ సహకారంతో చేసిన నెంబర్‌ సహా రూపురేఖలు మార్చి విక్రయించే వాడు. సికింద్రాబాద్‌ మార్కెట్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో తరచూ బైక్‌లు చోరీకి గురవుతుండటంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు నిందితుడిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణలో అతను పది బైక్‌లను చోరీ చేసినట్లు అంగీకరించడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. 2016లోనూ నిందితుడు విజేందర్‌ రెడ్డిని అరెస్టు చేసిన కరీంనగర్‌ పోలీసులు అప్పట్లో 15 మోటార్‌ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచిన మార్కెట్‌ పోలీసులను అభినందించారు. సమావేశంలో మహంకాళీ ఏసీపీ ఏ. వినోద్‌ కుమార్, సీఐ ఎం. మట్టయ్య, డీఎస్‌ఐ వెంకటరెడ్డి పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top