వీడని చిక్కుముడులెన్నో..?

mystery on five members suicide case - Sakshi

ప్రభాకర్‌రెడ్డి ఘటనపై ముమ్మర దర్యాప్తు

సెల్‌ఫోన్‌లు మాయం కావడంతో ఆలస్యం

ఇంటినుంచి ల్యాప్‌టాప్‌ స్వాధీనం

షేర్‌ అకౌంట్ల పరిశీలన

మణికొండ: నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చెట్టపొదల్లో మూడు, కారులో రెండు మృతదేహాలు లభ్యమైన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బుధవారం అశోక్‌నగర్‌లోని అతని ఇంట్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు షేర్‌ మార్కెట్‌కు సంబందించిన  పత్రాలు, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. తన భార్య మాధవి(28), కుమారుడు వశిష్ట్‌రెడ్డి(రెండున్నరేళ్లు), పిన్ని కొండాపురం లక్ష్మి(45), ఆమె కుమార్తె సిందూజ(16)లకు పథకం ప్రకారం విషం ఇచ్చి మృతి చెందిన తర్వాత వారిని చోట చెట్ల పొదల్లో పడేసి, తన కుమారునితో పాటు రెండు కిలోమీటర్ల దూరం వెళ్లిన ప్రభాకర్‌రెడ్డి కుమారునితో పాటు విషం తీసుకుని చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు.  అమీన్‌పూర్‌లో ఓ స్థలాన్ని కొనుగోలు చేసి అపార్ట్‌మెంట్‌ నిర్మించాలనుకున్న అతను సదరు స్థలం డిఫెన్స్‌ భూమిగా తేలటంతో కోలుకోలేని దెబ్బ పడింది.

అప్పటికే అధిక ఆదాయం చూపుతూ బంధువులు, మిత్రుల నుంచి పెట్టుబడుల కోసం తీసుకున్న అతను మాట నిలుపునే క్రమంలో అప్పులపై అప్పులు చేసినట్లు సమాచారం. తన వద్ద పెట్టుబడులు పెట్టిన వారికి అధిక వడ్డీకి డబ్బులు తిరిగి ఇచ్చేవాడని తెలిపారు. ప్రభాకర్‌రెడ్డిని నమ్మి అతనివద్ద షేర్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడంతో పాటు, వడ్డీకి డబ్బును ఇచ్చిన వారు వందమందికి పైగా ఉన్నట్లు సమాచారం. శంకర్‌పల్లి మండలం పామెన గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ప్రభాకర్‌రెడ్డికి రూ. 5కోట్ల వరకు అప్పు ఇచ్చాడని, ప్రభాకర్‌ రెడ్డి ఆత్మహత్య చేసుకోవటంతో అతను షాక్‌కు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. ప్రభాకర్‌రెడ్డి అప్పులు రూ. 30నుంచి రూ.50కోట్ల వరకు ఉండవచ్చునని స్థానికులు పేర్కొంటున్నారు.

ఆర్ధిక లావాదేవీలే కారణం: రమణగౌడ్, నార్సింగి సీఐ ప్రభాకర్‌రెడ్డి ఆర్ధిక లావాదేవీలే ఐదుగురి మృతికి కారణంగా భావిస్తున్నాము. అతని షేర్‌మార్కెట్, రియల్‌ఎస్టేట్, చేసిన అప్పుల వివరాలను తెలుసుకుంటున్నాం. వారి సెల్‌ఫోన్‌లు కనిపించనందున విచారణలో జాప్యం జరుగుతోంది.  అవన్నీ బయటకు వస్తే ఆత్మహత్యలకు కారణం తెలుస్తుంది. త్వరలోనే చిక్కుముడి విప్పుతాం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top