కలకలం రేపిన వృద్ధురాలి హత్య

Old Woman Assassinated Robbery Gang in Vijayawada - Sakshi

డబ్బు, బంగారం కోసమే ఘాతుకం

ఘటనాస్థలాన్ని పరిశీలించిన క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలు

పోలీసుల అదుపులో అనుమానితులు

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

అవనిగడ్డ సీఐ రవికుమార్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు

కోడూరు(అవనిగడ్డ): డబ్బు, బంగారం కోసం వృద్ధురాలిని దుండగులు వారం రోజుల క్రితం హత్య చేసి డ్రెయిన్‌ పక్కన తాటిబొందల్లో పడవేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూడటంతో దివిసీమలో తీవ్ర కలకలం రేపింది. సేకరించిన వివరాల ప్రకారం.. మండలంలోని లింగారెడ్డిపాలెం శివారు నక్కవానిదారి గ్రామానికి చెందిన మట్టా వీరమ్మ (65) భర్త, ఇరువురు కుమారులు గతంలోనే మృతిచెందడంతో వ్యవసాయ పనులకు వెళ్తూ మరో కుమారుడు బసవమాణిక్యాలరావు వద్ద్ద ఉంటోంది. కూలి పనులకు వెళ్లిగా వచ్చిన డబ్బులను కుదవపెట్టి వీరమ్మ ఇరుగుపొరుగు వారికి వడ్డీకి ఇస్తోంది. వీరమ్మకు గ్రామ సమీపంలోని పొలాల్లో అడపాదడపా జరిగే పేకాట శిబిరాల వద్దకు వెళ్లే అలవాటు ఉంది. అక్కడ పేకాటరాయుళ్లకు కూడా వీరమ్మ నగదును పెట్టుబడి పెడుతుందని గ్రామస్తులు చెప్పారు. ఈ నేపథ్యంలో వీరమ్మ వారం రోజుల నుంచి కనిపించకుండా పోగా.. గురువారం రాత్రి గ్రామ సమీపంలోని రత్నకోడు (తాలేరు) డ్రెయిన్‌ పక్క తాటిబొందల్లో శవమై కనిపించింది.

హత్య కోణంలో పోలీసులు దర్యాప్తు..
గురువారం మధ్యాహ్నం డ్రెయిన్‌ గట్టు వెంట ఉన్న తాటిబొందల ఆకులను నరికేందుకు గ్రామస్తులు వెళ్లగా అక్కడ తీవ్రమైన దుర్వాసన రావడంతో వెళ్లి పరిశీలించడంతో మహిళ మృతదేహం కనిపించింది. దీంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామ వీఆర్వో మేడికొండ బాబురావు ఫిర్యాదు మేరకు తొలుత గుర్తుతెలియని మహిళ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. శుక్రవారం ఉదయం వీరమ్మ కుటుంబసభ్యులు ఘటనాస్థలానికి వచ్చి మృతదేహాన్ని గుర్తుపట్టడంతో పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. వీరమ్మ వారం రోజుల కితం పేకాట శిబిరం వద్దకు వెళ్లగా అక్కడ పేకాటరాయళ్లు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరమ్మ మెడలో ఉన్న బంగారపు నానతాడు, చెవిదిద్దులతో పాటు పెద్దమొత్తంలో డబ్బును దుండగులు అపహరించి, ఎవరికి తెలియకుండా హత్య చేసి ఇలా తాడిబొందల్లో పడేశారనే కోణంతో దర్యాప్తు జరుపుతున్నారు.

డాగ్‌స్క్వాడ్, క్లూస్‌ టీం తనిఖీలు
వీరమ్మ హత్య కేసును ఛేదించేందుకు పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. మచిలీపట్నం నుంచి డాగ్‌స్క్వాడ్, క్లూస్‌ టీంను తీసుకువచ్చి ఘటనాస్థలంలో సోదాలు చేశారు. డాగ్‌స్క్వాడ్‌ గ్రామంలోని పలువురు గృహాల వద్దకు వెళ్లగా, వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని అవనిగడ్డ సీఐ రవికుమార్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు. అప్పటికే కుళ్లిపోయిన వీరమ్మ మృతదేహాన్ని శవపంచనామా అనంతరం ఘటనాస్థలంలోనే అవనిగడ్డ ప్రభుత్వ వైద్యాధికారి కృష్ణదొర పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. త్వరలోనే కేసును ఛేదిస్తామని సీఐ చెప్పారు. ఎస్‌ఐ రమేష్, సిబ్బంది ఘటనాస్థలాన్ని పరిశీలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top