బాల సదనంలో చిన్నారిపై లైంగిక దాడి

molestation on little girl at balasadan in kakinada - Sakshi

మరో చిన్నారిపై లైంగిక దాడి యత్నం 

కాకినాడ బాల సదనంలో ఘటన

చిన్నారులు చెప్పినా పట్టించుకోని నిర్వాహకులు 

పోలీసులకు ఎన్‌జీవో ఫిర్యాదు

ఘటనను దాచేందుకు స్త్రీ, శిశు సంక్షేమశాఖాధికారుల యత్నం  

కాకినాడ క్రైం: తూర్పుగోదావరి జిల్లాలో స్త్రీ శిశుసంక్షేమ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బాల సదనంలో ఓ చిన్నారిపై లైంగిక దాడి, మరో చిన్నారిపై లైంగిక దాడికి యత్నం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. బాల సదనానికి వెళ్లిన స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు బాధిత చిన్నారులు విషయాన్ని చెప్పడంతో వారు గురువారం కాకినాడ రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటన వెలుగులోకి రాకుండా స్త్రీ శిశు సంక్షేమ శాఖాధికారులు ప్రయత్నించడం పలు అనుమానాలకు తావిస్తోంది. బాల సదనంలో పదేళ్ల వయసున్న చిన్నారులు చదువుకుంటున్నారు. వివిధ స్వచ్ఛంద సేవాసంస్థలకు చెందిన ఎన్‌జీవోలు పిల్లల ఆలనాపాలనా చూడడంతో పాటు.. ఏ ప్రాంతంలోనైనా అనాథ బాలలు కనిపిస్తే తీసుకొచ్చి ఈ సదనంలో చేర్చుతారు.

ఇదే తరహాలో 17వ తేదీన ‘లవ్‌ టూ సర్వే ఫౌండేషన్, లిటిల్‌ హార్ట్స్‌ ఫౌండేషన్‌’కు చెందిన ప్రతినిధులు ఇద్దరు అనాథ చిన్నారులను సదనంలో చేర్చేందుకు వచ్చారు. అదే సమయంలో నాలుగో తరగతి చదువుతున్న ఇద్దరు చిన్నారులు ఏడుస్తూ వచ్చి 16వ తేదీ అర్ధరాత్రి ఓ యువకుడు వచ్చి కత్తితో బెదిరించి అత్యాచారం చేశాడని, మరో చిన్నారిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించగా చెయ్యిని గట్టిగా కొరకడంతో వదిలేసి పారిపోయాడని చెప్పారు. నిర్వాహకులకు చెప్పినా వారు పట్టించుకోలేదని విలపించారు. దీంతో నివ్వెరపోయిన ఎన్‌జీవో ప్రతినిధులు ఈ ఘటనపై బాల సదనం నిర్వాహకులను నిలదీయగా వారు ఎన్‌జీవో ప్రతినిధులపైనే చిర్రుబుర్రులాడారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తెలిసిన వ్యక్తి పనే..
విషయం తెలుసుకున్న చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్‌పర్సన్‌ పద్మావతి బాల సదనానికి వచ్చి అప్పటికే అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇటీవల జగ్గంపేట, కాకినాడ దమ్ములపేట తదితర ప్రాంతాల్లో చిన్నారులపై జరిగిన అత్యాచార కేసుల పరిశీలన నిమిత్తం వచ్చిన రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు డాక్టర్‌ రాజ్యలక్ష్మి, ఐసీడీఎస్‌ పీడీ సుఖజీవన్‌బాబులు కూడా బాలసదనం కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బాధిత చిన్నారితో తాము మాట్లాడామని ఇది తెలిసిన వ్యక్తి పనేనని.. పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నట్టు చెప్పారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ ఎ.నాగమురళి తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top