ఏ2 మద్దిలేటిని కస్టడీకి ఇవ్వండి

NIA Team Petition In High Court Over Maddileti Case - Sakshi

హైకోర్టులో ఎన్‌ఐఏ బృందం పిటిషన్‌

మావోయిస్టు సానుభూతిపరుల వివరాల కోసం అన్వేషణ 

గద్వాల క్రైం: నిషేధిత మావోయిస్టు పార్టీతో సంబంధాలు కలిగి ఉన్నారన్న కేసులో అరెస్టయిన వారిలో ఏ2 (టీవీవీ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి)ని తమ కస్టడీకి ఇవ్వాలంటూ జాతీయ విచారణ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) బృందం శనివారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. కాగా, 2019 అక్టోబర్‌ 5న మల్దకల్‌ మండలం ఎల్కూరుకు చెందిన నాగరాజు అలియాస్‌ నాగన్న (ఏ1), నారాయణపేట జిల్లా మక్తల్‌ వాసి బండారి మద్దిలేటి (ఏ2), వనపర్తి జిల్లా పెబ్బేరుకు చెందిన వైనమోని బలరాం (ఏ3), జన గామ జిల్లా బాచణ్‌పేట్‌ వాసి జగన్‌ (ఏ4), మేడ్చల్‌ జిల్లా చాకిరిపురానికి చెందిన చుక్క శిల్ప (ఏ5), జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలం పార్‌చర్ల వాసి గుంత రేణుక (ఏ6), హైదరాబాద్‌కు చెందిన మెంచు రమేశ్‌ (ఏ7), నలమాస కృష్ణ (ఏ8) ను గద్వాల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

వీరంతా సంఘ విద్రోహ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకుని యువతను నిషేధిత కార్యక్రమాల వైపు ప్రేరేపిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. దీంతో అప్పట్లో పలు నివాస గృహాల్లో సోదాలు నిర్వహించి విప్లవ సాహిత్యం, వివిధ లేఖలు, కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్, పెన్‌డ్రైవ్‌లను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా టీవీవీ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి (ఏ2)ని తమ కస్టడీకి ఇవ్వాలంటూ హైకోర్టులో ఎన్‌ఐఏ బృదం పిటిషన్‌ వేయడంతో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మాజీ మవోయిస్టుల ఇళ్లలో తనిఖీ చేసిన సమయంలో లభించిన ఆధారాలను బట్టి ఆయనకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఎంత మంది ఉన్నారనే కోణంలో గద్వాల పోలీసుల సహకారంతో విచారణ చేసే అవకాశం ఉంది. మరోవైపు ఎన్‌ఐఏకు అనుమతి ఇవ్వొద్దంటూ హైకోర్టును నిందితుడి కుటుంబసభ్యులు ఆశ్రయించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top