ఏ తల్లి చేయకూడని పనిచేసింది!

Mother kills kids and elopes with lover - Sakshi

బిడ్డలను హతమార్చి.. ప్రియుడితో పరార్‌

సాక్షి ప్రతినిధి, చెన్నై: వివాహేతర సంబంధం, ప్రియునిపై పెంచుకున్న మోజుతో కన్నబిడ్డలనే కనికరం చూపకుండా ఓ తల్లి విషమిచ్చి హతమార్చింది. ఆపై ప్రియునితో పరారైన దారుణ ఘటన తమిళనాడులో శనివారం జరిగింది. చెన్నై కున్రత్తూరుకు చెందిన విజయ్‌ (30) చెన్నైలోని ఒక ప్రైవేట్‌ బ్యాంక్‌లో గృహరుణాల విభాగంలో పనిచేస్తున్నాడు. అతనికి భార్య అభిరామి (25), కుమారుడు అజయ్, కుమార్తె కారుణిక (4) ఉన్నారు. పని ఎక్కువగా ఉండటంతో విజయ్‌ శుక్రవారం రాత్రి బ్యాంకులోనే నిద్రించి శనివారం తెల్లవారుజామున ఇంటికి వచ్చాడు. ఇంటి ప్రధాన ద్వారానికి బయటవైపు గొళ్లెంపెట్టి ఉండడంతో తలుపులు తెరుచుకుని లోనికి వెళ్లగా పిల్లలిద్దరూ నోట్లో నురగతో విగతజీవులుగా పడిఉండడాన్ని చూశాడు.

భార్యకోసం వెతికిచూడగా ఆమె కనపడలేదు. ఇద్దరు పిల్లలను ఒడిలో పడుకోపెట్టుకుని పెద్దపెట్టున రోదిస్తున్న శబ్దాన్ని విని ఇరుగుపొరుగూ గుమికూడారు. విషయం తెలసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని జనాన్ని అదుపుచేసి మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. భార్యాభర్తల మధ్య తరచూ తగాదాలు చోటుచేసుకునేవని, అభిరామికి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని ఈ కారణంతోనే  అభిరామి పిల్లల్ని హతమార్చి ప్రియునితో వెళ్లిపోయిందని ప్రాథమిక విచారణలో తేలింది. అభిరామి, ప్రియుడిని పట్టుకునేందుకు పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. అదే ప్రాంతంలో పేరొందిన ఒక బిరియానీ దుకాణ యజమానైన అభిరామి ప్రియుడు సుందర్‌ (25)ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సుందర్‌ను పోలీసులు విచారించగా, అభిరామి, తాను కలసి పిల్లలకు పాలల్లో విషం కలిపి చంపేసినట్లు ఒప్పుకున్నాడు. భర్తకు కూడా విషం కలిపిన పాలను సిద్ధం చేయగా అతడు రాత్రి ఇంటికి రాలేదని చెప్పాడు. నిందితురాలు అభిరామి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top