సిటీ షూట్‌

Nayeem Shoot For LET Pakisthan - Sakshi

ఈ నేపథ్యంలోనే పదేళ్ల క్రితం సిట్‌లో కేసు నమోదు

తాజాగా నయీంను జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించిన పోలీసులు

ట్రయల్‌ నిర్వహణకు అధికారుల ప్రయత్నాలు

కోల్‌కతాలో ఇతడి సహచరు లకు ఉరి శిక్ష విధింపు

సాక్షి, సిటీబ్యూరో: పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరేతోయిబా (ఎల్‌ఈటీ) ఆదేశాల మేరకు సిటీకి వచ్చాడు... మారుపేరుతో పాస్‌పోర్ట్‌ పొందడానికి ప్రయత్నించాడు...ఓ వీడియో కెమెరాతో నగరం మొత్తం తిరుగుతూ కీలక ప్రాంతాలను చిత్రీకరించాడు...ఆ సమయంలో ఓ అనుమానాస్పద బ్యాగ్‌ను కలిగి ఉన్నాడు...ఉగ్రవాది షేక్‌ అబ్దుల్‌ నయీం అలియాస్‌ సమీర్‌ అలియాస్‌ నయ్యూపై నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) ఆధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందంలో (సిట్‌) నమోదైన కేసు పూర్వాపరాలివి. ఇతడిని పీటీ వారెంట్‌పై గురువారం రాత్రి ఢిల్లీలోని తీహార్‌ జైలు నుంచి తీసుకువచ్చిన సిట్‌ పోలీసులు శుక్రవారం జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు.

షేక్‌ సోహైల్‌ పేరుతో పాస్‌పోర్ట్‌కు...
మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన నయీం ఇంజినీర్‌ అయినప్పటికీ ఎల్‌ఈటీకి సానుభూతిపరుడిగా మారాడు. పాకిస్థాన్‌లో ఉన్న ఆ సంస్థకు చెందిన వారి నుంచివచ్చే ఆదేశాలకు అనుగుణంగా నడుచుకున్నాడు. అందులో భాగంగానే ఇతడు 2007 ఫిబ్రవరిలో హైదరాబాద్‌కు వచ్చాడు. అప్పటికి సిటీలోనే ఉన్న ఇతడి సన్నిహితుడు షోయబ్‌ జాగీర్దార్‌ ఇతడిని రిసీవ్‌ చేసుకున్నాడు. హష్మత్‌పేటలోని తన బంధువు ఇంట్లో ఆశ్రయం కల్పించాడు. స్టార్‌ లైన్‌ ట్రావెల్‌ ఏజెన్సీకి చెందిన ట్రావెల్‌ ఏజెంట్‌ నగేష్‌ సహకారంతో సికింద్రాబాద్‌లోని రీజనల్‌ పాస్‌పోర్ట్‌ కార్యాలయం నుంచి దొంగ పాస్‌పోర్ట్‌ పొందడానికి ప్రయత్నించాడు. షేక్‌ సోహైల్‌ పేరుతో రూపొందించిన పత్రాలపై సికింద్రాబాద్‌ వచ్చిన సమీర్‌ సంతకాలు చేశాడు. అక్కడ నుంచి తిరిగి హష్మత్‌పేటలోని ఇంటికి వెళ్ళకుండా నగరంలోని కీలక ప్రాంతాలను చుట్టి వచ్చాడు. ఆ సమయంలో తనతో పాటు ఓ వీడియో కెమెరా తీసుకువెళ్లిన నయీం అనేక కీలక ప్రాంతాలను చిత్రీకరించాడు. ఓ అనుమానాస్పద బ్యాగ్‌ను తన వెంటే ఉంచుకున్నాడు. ఎల్‌ఈటీకి అందించడానికే సిటీలోని కీలక ప్రాంతాలు వీడియో తీశాడని, ‘ఆ బ్యాగ్‌’లో పేలుడు పదార్థాలు ఉన్నాయని పోలీసులు ఆరోపించారు. 

కొన్నాళ్ల తర్వాత వెలుగులోకి...
‘సిటీ టూర్‌’ ముగించుకున్న నయీం మళ్ళీ తన స్వస్థలానికి వెళ్లిపోయాడు. కొన్ని రోజులకు మళ్లీ ఎల్‌ఈటీ నుంచి ఇతడికి మరో సమాచారం అందింది. దాని ప్రకారం ఇతగాడు బంగ్లాదేశ్‌ వెళ్లి కొందరిని కలవాలి. అక్కడ నుంచి ముగ్గురు సుశిక్షుతులైన ఉగ్రవాదుల్ని సరిహద్దులు దాటించి జమ్మూ కాశ్మీర్‌కు చేర్చాలి. కొన్ని నెలల పాటు పాక్‌లో శిక్షణ పొందిన ఈ ఉగ్రవాదుల్లో అక్కడి కరాచీ, హరిపూర్‌లకు చెందిన మహ్మద్‌ యూనస్, అబ్దుల్లాలతో పాటు కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌కు చెందిన ముజఫర్‌ అహ్మద్‌ రాథోడ్‌ ఉన్నారు. కాశ్మీర్‌లో భారీ ఆపరేషన్‌కు ప్లాన్‌ చేసిన ఎల్‌ఈటీ దాని కోసమే వారిని పంపింది. 2007 ఏప్రిల్‌ 4న పశ్చిమ బెంగాల్‌లో ఉన్న 24 పరగణాల జిల్లాలోని పెట్రాపోల్‌ నుంచి ఈ నలుగురూ సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించారు. దీన్ని గమనించిన సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) పట్టుకోవడంతో వీరిపై బన్‌గావ్‌ ఠాణాలో కేసు నమోదైంది. ఈ కేసులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన సీఐడీ అధికారులు దర్యాప్తు చేశారు. ఎంతకీ నోరు విప్పని ఈ ఉగ్రవాదులకు పోలీసులు పాలిగ్రఫీ, నార్కో అనాలసిస్, బ్రెయిన్‌ మ్యాపింగ్‌ వంటి నిజ నిర్థారణ పరీక్షలు చేసింది. ఈ నేపథ్యంలోనే కాశ్మీర్‌ కుట్రతో పాటు ‘సిటీ టూర్‌’ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే సిట్‌ కుట్ర కేసు నమోదు చేసింది. అప్పట్లోనే సిటీకి తీసుకువచ్చి విచారించడంతో పాటు అభియోగపత్రాలు దాఖలు చేసింది. 

ఆ ముగ్గురికీ ఉరి శిక్ష విధింపు...
పశ్చిమ బెంగాల్‌ సీఐడీ అధికారులు ఈ నలుగురిపై 2007 జూన్‌ 29న బన్‌గావ్‌లోని ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేశారు. ఈ కేసుల విచారణ జరుగుతుండగానే కోల్‌కతా పోలీసులు 2014
సెప్టెంబర్‌ 24న సమీర్‌లో మరో కేసుకు సంబంధించి ముంబై కోర్టులో హాజరుపరిచారు. అక్కడ నుంచి తిరిగి హౌరా–ముంబై ఎక్స్‌ప్రెస్‌లో కోల్‌కతాకు తీసుకువెళ్తుండగా... ఖర్సియా–శక్తి రైల్వేస్టేషన్ల మ«ధ్య తప్పించుకుని పారిపోయాడు. దీంతో మిగిలిన ముగ్గురిపై విచారణ పూర్తి చేసిన బన్‌గావ్‌ కోర్టు గత ఏడాది జనవరిలో ఉరి శిక్ష విధించింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న నయీంను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు 2017 నవంబర్‌ 29న లక్నోలో పట్టుకున్నారు. ఆపై విచారణ నిమిత్తం నయీంను ఢిల్లీలోని తీహార్‌ జైల్లో ఉంచారు. నగరంలోని సిట్‌లో నమోదైన కుట్ర కేసులో ట్రయల్‌ నిర్వహించాల్సి ఉండటంతో సిట్‌ నయీంను సిటీకి తీసుకువచ్చింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top