పక్కా స్కెచ్‌ వేశారు.. నగదు కొట్టేశారు!

Navajeevan Express Robbery Case Reveals in PSR Nellore - Sakshi

నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీలో కానిస్టేబుల్స్‌ పాత్ర

విచారణ వేగవంతం చేసిన రైల్వే పోలీసులు

పోలీసుల అదుపులో కొందరు విస్తృత గాలింపు   

నెల్లూరు(క్రైమ్‌): నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ కేసులో చిక్కుముడి వీడుతోంది. సూత్రదారి టీడీపీ నేత కాగా పాత్రదారులు చట్టాన్ని రక్షిచాల్సిన ఖాకీలేనని తేలింది. దీంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి సదరు ఖాకీల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిసింది. వివరాలిలా ఉన్నాయి. కావలికి చెందిన మహిళ ఓ బంగారు వ్యాపారి వద్ద çఎంతోకాలంగా పనిచేస్తోంది. ఆమె ద్వారానే సదరు వ్యాపారి బంగారాన్ని చెన్నై నుంచి తెప్పించుకునేవాడు. నమ్మకస్తురాలు కావడంతో పెద్దమొత్తంలో నగదు ఇచ్చి చెన్నైకి పంపేవాడు. ఆమె సైతం నమ్మకంగా బంగారు బిస్కెట్లను కొనుగోలు చేసుకుని తీసుకువచ్చేది.

టీడీపీ నాయకుడి పరిచయం
ఈ క్రమంలో సదరు మహిళకు కావలి రూరల్‌ మండలం చెన్నాయపాళెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రవితో పరిచయమైంది. ఇద్దరూ సన్నిహితంగా మెలగసాగారు. బంగారు వ్యాపారిని ఎలాగైనా బురిడీ కొట్టించి నగదు దోచుకోవాలని ఇద్దరూ పన్నాగం పన్నారు. ఇదే విషయాన్ని రవి తన బంధువైన ఓ కానిస్టేబుల్‌తో చర్చించి సహకరించాలని కోరాడు. అందుకు అతను అంగీకరించడంతో అందరూ కలిసి సమయం కోసం వేచిచూడసాగారు. ఎన్నికల రూపంలో వారికి అవకాశం లభించింది. ఎన్నికల సమయంలో పోలీసు తనిఖీలు అధికంగా ఉండే అవకాశం ఉండడం వారికి లాభించింది. ఇటీవల సదరు వ్యాపారి రూ.50 లక్షలు ఆ మహిళకు ఇచ్చి సీజన్‌బాయ్‌తో కలిసి చెన్నైకి వెళ్లి బంగారు బిస్కెట్‌లు తీసుకురావాలని సూచించాడు.

వెంబడిస్తూ..
ఇదే అదునుగా భావించిన ఆ మహిళ విషయాన్ని రవికి తెలియజేసింది. తనతోపాటు స్నేహితురాలు, సీజన్‌బాయ్‌ నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌లో చెన్నై వెళుతున్నామని చెప్పింది. రవి తన బంధువైన కానిస్టేబుల్‌కు ఫోన్‌ చేసి విషయాన్ని చెప్పాడు. అతని సూచనల మేరకు రవి ఆమెను వెంబడిస్తూ అదే రైలులో చెన్నైకి బయలుదేరాడు. కావలిలో రైలు ప్రారంభమైన నాటి నుంచి రవి కానిస్టేబుల్‌కు ఫోన్‌లో టచ్‌లో ఉన్నాడు. రైలు నెల్లూరులో ఆగగానే ఇద్దరు వ్యక్తులు పోలీసు వేషంలో బోగీలోకి చొరబడి మహిళను ఆమెతోపాటు ఉన్న సీజన్‌బాయ్, స్నేహితురాలిని అటకాయించారు. తాము పోలీసులమని వారిని బెదిరించి వారి వద్ద నున్న రూ.50 లక్షలు నగదు దోచుకుని గూడూరు రైల్వేస్టేషన్‌కు కొద్దిదూరంలోనే రైలులో నుంచి దిగిపోయినట్లు సమాచారం. దీంతో ఆ మహిళ జరిగిన విషయాన్ని తన యజమానికి తెలియజేసి కావలికి వెళ్లింది. యజమాని సూచనల మేరకు రెండోరోజుల అనంతరం ఆమె దోపిడీ ఘటనపై గూడూరు రైల్వే పోలీసులకు సమాచారం అందించింది. నెల్లూరు రైల్వే డీఎస్పీ డాక్టర్‌ వసంతకుమార్, సీఐ దశరథరామయ్యల ఆదేశాల మేరకు గూడూరు రైల్వే పోలీసులు ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేశారు. సిబ్బందిని బృందాలుగా ఏర్పాటుచేసి విభిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఫోన్‌ కాల్‌ డీటైల్స్, టవర్‌ లొకేషన్, రైల్వేస్టేషన్‌లోని సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ వేగవంతం చేశారు.

వీడుతున్న చిక్కుముడి
దోపిడీ అనంతరం నగదును రవి, ఆ మహిళ, కానిస్టేబుల్స్‌ పంచుకున్నట్లు తెలిసింది. దోపిడీ ఘటనపై ఫిర్యాదు చేసిన మహిళ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో రైల్వే పోలీసులు తొలుత ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ మహిళ ఫోన్‌ను పరిశీలించగా ఒకే నంబర్‌కు పెద్ద సంఖ్యలో కాల్స్‌ వెళ్లినట్లు గుర్తించారు. సదరు ఫోన్‌ నంబర్‌ టీడీపీ నాయకుడు రవిదని తేలడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విభిన్న కోణాల్లో విచారించడంతోపాటు అతని కాల్‌ డీటైల్స్‌ పరిశీలించగా కానిస్టేబుల్, అతని స్నేహితులైన మరో ఇద్దరు కానిస్టేబుల్స్‌ పాత్ర ఉన్నట్లుగా వెల్లడైనట్లు సమాచారం. దీంతో పోలీసులు రవిని వెంటబెట్టుకుని కానిస్టేబుల్‌ ఇంటికి వెళ్లి అక్కడ రూ.6 లక్షలు నగదు, నెల్లూరు ఉడ్‌హౌస్‌ సంఘంలో నివాసం ఉంటున్న ఓ మహిళ ఇంట్లో రూ.15 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దోపిడీలో పాత్రదారులైన వారు ఏపీఎస్పీ కానిస్టేబుల్స్‌ అని తేలింది. వారు ప్రస్తుతం విజయవాడలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలియడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. వీరితోపాటు ఇంకెవరైనా ఈ ఘటనలో ఉన్నారా అన్న వివరాలను సైతం రైల్వే పోలీసులు సేకరిస్తున్నారు. ఈ తరహా నేరాలు ఇంకేమైనా చేశారా అన్న కోణంలో సై తం పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటన జిల్లాలో జిల్లాలో సంచలనం రేపింది.

గతంలోనూ..
2015లో ఇదే తరహాలో నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ జరిగింది. కావలికి చెందిన ఇద్దరు బంగారు వ్యాపారులు రూ.86.55 లక్షలు నగదుతో నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌లో చెన్నైకి బయలుదేరారు. కొందరు వ్యక్తులు రైలులో ఎక్కి తాము పోలీసులమని, లెక్కలు చూపాలని వ్యాపారులను బెదిరించి నగదు దోచుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అప్పట్లో ఓఎస్డీ, ఏఆర్‌ కానిస్టేబుల్స్‌ను పోలీసులను అరెస్ట్‌ చేశారు. తాజా ఘటనలో సైతం ఏపీఎస్పీ కానిస్టేబుల్స్‌ దోపిడీకి పాల్పడడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ తరహా నేరాలు తరచూ రైళ్లలో చోటుచేసుకుంటూనే ఉన్నాయి. బంగారు వ్యాపారమంతా జీరో బిజినెస్‌ కావడంతో అధికశాతం మంది వ్యాపారులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top