‘నేరెళ్ల’ గాయానికి ఏడాది   

One Year To Nerella Incident - Sakshi

బాధితుల న్యాయపోరాటం

జాతీయస్థాయిలో  నేరెళ్ల ఘటనపై చర్చ

వివాదాస్పదమైన దళితులపై ‘థర్డ్‌డిగ్రీ’

సిరిసిల్ల : జాతీయస్థాయిలో రాజకీయంగా రగిలిన నేరెళ్ల ఘటన ఇంకా సలుపుతూనే ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు దళితులపై ‘థర్డ్‌డిగ్రీ’ ప్రయోగించిన ఘటన మానని గాయమైంది. సరిగ్గా నేటికి ఏడాది కిందట జూలై 2న తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వద్ద ఇసుక లారీ ఢీకొని దళితుడు భూమయ్య మరణించిన ఘటన వివాదాస్పదమైంది. ఏడాదిగా బాధితులు న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. 

అసలేం జరిగింది..! 

మధ్యమానేరు జలాశయంలో ముంపునకు గురయ్యే ప్రాంతంలోని ఇసుకను తొలగించేందుకు మైనింగ్‌శాఖ టెండర్లు నిర్వహించింది. చీర్లవంచ, కొదురుపాక ప్రాంతాల నుంచి నిత్యం వందలాది లారీల్లో ఇసుక తరలిపోతుంది. ఇసుక లారీలతో ఏడాదిలో 42 ప్రమాదాలు జరిగాయి. అప్పటికే నలుగురు మృత్యువాత పడ్డారు. జూలై 2న నేరెళ్లకు చెందిన భూమయ్య ఇసుక లారీ ఢీకొ ని మరణించాడు.

దీంతో స్థానికులు ఆగ్రహానికి గురై ఐదు ఇసుక లారీలను తగులబెట్టారు. అడ్డుకున్న పోలీసులపైనా దాడి చేశారు. తంగళ్లపల్లి ఎస్సై సైదారావు, కొందరు పోలీసులు గాయపడ్డారు. లారీ దహనం, పోలీసులపై దాడి చేసిన ఘ టనలో 13మందిపై పోలీసులు కేసు నమోదు చేశా రు. జూలై 4న రాత్రి 11.30 గంటలకు నేరెళ్లకు చెం దిన పెంట బాణయ్య, కోల హరీష్, చెప్పాల బాల రాజు, పసుల ఈశ్వర్‌కుమార్, గంధం గోపాల్, రామచంద్రాపూర్‌కు చెందిన బత్తుల మహేశ్, జిల్లెల్లకు చెందిన కోరుగంటి గణేశ్, చీకోటి శ్రీనివాస్‌నుపోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

నిరాకరించిన జైలర్‌ 

పోలీసులు అరెస్ట్‌ చేసిన వారిని జూలై 8న రిమాండ్‌కు తరలించారు. కరీంనగర్‌ జైలర్‌ నిందితులపై గాయాలు చూసి జైలులోకి తీసుకునేందుకు నిరాకరించారు. పోలీసులు పెయిన్‌కిల్లర్స్‌ ఇచ్చి వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని డాక్టర్‌ సర్టిఫికెట్‌తో జూలై 10న జైలుకు పంపించారు.వీరిలో నలుగురు తీవ్రఅస్వస్థతకు గురికాగా.. కరీంనగర్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జైలర్‌ నిందితుల ఆరోగ్యంగా లేరని నిరాకరించడంతో పోలీసుల థర్డ్‌ డిగ్రీ ఘటన వెలుగులోకి వచ్చింది.  

థర్డ్‌ డిగ్రీ ప్రయోగంపై నిరసన.. 

జైలు ములాఖాత్‌లో తమ వారిని కలిసిన కుటుంబ సభ్యులు పోలీసుల దెబ్బలను చూసి చలించిపోయారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌ తొలుత నిందితులను కలిసి పోలీసుల తీరును తప్పుబట్టారు. అంతకు ముందు టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ వారితో మాట్లాడారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యులు కె.రాములు నేరెళ్లకు వచ్చి బాధితుల గోడు విన్నాడు.

లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ కరీంనగర్, నేరెళ్ల, జిల్లెల్లకు వచ్చి బాధితులను పరామార్శించారు. సీపీఐ నేత నారాయణ, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం, అప్పటి టీడీపీ నేత రేవంత్‌రెడ్డి, టఫ్‌ ప్రతినిధులు, టీమాస్‌ ఫోరమ్‌ ప్రతినిధులు విమలక్క, రిటైర్డు జడ్జి చంద్రకుమార్, దళిత బహుజన సంఘాల నేతలు నేరెళ్ల బాధితుల పక్షాన నిలిచారు. కాంగ్రెస్‌ నేత వి.హన్మంతరావు ఇప్పటికీ బాధితులకు అండగా ఉంటూ.. న్యాయపోరాటానికి మద్ధతు ఇస్తున్నారు. బాధితులు మానవహక్కుల సంఘాన్ని, రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. 

వివాదాస్పదమైన పోలీసుల తీరు.. 

నేరెళ్ల ఘటనతో సిరిసిల్ల పోలీసులు ఆత్మరక్షణలో పడ్డారు. అప్పటి జిల్లా ఎస్పీ విశ్వజిత్‌ కంపాటి ఇంటరాగేషన్‌లో స్వయంగా పాల్గొన్నారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనలో అప్పటి సీసీఎస్‌ ఎస్సై రవీందర్‌ను సస్పెండ్‌ చేశారు. ఎస్పీ విశ్వజిత్‌ కాంపాటి హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. సిరిసిల్ల ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ సైతం బాధితులను వేములవాడలో పరామర్శించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

దీంతో నలుగురు బాధితులు మంత్రి కేటీఆర్‌ మాటకు విలువిచ్చి సరెండర్‌ అయ్యారు. మిగితా నలుగురు ఇంకా న్యాయపోరాటం చేస్తున్నారు. ఇటీవల దేశరాజధాని ఢిల్లీ వరకు వెళ్లి టీఆర్‌ఎస్‌ సర్కారు తీరుపై నిరసన తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top