ఎలుగా.. మజాకా..!

Odisha man tries to click selfie with injured bear - Sakshi

ఫొటో సరదా ప్రాణం తీసింది

యువకుడిపై దాడి చేసిన చంపిన భల్లూకం    

ఒరిస్సా, జయపురం: దారిలో కనిపించిన ఒక ఎలుగుబంటి ఫొటో తీసేందుకు ప్రయత్నించిన యువకుడు అది దాడి చేయడంతో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం నవరంగ్‌పూర్‌ జిల్లా కొడింగ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఈ సంఘటనలో మరణించిన యువకుడిని నవరంగ్‌పూర్‌ జిల్లా పపడహండి సమితి దొలైగుడ గ్రామానికి చెందిన ప్రభుభోత్రగా గుర్తించారు. ప్రభు భొత్ర కొంత మంది మిత్రులతో కలిసి పపడహండి గ్రామం నుంచి బొలెరో వాహనంలో  ఒక  గ్రామానికి వెళ్లి పనులు చూసుకుని వారిని దింపివేసి తిరిగి వాహనంలో ఒక్కడే వస్తున్నాడు. ఈ క్రమంలో కిర్చిమాల ప్రాంతానికి  5 కిలోమీటర్ల దూరంలో గల కుజాగుడ గ్రామ సమీప పొదబొస సంరక్షిత అడవిలో ఒక చెరువు వద్ద  ఎలుగుబంటి  కూర్చుని ఉంది. 

కూర్చున్న ఎలుగుబంటిని చూసిన ప్రభు భొత్ర బొలెరో దిగి  కొంతదూరం నుంచి దాని ఫొటోలు తీసేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో ప్రభుబొత్రను చూసిన ఎలుగుబంటి అకస్మాత్తుగా  దాడి చేసింది. ఈ హఠాత్పరిణామానికి ఖిన్నుడైన ప్రభు ఎలుగుబంటి నుంచి  ప్రాణాలు రక్షించుకోవాలని దాంతో పోరాటం సాగించాడు. అరగంటకు పైగా జరిగిన ఎలుగు–మనిషి పోరాటంలో ఎలుగుబంటి నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు సమీప చెరువులో దూకాడు. అయినా ఎలుగుబంటి విడవలేదు. అతనిపై దూకి గాయపరచడం ప్రారంభించింది. రక్షించండంటూ ప్రాణ భయంతో ప్రభు హాహాకారాలు చేశాడు. దాదాపు మూడు గంటల పాటు హాహాకారాలు చేసినప్పటికీ రక్షించేందుకు ఎవరూ రాలేదు. చివరికి ఎలుగుబంటి చేతిలో ఓటమి చెంది మరణించాడు.

ఈ విషయం తెలిసిన అటవీ విభాగం సిబ్బంది, పోలీసులతో సహా  సంఘటనా స్థలానికి చేరుకుంది . అయితే ఎలుగుబంటి ఎక్కడికో వెళ్లిపోయింది.  పోలీసులు, అటవీ విభాగ సిబ్బంది చెరువులో ఉన్న ప్రభు భొత్ర మృతదేహాన్ని బయటకు తీశారు. రాత్రి కావడం వల్ల చీకటిలో ఎలుగుబంటి జాడ తెలియలేదు. ఎలుగుబంటిని పట్టుకునేందుకు అటవీ సిబ్బంది, పోలీసులు మాటు వేశారు. ఈ సంఘటన స్థానిక ప్రజలలో భయాందోళన రేపింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top