ఘరానా దొంగల ఆటకట్టు | Sakshi
Sakshi News home page

ఘరానా దొంగల ఆటకట్టు

Published Fri, Dec 27 2019 8:46 AM

Old Criminals Arrest in Robbery Case Hyderabad - Sakshi

కుషాయిగూడ: దొంగతనాలకు పాల్పడుతూ పోలీసుల కళ్లు గప్పి తప్పించుకు తిరుగుతున్న ముగ్గురు పాత నేరస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.4.68 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. గురువారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు చేసిన  విలేకరుల సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ రక్షితమూర్తి వివరాలు వెల్లడించారు. దమ్మాయిగూడ, అంబేడ్కర్‌నగర్‌కు చెందిన సనగాల శ్రీకాంత్, కాప్రా, వంపుగూడకు చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ ఆసిఫ్‌ పాత నేరస్తులు. ఇద్దరూ కలిసి చాలా కాలంగా దొంగతనాలకు పాల్పడుతూ పలుమార్లు పోలీసులకు పట్టుబడ్డారు. వారు చోరీ సొత్తును  అదే ప్రాంతానికి చెందిన చెందిన సనగాల సాయికుమార్‌ సహాయంతో విక్రయించి సొమ్ము చేసుకునేవారు. వారిపై జవహర్‌నగర్‌ పీఎస్‌లో 6, కీసర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఒక కేసు నమోదై ఉన్నాయి. పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చినా తమ పంథా మార్చుకోకుండా చోరీలకు పాల్పడుతున్నారు.

పగటి వేళల్లో కాలనీల్లో రెక్కీ నిర్వహించి తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌ చేసుకునే వీరు రాత్రి పూట పంజా విసిరేవారు. గురువారం ముగ్గురు కలిసి  చోరీ చేసిన బైక్‌పై వెళుతుండగా జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని  దమ్మాయిగూడ ఎక్స్‌రోడ్డులో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు అనుమానంతో వారిని  అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు అంగీకరించారు. వారి నుంచి 5.4 తులాల బంగారు ఆభరణాలు, 1.63 కిలోల వెండి, రెండు బైక్‌లు, 2 ల్యాప్‌టాప్‌లు, నికాన్‌ కెమెరా, నోకియా సెల్‌ఫోన్, హెడ్‌ఫోన్, జియో వైఫై మోడెమ్, 4240 అమెరికన్‌ డాలర్లు, 10 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో సనగాల శ్రీకాంత్, మహ్మద్‌ అబ్దుల్‌ ఆసిఫ్‌లపై పీడీ యాక్ట్‌ నమోదు చేయనున్నట్లు డీసీపీ తెలిపారు. పోలీసులు చేపడుతున్న వాహన తనిఖీలు సత్పలితాలిస్తున్నాయని, నిరంతరం ఈ ప్రక్రియను కొనసాగించాలని సూచించారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన మల్కాజిగిరి సీసీఎస్‌ పోలీసులను అభినందించారు. సమావేశంలో రాచకొండ క్రైం డీసీపీ యాదగిరి,  ఇన్‌స్పెక్టర్లు లింగయ్య, బాలుచౌహన్, జవహర్‌నగర్‌ డీఐ నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement