కొడుకు మృతదేహాన్ని ఇంట్లోకి రానీయని కుటుంబసభ్యులు

Parents Not Allowed Son Dead Body In House - Sakshi

భర్త మృతదేహంతో రోడ్డుపై బైఠాయింపు

స్థానికులు కలుగజేసుకోవడంతో ఆందోళన విరమణ

లక్ష్మీపురం(గుంటూరు) : కుటుంబ కలహాల నేపథ్యంలో ఈనెల 13న  ఆత్మహత్య చేసుకుని కొడుకు మృతిచెందాడు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంట్లోకి ససేమిరా రానీయమంటూ తలుపులు వేసుకున్నారు. దీంతో రెండు రోజులుగా   భర్త మృతదేహంతో భార్య అత్తింటి ముందు బైఠాయించింది. వివరాల్లోకి వెళితే... స్థానిక కోబాల్డ్‌పేట 4వలైనుకు చెందిన షేక్‌ అల్లాబక్షు (41) ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తుంటాడు. ఈయనకి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలంగా అల్లాబక్షు ఆస్థిలో తనకు రావాల్సిన వాటా ఇవ్వాలంటూ తల్లి హుస్సేన్‌బీని అడుగుతున్నాడు. ఈక్రమంలో కుటుంబ కలహాల నేపథ్యంలో అల్లాబక్షు మద్యానికి బానిసయ్యాడు. ఈనెల 12న తల్లితో వాగ్వివాదానికి దిగడంతో ఆస్తులు పంచేందుకు  నిరాకరించింది. మనస్థాపానికి గురైన అల్లాబక్షు ఇంటికి వచ్చి ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  పోస్టుమార్టం అనంతరం భార్య హసీనా ఈనెల 14న భర్త మృతదేహాన్ని అత్త ఇంటికి ఖననం చేసేందుకు తీసుకెళ్లింది.

మాతో ఘర్షణలకు పాల్పడి తనువు చాలించాడనడం సరికాదని, అందుకు నీవే బాధ్యురాలివంటూ కోడలు హుస్సేన్‌బీని మృతుడి తల్లి దుర్బాషలాడింది. కొడుకే మృతి చెందాక ఇక తనకు ఎవరూ అవసరం లేదంటూ  తల్లి, ఇతర కుటుంబసభ్యులు మృతదేహాన్ని ఇంట్లోకి రానీయకుండా  తలుపులు వేసుకున్నారు. గత్యంతరం లేని స్థితిలో హసీనా రెండు రోజులుగా భర్త మృతదేహంతో అత్త ఇంటి ముందు రోడ్డుపై బైఠాయించింది.  దిక్కుతోచని హసీనా మృతదేహంతో నడిరోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపింది. దీన్ని గమనించిన స్థానిక పెద్దలు జోక్యం చేసుకుని అల్లాబక్షు కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. సమాచారం అందుకున్న పట్టాభిపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఎంతకీ తలుపులు తీయకపోవడంతో స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్లారు. మృతుడి కుటుంబ సభ్యులను పట్టాభిపురం పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం స్థానికుల సహాయంతో మృతదేహానికి అంత్యక్రియలు జరిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top