ఈ వయసులో పోరాడే శక్తి, సహనం లేదు..

Old Man Committed Suicide By Writing Suicide Note In West Godavari - Sakshi

తప్పుడు ఫిర్యాదులతో మానసికంగా కుంగిపోయా 

ఆత్మహత్యకు పాల్పడిన వృద్ధుడి మనోవేదన

కంటతడి పెట్టిస్తున్న లక్ష్మీపతిరావు సూసైడ్‌ నోట్‌

సాక్షి, తణుకు: ‘నా వయసు 84 సంవత్సరాలు.. అపార్టుమెంటు కమిటీ సభ్యులు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు.. నన్ను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారు.. ఈ వయసులో నాకు పోరాడే శక్తి లేదు.. ఇలాంటి పోలీసు కేసులు ఎదుర్కొనే సహనం లేదు.. అందుకే నిస్పృహతోనే ఆత్మహత్య చేసుకుంటున్నాను..’ అంటూ వృద్ధుడు సూసైడ్‌ నోట్‌ రాసి మరీ బలవన్మరణానికి పాల్పడిన తీరు కలచివేస్తోంది. జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేసి రిటైర్‌ అయిన కోరుకొండ లక్ష్మీపతిరావు (84) తణుకు సజ్జాపురంలో అపార్టుమెంటు అయిదో అంతస్తు నుంచి కిందకు దూకి బుధవారం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.

అయితే తాను ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసిన కారణాలను పేర్కొంటూ ఆయన రాసిన అయిదు పేజీల లేఖ ఇప్పుడు బయటపడింది. పోలీసులు, మీడియా ద్వారా వాస్తవాలు బయటపడాలంటూ లక్ష్మీపతిరావు రాసిన లేఖ కంటతడి పెట్టిస్తోంది. ఎంతో మంది పేద విద్యార్థులకు చదువు చెప్పిస్తూ ఉచితంగా వసతి కల్పించే లక్ష్మీపతిరావుకు స్థానికంగా మంచి పేరు ఉంది. కోరుకొండ మెమోరియల్‌ ట్రస్టు పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయన ఇంటి ముందు సైతం పేద విద్యార్థులకు చదువు చెప్పించబడును అనే బోర్డు ఏర్పాటు చేయడం విశేషం. (నీళ్లు వేడెక్కాయో లేదోనని..)

గతంలోనూ పోలీసుస్టేషన్‌లో పంచాయితీ
జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేసి రిటైర్‌ అయిన లక్ష్మీపతిరావు జయలక్ష్మీ రెసిడెన్సీ పేరుతో తన సొంత స్థలంలో అపార్టుమెంటు నిర్మించారు. అపార్టుమెంటు ఆనుకుని మరో ఇంట్లో ఆయన నివాసం ఉంటున్నారు. అపార్టుమెంటులో ప్లాట్లు మొత్తం విక్రయించిన ఆయన అయిదో అంతస్తులో ఒక ప్లాటు మాత్రం తన అధీనంలో అద్దెకు ఇస్తూ వస్తున్నారు. గతంలో అపార్టుమెంటు వ్యవహారాలన్నీ లక్ష్మీపతిరావు చూసేవారు. వయసు పెరుగుతుండంతో ఆ బాధ్యతల నుంచి తాను తప్పుకుని కమిటీ ఏర్పాటు చేసి వారికి అప్పగించారు. అయితే కమిటీలో కీలకంగా వ్యవహరిస్తున్న వంక లక్ష్మీకుమారి, శేష అనే ఇద్దరు తనపై తరచూ వాగ్వాదానికి దిగుతున్నారంటూ లేఖలో పేర్కొన్నారు. తన ప్లాటులోకి ఎవర్నీ అద్దెకు రానీయకుండా అడ్డుకోవడంతోపాటు వచ్చిన వారిని ఖాళీ చేయించే వరకు వీరు పోరాడుతుంటారని ఆయన చెప్పుకొచ్చారు. 

ఇదిలా ఉంటే వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న అబ్రహం అనే వ్యక్తితో చేతులు కలిపిన వీరు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయిస్తామంటూ పలు పర్యాయాలు తనను బెదిరించారంటూ లేఖలో ప్రస్తావించారు. అయితే పోలీసులు వారిని హెచ్చరించి పంపించి వేసినట్లు పేర్కొన్నారు. అయినప్పటికీ లక్ష్మీపతిరావును వృద్ధుడనే కనికరం లేకపోగా వేధింపులకు పాల్పడుతుండటంతో తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డారు. వృద్ధులపై వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చట్టాలు అమలు చేసే అధికారం ఉన్న పోలీసులు ఇప్పుడు ఈ వ్యవహారంలో ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఈ వ్యవహారంపై పట్టణ ఎస్సై కె.రామారావును వివరణ కోరగా మృతుడి భార్య జయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top